iDreamPost

సంక్షోభ కాలంలో సాయంగా ఉందాం

సంక్షోభ కాలంలో సాయంగా ఉందాం

వాళ్ల‌కి చాలా మందిలాగా జీతాలు ఉండ‌వు. వ‌ర్క్ ఫ్రం హోం చేయ‌లేరు. ఇళ్లు వ‌దిలి వీధిలోకి రావాల్సిందే. అమ్ముకునే వ‌స్తువుల్ని నిల్వ చేసుకుని నెల త‌ర్వాత అమ్ముకోలేరు. ఏ పూట‌కి ఆ పూటే బ‌తుకు. ఆటోవాలా, టీ అమ్ముకునే వాళ్లు, వీధి వ్యాపారులు, రోజూ కూలీలు. వాళ్లు రోజూ మ‌న‌కి క‌నిపిస్తూ ఉంటారు. కానీ వాళ్లెలా బ‌తుకుతారో మ‌న‌కు తెలియ‌దు. అన్నీ బాగున్న‌ప్పుడే అంతంత మాత్రం బ‌తుకు. ఇప్పుడు ఏదీ బాగా లేదు. రోడ్డు మీదికి రావ‌డానికి కూడా లేదు. మ‌రెలా బ‌తుకుతారు?

ప్ర‌భుత్వం చేయ‌గ‌లిగింది చేస్తుంది. అది చాల‌దు. రేష‌న్‌కార్డు ఉంటేనే సాయం అందుతుంది. అది లేని వాళ్లు కూడా ఉంటారు. ఇప్పుడు తెచ్చుకోలేరు. క‌రోనా రావ‌చ్చు, రాక‌పోవ‌చ్చు. కానీ ఆక‌లి రోజూ వ‌స్తుంది.

ఈ దేశం స్వాతంత్ర్య ఉద్య‌మం నుంచి అనేక ఉద్య‌మాలు వ‌చ్చాయి. ఎన్నోసార్లు భార‌త్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఎప్పుడూ కూడా సంపూర్ణంగా జ‌ర‌గ‌లేదు. మ‌హా అయితే వాహ‌నాలు తిరిగేవి కావు, దుకాణాలు మూసేసేవాళ్లు. ప్ర‌జ‌లు ఇళ్ల నుంచి తిరిగే వాళ్లు. ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఆదివారం దేశ‌మంతా నిశ్శ‌బ్దంగా మారిపోయింది. కార‌ణం బ‌తుకు భ‌యం.

క‌రోనా నుంచి రెండు విష‌యాలు నేర్చుకోవ‌చ్చు. ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌ని స్వార్థంగా ఆలోచించ‌డం. ఇదే ఎక్కువ మంది చేస్తారు. శ‌నివారం గుంపులుగుంపులుగా షాపింగ్ చేసి, ఎగ‌బ‌డి అన్నీ కొని, సోష‌ల్ డిస్టెన్స్ అనే క‌రోనా ప్రాథ‌మిక సూత్రాన్ని కూడా విస్మ‌రించారు.

ఏం జ‌రిగినా స‌రే క‌లిసి ఎదుర్కొందాం. ఒకరికొక‌రు అండ‌గా ఉండాల‌ని అనుకోవ‌డం ఇది రెండో ప‌ద్ధ‌తి. ప్ర‌భుత్వం, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, అధికారులు వీళ్లంతా మ‌న త‌ర‌పున పోరాటం ప్రారంభించారు. మ‌నం చేయాల్సిన యుద్ధం మ‌న‌లోప‌ల ఉన్న అమాన‌వీయ వైర‌స్‌తో.

ఈ య‌జ్ఞంలో మొద‌ట బ‌లి అయ్యేది చీమ‌ల్లాంటి బ‌డుగు జీవులు. చేయ‌లేం అనుకుంటే ఏదీ చేయ‌లేం. చేయ‌గ‌లం అనుకుంటే చేస్తాం. మ‌నం బ‌య‌టికి వెళ్లలేని ప‌రిస్థితి ఉంటే హెల్త్ సిబ్బంది , స్వ‌చ్ఛంద సంస్థ‌ల సాయం తీసుకోవ‌చ్చు. జ‌గ‌న్‌కి ఉన్న బ‌లం ఏమంటే వాలెంట‌రీ వ్య‌వ‌స్థ‌. (వీళ్ల‌ని విమ‌ర్శించిన వాళ్లంతా క్ష‌మాప‌ణ‌లు చెబితే వాళ్ల‌కే గౌర‌వం) వాలెంటీర్ల‌కి వాస్త‌వాలు తెలుస్తాయి. వాళ్ల సాయంతో ఆక‌లిని తీర్చొచ్చు. ఒక గేటెడ్ క‌మ్యూనిటీ అనుకుంటే సుల‌భంగా 50 కుటుంబాల‌కి సాయం చేయ‌గ‌ల‌దు.

సిరియాలో చిన్న పిల్ల‌లు చ‌నిపోతే మ‌న‌కేంటి అనుకున్నాం. ఇరాక్‌లో ఆక‌లితో ప‌సిబిడ్డ‌లు చ‌నిపోతే అవి కేవ‌లం వాట్స‌ప్ మెసేజ్‌లాగానే ప‌రిగ‌ణించాం.

కాశ్మీర్‌లో కర్ఫ్యూ పెడితే మ‌న‌కి కాదులే అనుకున్నాం (ఒక రోజు ఇంట్లో ఉంటే అర్థ‌మైంది. రోజుల త‌ర‌బ‌డి క‌ర్ఫ్యూ బాధ ఎలా ఉంటుందో?). ఇప్పుడు ఊహాన్‌లో ఉన్న విష‌పురుగు మ‌న ఊరికి వ‌చ్చేసింది. మ‌న‌కేంటి అనుకోలేం. మ‌నం బాగుండాలి, అంద‌రూ బాగుండాలి.

టీవీలు చూడండి, ఫోన్‌లో సినిమాలు చూడండి, పాట‌లు వినండి, పొరుగు వాడి ఆక‌లి కేక‌లు కూడా వినండి.

ఒక ప‌సిబిడ్డ ఆక‌లి ఏడ్పులో నుంచి కూడా కొత్త వైర‌స్ పుట్టొచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి