iDreamPost

ఇంత జరుగుతున్నా ఎందుకు ఈ నిర్లక్ష్యం ?

ఇంత జరుగుతున్నా ఎందుకు ఈ నిర్లక్ష్యం ?

కరోనా వైరస్ చైనాలో విజృంభించగానే అమెరికాలోని ఉన్నత వైద్యులు ప్రెసిడెంట్ ట్రంప్ తో వైరస్ ప్రభావిత ప్రాంతాల్ని కొన్ని రోజులు లాక్-డౌన్ చేయడం మంచిదని సూచించిగా ట్రంప్ మనది అగ్రరాజ్యం లాక్-డౌన్ చేస్తే ఆర్థికంగా బాగా నష్టపోతామని వారి సూచనలను కొట్టి పడేశారట. కట్ చేస్తే చైనా, ఇటలీల తరహాలో అమెరికాలో కరోనా మరణాలు సంభవించాయి. ఫలితంగా అమెరికా మొత్తం ఆరు నెలలపాటు లాక్ డౌన్ విధించారు.

మనదేశంలో ఫేమస్ బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కరోనా ప్రబలుతున్న సమయంలోనే విదేశాల నుండి వచ్చారు. ప్రభుత్వ సూచనలమేరకు క్వారంటైన్ లో ఉండకుండా పార్టీలు, ఫంక్షన్లకు హాజరవడం, బంధుమిత్రులను ఆలింగనం చేసుకోవడం వంటివి చేసారు. రెండ్రోజులకే ఆమెకు కరోనా వైరస్ సోకిందని తేలింది. క్వారంటైన్ కు పంపి చికిత్స అందిస్తున్నా ఏమాత్రం మెరుగుపడలేదు. ఇప్పటివరకూ నాలుగుసార్లు టెస్ట్ చేయగా పాజిటివ్ వస్తోందని వైద్యులు చెప్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులు మాత్రం కనికాను విదేశాలకు తీసుకెళ్లి మెరుగైన చికిత్స చేయించాలనుకుంటున్నాం.. కానీ లాక్-డౌన్ కారణంగా వెళ్లలేకపోతున్నామని చెప్తున్నారు. స్వయంగా కనికా కుటుంబ సభ్యులో ఈ అభిప్రాయాన్ని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఒకవైపున ప్రపంచంమొత్తం లాక్-డౌన్ లో ఉంటూ.. ఇతర దేశాలతోపాటు మన దేశంలోనే పరిస్థితులు ఆశాజనకంగా ఉండగా తమ కూతుర్ని మెరుగైన వైద్యంకోసం విదేశాలకు తీసుకెళ్తామనే కనికా తల్లిదండ్రుల అమాయకత్వం గురించి ఏం చెప్పాలో అర్ధం కాని పరిస్థితి. విదేశాల్లోనే వైరస్ ని కట్టడి చెయ్యలేకపోతుంటే.. ఇండియాలోనే కోవిడ్ పేషెంట్లు కోలుకుంటుంటే ఇక్కడినుంచి చికిత్సకోసం తీసుకెళ్తామంటున్న వారి ఆలోచనలోని అసంబద్దతను అర్థం చేసుకోవాలి.

మరోవైపు జర్మన్ ఆర్ధిక మంత్రి మృతదేహం రైల్వే ట్రాక్ పై కనిపించింది. ఈ వైరస్ విజృంభణ వల్ల అత్యంత పటిష్టమైన జర్మన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడం.. వైరస్ విజృంభణ, దేశవ్యాప్తంగా మరణాలు చూసి బాధ, ఒత్తిడిని తట్టుకోలేక ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. అక్కడి ప్రధాన పత్రికలే ఈ విషయాన్ని నిర్ధారించాయి. అయితే ముందుగానే ఆర్ధిక నష్టానికి భయపడకుండా దేశం మొత్తం లాక్ డౌన్ చేసుంటే బావుండేదని ఆయన ఫీలయ్యారట.

ఇవన్నీ ప్రజలకు నిత్యం తెలుస్తున్నా సాంకేతిక పరిజ్ఞానంతో వైరస్ తీవ్రత స్పష్టంగా అర్ధమవుతున్నా కొందరు ఆకతాలు తాము ఇతర గ్రహాల నుండి ఊడిపడినట్టుగా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. చాలామంది కరోనా దాడిని హెచ్చరించినపుడు కూడా మాకెందుకు వస్తుంది.. మాకు వ్యాధి నిరోధక శక్తి ఉంది.. ఎండలో వైరస్ బ్రతకదు.. ముట్టుకుంటే వస్తుందా.. చేతులు కడుక్కుంటే రాకుండా ఉంటుందా అంటూ వ్యాఖ్యలు చేసారు. అయితే ఇప్పుడు మరణాలు చూసినపుడు అర్ధమవుతుంది. కరోనా మహమ్మారికి ఎవరూ అతీతులు కాదని.

రెండ్రోజులు పోలీసుల భయంతోనో, అధికారుల భయంతోనో హోమ్ క్వారంటైన్ పాటిస్తున్నా అప్పుడప్పుడు అక్కడక్కడా గుంపులు గుంపులుగా ప్రత్యక్షమవుతున్నారు. మనం ఏ ఉద్దేశ్యంతో ఏ పని చేస్తున్నామఅనేది కరోనాకు అనవసరం. అది వ్యాపించడానికి అనువుగా కనిపించే ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటుంది.ఇప్పటికైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం కాబట్టి సరిపోయింది. అందరూ కొందరు ఆకతాయిల్లా ప్రవర్తిస్తే మాత్రం మానవ జాతి మనుగడకే ప్రమాదం ఏర్పడేది.

ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలు మాత్రం తమ ప్రజల ప్రాణాల కంటే ఆర్థిక స్థిరత్వమే ముఖ్యమని ప్రవర్తించడం వల్ల అమానుష పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఈ విషయంలో కచ్చితంగా భారత ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలను అభినందించి తీరాలి. మహమ్మారి విజృంభణ ప్రారంభ సమయంలోనే ఏమాత్రం ఆలోచించకుండా అత్యంత కీలక నిర్ణయాలు తీసుకోగలిగారు. దేశం యావత్తూ లాక్ డౌన్ ను, స్వీయ నియంత్రణను పాటిస్తూ క్రమశిక్షణతోనే వైరస్ ను కట్టడి చేయగలుతున్నారు. ఇలాంటి సందర్భంలో దేశ నేతల విన్నపాలు ధిక్కరిస్తూ, దేశంలోని పరిస్థితులను అవగాహన చేసుకోకుండా ప్రవర్తిస్తూ మాట్లాడుతున్న కనికా కుటుంబ సభ్యుల వంటి వ్యక్తులు దేశంలోని 130 కోట్ల మందిలో కచ్చితంగా ఒక్క శాతం ఉండడం బాధాకరం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి