iDreamPost

చంద్రబాబు అమ్ముల పొదిలో కొత్త అస్త్రం

చంద్రబాబు అమ్ముల పొదిలో కొత్త అస్త్రం

రాజకీయాల్లో ఎప్పుడు.. ఎవరిని.. ఎక్కడ.. ఎలా వాడాలో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుకు తెలిసినంతగా మరెవరికీ తెలిదని పరిశీలకు అంటుంటారు. సందర్భాలకు తగినట్లుగా సంధించడానికి బాణాలను ఆయన సిద్ధం చేకుంటారని ఇప్పటికే పలుమార్లు రుజువైంది. ప్రస్తుతం చంద్రబాబు అమ్ముల పొదిలో కొత్త బాణం చేరిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ బాణం ఎవరో కాదు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ.

ప్రజల కష్టాలు, సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపై పోరాటాలు చేయాల్సిన కాంమ్రేడ్‌ రామకృష్ణ.. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్నారన్న విమర్శలు వ్యక్తమవతున్నాయి. ఈ విమర్శలకు బలం చేకూరేలా ఆయన చర్యలుండడం గమనార్హం. అమరావతి పరిధిలోని 29 గ్రామాల రైతుల నుంచి భూములు బలవంతంగా లాక్కుంటున్నారని, మూడుపంటలు పండే భూములను తీసుకోవడం వ్యతిరేకిస్తున్నామంటూ.. గత ప్రభుత్వ హయాంలో ఆందోళనలు, నిరసనలు సాగించిన రామకృష్ణ ఇప్పుడు ఒక్కసారిగా ప్లేట్‌ ఫిరాయించారు. రాష్ట్ర ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా మూడు రాజధానులు వద్దంటూ.. అమరావతే కావాలంటూ చంద్రబాబు వెంట తిరుగుతున్నారు. చంద్రబాబును మించి ప్రభుత్వం, సీఎం వైఎస్‌ జగన్, మంత్రులపై విమర్శలు చేశారు.

తాజాగా ఆయన బుధవారం అనంతపురంలోని కియా కార్ల ఫ్యాక్టరీని పరిశీలించే పేరుతో అక్కడకి వెళ్లారు. కియా పరిశ్రమ తమిళనాడుకు తరలిపోతుందన్న వార్తలు వచ్చాయని, అందుకే అక్కడ పరిస్థితులు పరిశీలించేందుకని వచ్చానని తనను అడ్డుకున్న పోలీసులతో చెప్పారు. కియాపై ఎలాంటి ప్రచారం సాగింది అందిరికీ తెలిసిందే. దానిని ఖండిస్తూ స్వయంగా కియా ఎండీనే ప్రకటన చేశారు. టీకప్పులో తుఫానులాగా కియా వ్యవహారం ఒక్క రోజులో ముగిసింది. ఈ విషయంలో నానా యాగీ చేసిన తెలుగుదేశం పార్టీ, దాని అనుకూల మీడియా కూడా మరుసటి రోజు నుంచి ఆ విషయాన్ని వదిలేయడం ఇక్కడ గమనార్హం. అలాంటిది ఇన్ని రోజులు తర్వాత రామకృష్ణ కియా ఫ్యాక్టరీని పరిశీలించేందుకంటూ.. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రధానిమోదీతో భేటీ అయ్యే సమయంలో వెళ్లడం ఎవరి ప్రయోజనం కోసం..? ఎవరి చేతిలో అస్త్రం అయ్యేందుకు వెళ్లారు..?

కియా విషయంలో ఏపీ ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం, కియా ఎండీల నుంచి ప్రకటనలు వచ్చినా రామకృష్ణ ఈ పర్యటన చేపట్టడం వెనుక ఉద్దేశం ఏమిటి..? ఇప్పటికే కమ్యూనిస్టులు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా మద్ధతు కోల్పోయారు. గత రెండు శాసన సభల్లో ప్రాతినిధ్యం దక్కలేదు. సొంత జెండా, అజెండా లేకుండా.. ఇతర పార్టీల (నిన్న జనసే. నేడు టీడీపీ) వెంట పోతూ.. ఆయా పార్టీల అజెండాను నెత్తికెత్తుకోవడం వల్ల బలపడబోమన్న విషయం రామకృష్ణ ఎప్పటికి గుర్తిస్తారో..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి