iDreamPost

కల్ట్ క్లాసిక్ ఫార్ములా మార్చాల్సిందే

కల్ట్ క్లాసిక్ ఫార్ములా మార్చాల్సిందే

ఇటీవలే విడుదలైన ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఆశించిన స్థాయిలో అంచనాలు అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర బాగా నెమ్మదించింది. థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న 8 కోట్లకు పైగా షేర్ ని రాబట్టడం సవాల్ గానే కనిపిస్తోంది. హీరో హీరోయిన్ మధ్య కులాల అంతరాలనే మరోసారి కథగా తీసుకుని దర్శకుడు కరుణ కుమార్ చేసిన ప్రయత్నం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. నిజానికి దీనిలో ‘ఉప్పెన’ ఛాయలు కనిపించడం ప్రభావం చూపించింది. ఇదే డైరెక్టర్ తీసిన ‘పలాస’ తాలూకు రెఫరెన్సులు కూడా ఇందులో చాలానే ఉన్నాయి. రఘుబాబు మీద మూత్రం పొసే సన్నివేశం కూడా ‘కృష్ణం వందే జగద్గురుమ్’లో చూసిందే కదా అనిపించక మానదు.

రాను రాను ఈ కులం కార్డు ప్రేమకథలు రొటీన్ గా మారుతున్నాయన్న మాట వాస్తవం. ఆ మధ్య ఆనంద్ దేవరకొండ తో వచ్చిన ‘దొరసాని’ కూడా ఇదే తరహా కథాంశమే. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేసుకోవడం అన్న ఒక్క పాయింట్ తప్ప మిగిలిన వ్యవహారమంతా చూసినట్టుగానే అనిపిస్తుంది. దీనికి స్ఫూర్తి మరాఠి ‘సైరాత్’ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘రంగస్థలం’లోనూ ఇలాంటి అంతరాలను చూపించినప్పటికీ అది హీరో విలన్ కు మధ్య ఉండే తప్ప ప్రేమజంటకు ముడిపెట్టలేదు. కల్ట్, రియాలిటీ, ఒరిజినాలిటీ పేరుతో పదే పదే ఒకే తరహా కులం కార్డు లవ్ స్టోరీలను చూపిస్తూ పోతే బోర్ కొట్టక ఇంకేం చేస్తుంది.

కాన్సెప్ట్ ఏదైనా సినిమా బాగుంటే జనం ఆధరిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కాకపోతే ట్రీట్మెంట్ లో అయినా ఫ్రెష్ నెస్ ఉండాలి. అందులోనూ ఈ మధ్య మనకు అరవ స్ఫూర్తి కూడా పెరుగుతోంది. శ్రీదేవి సోడా సెంటర్ లో హీరోయిన్ తండ్రి కులపెద్దను తీసుకొచ్చి దుర్మార్గానికి ఒడి కట్టడం అనేది తమిళంలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘పరియేరుమ్ పెరుమాళ్’ నుంచి తీసుకున్నదే. అందులో హీరోయిన్ కూడా ఆనందినే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒకటి మాత్రం వాస్తవం. షాకింగ్ క్లైమాక్స్ ఒక్కటి సెట్ చేసుకుని కేవలం కులం కార్డుతో రిపీట్ ఫార్ములాతో వస్తే మాత్రం జనం ప్రతి సినిమాను ఆదరిస్తారన్న గ్యారెంటీ లేదు. దానికి సాక్ష్యాలు కళ్ళముందే కనిపిస్తున్నాయిగా.

Also Read : క్యూట్ వరుడికి ఘాటు వధువు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి