iDreamPost

ఇటలీ, స్పెయిన్ లో కరోనా ప్రభావం తగ్గుతోందట

ఇటలీ, స్పెయిన్ లో కరోనా ప్రభావం తగ్గుతోందట

అవును నిజంగా ప్రపంచానికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రపంచం మొత్తాన్ని వణికించేసిన కరోనా వైరస్ దాదాపు నెల రోజుల తర్వాత ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల్లో నెమ్మదించిందనే అనుకోవాలి. మార్చి 20వ తేదీ తర్వాత రోజువారి లెక్కలతో పోల్చుకుంటే పై దేశాల్లో బాధితులు, మృతుల సంఖ్య తగ్గిందని ప్రభుత్వాలు నివేదికలను విడుదల చేశాయి. ఏప్రిల్ 13వ తేదీన ప్రభుత్వాలు విడుదల చేసిన నివేదికల ప్రకారం స్పెయిన్ లో సోమవారం 2665 కేసులు మాత్రమే నమోదవ్వగా 280 మంది చనిపోయారు.

ఇక ఇటలీలో కూడా సోమవారం 3153 కేసులు నమోదైతే 566 మంది చనిపోయారు. మార్చి 20వ తేదీనుండి రోజువారి లెక్కలు తీసుకుంటే పై దేశాల్లో ఏరోజు కూడా వెయ్యికి తక్కువగా చనిపోలేదు. మరి ఆ లెక్కలతో పోల్చుకుంటే సోమవారం గణాంకాలు ఊరట నిచ్చేవే. బాధితుల సంఖ్య తగ్గిపోవటంతో ఇటలీ, స్పెయిన్ లో ఫ్యాక్టరీలు, రెస్టారెంట్లు, నిర్మాణ, ఉత్పత్తి రంగాల్లోని ఉద్యోగులు, కార్మికులను పనుల్లోకి అనుమతించారు.

పై మూడు దేశాల్లో బాధితులు, మరణాలు ఎక్కువగా నమోదవ్వటానికి ప్రధాన కారణం ఏమిటింటే వృద్ధులు ఎక్కువగా ఉండటమేనట. వైరస్ దెబ్బకు సగటున 80 సంవత్సరాలున్న వాళ్ళే ఎక్కువగా బాధితులుగా మారారు. దాంతో వైరస్ పై పోరాటం చేసే శక్తిలేక ఎక్కువ మంది మరణించారు. ఓల్డేజ్ హోంలో ఉన్న వృద్ధుల్లో ఎక్కువగా మరణించారని నివేదికలు చెబుతున్నాయి. యువకుడు, వృద్ధుడు ఒకేసారి వైరస్ బాధితులుగా ఆసుపత్రులకు వస్తే పై దేశాల్లో వైద్యాధికారులు యువకులను మాత్రమే చేర్చుకుని వృద్ధులను వదిలేశారు.

ఆసుపత్రులు ఎందుకు అలా చేశాయంటే ఇద్దరినీ చేర్చుకుని వైద్యం అందించేందుకు సౌకర్యాలు లేకపోవటం, వృద్ధులు రికవర్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉండటంతో వైద్యం విషయంలో యువకులకే ప్రాధాన్యత ఇవ్వటంతో వైరస్ పెరిగిపోయి ముసలివాళ్ళు చనిపోయారు. నిజంగా ఇది బాధాకరమే అయినా బతికే అవకాశం ఎక్కువ ఉన్న యువకులను కాపాడుకోవటానికి వేరే దారిలేకే ఆసుపత్రులు అలా చేయాల్సొచ్చిందట. ఇటలీలో చనిపోయిన వారి వయస్సులను చూస్తే 60 ఏళ్ళలోపు చనిపోయిన కేసు కేవలం ఒక్కటంటే ఒక్కటే కేసైతే మిగిలిన వాళ్ళంతా 80 ఏళ్ళ వయస్సు వారే. సరే ఏదేమైనా కేసులు తగ్గటం సంతోషమే కదా .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి