iDreamPost

రెండు బూస్టర్ డోసులు.. అయినా కరోనా.. ఐసోలేషన్ లో అమెరికా ఉపాధ్యక్షురాలు..

రెండు బూస్టర్ డోసులు.. అయినా కరోనా.. ఐసోలేషన్ లో అమెరికా ఉపాధ్యక్షురాలు..

కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. చైనాలో మళ్లీ కొన్ని నగరాల్లో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అగ్రరాజ్యం అమెరికాలో కూడా కేసుల తీవ్రత ఎక్కువగానే ఉంది. ఇటు ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ మేరకు వైస్ ప్రెసిడెంట్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఆమెకు కరోనాకు సంబంధించిన ఒక లక్షణం కూడా లేదని చెబుతున్నారు. ఆమె అమెరికా అధ్యక్షుడు బైడెన్.. ఆయన సతీమణీతో సన్నిహితంగా లేరని తెలుస్తోంది.

కమలా హ్యారిస్ ఐసోలేషన్‌‌లో ఉన్నారు. తన ఇంటి నుంచే విధులు నిర్వహిస్తారని ఆమె ప్రెస్ సెక్రటరీ కిర్‌స్టెన్ ఎల్లెన్ తెలిపారు. బైడెన్ ఇప్పటివరకు వైరస్ నివారిస్తూ వస్తున్నారు. హ్యారిసే కాదు.. ఇప్పటివరకు చాలా మంది కరోనా బారినపడ్డారు. అయితే వారితో కూడా బైడెన్ కలిసి ఉన్నా.. వైరస్ మాత్రం సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.

ఈ నెలలో తొలివారంలో సెకండ్ బూస్టర్ డోసు కూడా హ్యారిస్ తీసుకున్నారు. అయినప్పటికీ కరోనా బారిన పడ్డారు. ర్యాపిడ్ మరియు పీసీఆర్ పరీక్షలలో హ్యారిస్‌కు పాజిటివ్ వచ్చింది. ఆమెకు నెగిటివ్ వచ్చిన తర్వాతే తిరిగి శ్వేత సౌధంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. అప్పటివరకు ఇంటి నుంచే పనిచేస్తారు.

అమెరికాలో కొత్త ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. వింటర్ సమయంలో కేసులు మరింత పెరుగుతాయి. ఇప్పటికే అధికారులు సామాజిక దూరం పాటించాలని కోరుతున్నారు. అంతకుముందు ఇద్దరు సెనేటర్లు క్రిస్ మర్జీ, ఒరిగన్ రొన్ ఇద్దరు కూడా కరోనా వైరస్ బారినపడ్డారు.వారిద్దరికీ కూడా మైల్డ్ సింప్టమ్స్ కనిపించాయి. ఇప్పుడు హ్యారిస్ వంతు వచ్చింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి