iDreamPost

దేశంలోకి కొత్త వేరియంట్‌.. నిపుణుల అంచనాలు నిజమవుతాయా..?

దేశంలోకి కొత్త వేరియంట్‌.. నిపుణుల అంచనాలు నిజమవుతాయా..?

రంగులు మార్చే ఊసరవెల్లి కన్నా మిన్నగా కరోనా వైరస్‌ తన రూపును మార్చుకుంటూ ప్రజలపై దాడి చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కొత్త మ్యూటెంట్లు పుడుతూనే ఉన్నాయి. ప్రపంచం కుగ్రామం కావడంతో కొత్త వేరియంట్‌ ఏ దేశంలో పుట్టినా.. అది ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. తాజాగా భారత్‌లో కరోనా కొత్త వేరియంట్‌ వెలుగులోకి వచ్చింది. మూడో వేవ్‌లో ప్రజలపై పెద్దగా ప్రభావం చూపకపోయినా.. వేగంగా వ్యాపించిన ఒమిక్రాన్‌ ఉప వేరియంట్‌ అయిన ఎక్స్‌ఈ వేరియంట్‌ దేశ రాజధాని ముంబైలో బయటపడింది. విదేశాల నుంచి వచ్చిన వారికి పరీక్షలు చేయగా.. అందులో ఒకరికి ఒమిక్రాన్‌ ఉప వేరియంట్‌ ఎక్స్‌ఈ సోకినట్లు నిర్థారణ అయింది.

ఒమిక్రాన్‌ ఎక్స్‌ఈ వేరియంట్‌ బ్రిటన్‌లో పుట్టింది. ఈ ఏడాది జనవరి 19వ తేదీన బ్రిటన్‌లో వెలుగులోకి వచ్చింది. ఇది ఒమిక్రాన్‌ కన్నా పది రెట్లు వేగంగా వ్యాపించే లక్షణం కలది కావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం బ్రిటన్‌లో ఈ వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది. రోజువారీ కేసులు 50 వేలకు పైగా నమోదవుతున్నాయి. బ్రిటన్‌లో వ్యాపిస్తున్న ఎక్స్‌ఈ వేరియంట్‌ దేశంలోకి ప్రవేశించడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కొత్త వేరియంట్‌ వ్యాపించకుండా చర్యలు చేపట్టింది. ఇప్పుడిప్పుడే కోవిడ్‌ నుంచి భారత్‌ కోలుకుంటోంది. ఆర్థిక వ్యవస్థ గాడినపడుతోంది. ప్రస్తుతం రోజు వారీ కేసులు 1000–1100 మధ్య నమోదవుతున్నాయి.

నాలుగో వేవ్‌ వచ్చే అవకాశం ఉందా..?

దేశంలో నాలుగో వేవ్‌ వస్తుందని నిపుణులు అంచనాలు వేశారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌ విశ్లేషణ ప్రకారం కొత్త వేరియంట్‌ పుడితే.. నాలుగో వేవ్‌ ఈ ఏడాది జూన్‌లో మొదలవుతుంది. ఆగష్టులో పీక్‌ స్టేజికి చేరుకుంటుంది. అక్టోబర్‌ చివరికి నాలుగో వేవ్‌ ముగుస్తుంది. పొరుగుదేశాల్లో కోవిడ్‌ కొత్త వేరియంట్లు విజృంభిస్తుండడంతో నాలుగో వేవ్‌ వచ్చే ప్రమాదం ఉందంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు చేసింది. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. నాలుగో వేవ్‌ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది. కోవిడ్‌ మార్గదర్శకాలు పటిష్టంగా అమలు చేయాలని పేర్కొంది.

కోవిడ్‌కు అంతం ఎప్పుడు..?

ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లు పుడుతుండడంతో కరోనాకు అంతం ఎప్పుడు అవుతందనే ప్రశ్న అందరిలోనూ నెలకొంది. కరోనా వెలుగులోకి వచ్చి రెండేళ్లు దాటింది. దాని ప్రభావంతో ప్రపంచం అతలాకుతలమైంది. ప్రాణ, ఆర్థిక నష్టం ఎనలేనిది. ఇంకా ఎన్నేళ్లు కోవిడ్‌ ఉంటుందనే ప్రశ్నకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కూడా ఖచ్చితంగా చెప్పలేకపోతోంది. ప్రస్తుతం ప్రపంచం కోవిడ్‌ మధ్యలో ఉందని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. మరో రెండేళ్లపాటు అప్రమత్తంగా ఉంటే కోవిడ్‌ అంతం అవుతుందనే అంచనాలను డబ్ల్యూహెచ్‌ఓ వేస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి