iDreamPost

రానా పేల్చిన వాయిదా బాంబు

రానా పేల్చిన వాయిదా బాంబు

కోవిడ్ 19 సెగలు టాలీవుడ్ మీద అంతకంతా పెరిగిపోతున్నాయి. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో పరిస్థితి చాలా క్లిష్టంగా మారేలా ఉంది. ఇప్పటికే నాని ‘వి’ పోస్ట్ పోన్ కావడం పట్ల ట్రేడ్ ఆందోళన చెందుతుండగా మరోవైపు తెలంగాణలో థియేటర్ల బంద్ వాళ్లకు దినదిన గండంగా మారింది. ఇప్పుడు తాజాగా రానా వైపు నుంచి బాంబు పేలింది. చాలా గ్యాప్ తర్వాత రానా ఫుల్ లెన్త్ రోల్ చేసిన ‘అరణ్య’ వాయిదా పడింది. ముందు ప్రకటించిన ఏప్రిల్ 2కి విడుదల చేయడం లేదని యూనిట్ తేల్చేసింది.

ఇప్పటికే బాలీవుడ్ నుంచి నాలుగైదు సినిమాలు అఫీషియల్ గా పోస్ట్ పోన్ అయ్యాయి. ఇప్పుడు ఆ లిస్టులోకి అరణ్య వచ్చి చేరింది. అదే రోజుకు ప్రకటించిన అనుష్క నిశ్శబ్దం, వైష్ణవ్ తేజ్ ఉప్పెన సంగతి తెలియాల్సి ఉంది. ప్రమోషన్ పరంగా సైలెంట్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వస్తాయని నమ్మకంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించిన అరణ్య మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సున్నితమైన కథలను మంచి మ్యూజిక్ తో ఆకట్టుకునేలా చెప్తాడని పేరున్న గతంలో ప్రేమ ఖైదీ, గజరాజు, రైల్ లాంటి వాటి ద్వారా మనకూ సుపరిచితుడే.

అడవిలో జంతువులకు కాపాడే లక్ష్యంతో ఉండే కథానాయకుడిగా రానా ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డారు. టీజర్ కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. బాహుబలి తర్వాత జాతీయ స్థాయిలో రానాకు గుర్తింపు రావడంతో అరణ్య ను పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేశారు. ఇప్పుడు వాయిదా అంటే మళ్ళీ అన్ని భాషలను దృష్టిలో ఒక కామన్ డేట్ ని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఏప్రిల్ చివరి వారం లేదా మేలో అరణ్య వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి కోవిడ్ 19 బాంబు ఒక్కొక్కటిగా సినిమాల తరఫున ప్రేక్షకుల మీద పడుతోంది. సరే ఇప్పుడంటే అత్యవసరం కాబట్టి ఓకే కానీ ఫ్యూచర్ లో అన్ని మూవీస్ ఒకేసారి బాక్స్ ఆఫీస్ మీదకు దాడి చేస్తే అదోరకం తలనెప్పి. చూద్దాం ఏం జరుగుతుందో.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి