iDreamPost

‘బిగ్‌బాస్‌’ను నారాయణ వదిలేటట్టు లేడు..!

‘బిగ్‌బాస్‌’ను నారాయణ వదిలేటట్టు లేడు..!

నారాయణ పగపట్టారు. అవును మీరు చదువుతున్నది నిజమే.. సీపీఐ నారాయణ బిగ్‌బాస్‌ రియాలిటీ షోపై పగపట్టారు. గత ఏడాది బిగ్‌ బాస్‌ సీజన్‌ 6 జరుగుతున్న సమయంలోనే సదరు షోను తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. సోషల్‌ మీడియాలో ఓ వీడియోను నారాయణ పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్‌ కావడం, న్యూస్‌ ఛానెళ్లు నారాయణతో డిబేట్లు నిర్వహించడంతో బిగ్‌బాస్‌ షోపై, నారాయణ తీరుపై చర్చ జరిగింది. బిగ్‌బాస్‌ షోను నారాయణ ఏకంగా బ్రోతల్‌ హౌస్‌గా అభివర్ణించడం వివాదాస్పదమైంది. ఆయన తీరును బిగ్‌బాస్‌ పూర్వ సీజన్ల కంటెస్టెంట్లు తీవ్రంగా వ్యతిరేకించారు.

నారాయణ తీరుపై ప్రజల్లోనూ వ్యతిరేకత వ్యక్తమైంది. అయినా నారాయణ పట్టువదలని విక్రమార్కుడులా బిగ్‌బాస్‌పై పోరాటం చేస్తామనేలా ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా ఆయన బిగ్‌బాస్‌పై మరోసారి తన వైఖరిని కుండబద్ధలు కొట్టారు. బిగ్‌బాస్‌ షోకు వ్యతిరేకంగా డిజిటల్‌ ప్రచారం చేస్తున్నామని వెల్లడించారు. బిగ్‌బాస్‌ షో బ్రోతల్‌ హౌస్‌గా మారిందని మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లైసెన్స్‌ పొందిన వ్యభిచార గృహం నిర్వహించడానికే బిగ్‌బాస్‌ షో నిర్వహిస్తున్నారని నారాయణ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.

నారాయణ తాజా స్పందన చూస్తుంటే.. బిగ్‌బాస్‌పై దీర్ఘకాలిక పోరాటం చేసేలా కనిపిస్తున్నారు. న్యాయపోరాటం చేస్తానని చెప్పిన నారాయణ.. తాజాగా బిగ్‌బాస్‌ షోకు వ్యతిరేకంగా డిజిటల్‌ ప్రచారం చేస్తామని చెప్పడం.. రాబోయే సీజన్‌ ప్రారంభంలో బిగ్‌బాస్‌పై మరోసారి చర్చ జరిగే అవకాశం లేకపోలేదు. ఈ ఏడాది బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 7 జరగబోతోంది. ఆ షోలు ఇప్పటి వరకు వివిధ రంగాలకు చెందిన అనేక మంది పాల్గొన్నారు. సినిమా, సీరియల్‌ నటులే కాదు.. రచయితలు, డ్యాన్సర్లు, యూట్యూబ్‌లో ఫేమస్‌ అయిన వారు, జర్నలిస్టులు.. ఇలా అనేక రంగాల వారు పాల్గొన్న బిగ్‌బాస్‌షోను నారాయణ ఏకంగా బ్రోతల్‌ హౌస్‌తో పోల్చడం ఏ మాత్రం సరికాదనే వ్యాఖ్యలున్నాయి.

సీపీఐ జాతీయ కార్యదర్శిగా పని చేస్తున్న నారాయణ.. అంతకు ముందు ఏపీ కార్యదర్శిగా పని చేశారు. కమ్యూనిస్టులు అంటే ప్రజా సమస్యలపై నిత్యం పోరాటాలు చేస్తారనే పేరు. అయితే ఆ భావన కామ్రేడ్ల తీరుతో రానురాను ప్రజల్లో తొలగిపోతోంది. ఇప్పుడు సీనియర్‌ నేత అయిన నారాయణ కూడా ప్రజా సమస్యలు లేనట్లుగా… బిగ్‌బాస్‌కు వ్యతిరేకంగా డిజిటల్‌ ప్రచారం చేస్తున్నామంటూ చెప్పడం విడ్డూరంగా ఉంది. ఈ తరహా తీరుతో సీపీఐ నేతలు వ్యవహరిస్తే.. రాబోయే కాలంలో ఆ పార్టీ ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం లేకపోలేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి