iDreamPost

భారత నేవీలో ప్రవేశించిన కరోనా

భారత నేవీలో ప్రవేశించిన కరోనా

కరోనా వైరస్ ఇప్పుడు భారత్ నావికా దళంలోకి ప్రవేశించింది.భారత నావికాదళంలో పని చేస్తున్న సుమారు 21 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వైరస్‌ సోకిన వారిని హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు.

నావికాదళంలో కరోనా వైరస్ సోకినట్లు తేలడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. వైరస్‌ సోకినప్పుడు నావికాదళ సభ్యులు ‘ఐఎన్‌ఎస్‌ యాంగ్రీ’కి చెందిన నివాస స్థావరాల్లో ఉన్నట్లు సమాచారం. వైరస్ సోకిన వారిని ఐఎన్‌హెచ్‌ఎస్‌ అశ్వినీ నేవీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.వైరస్ సోకిన నావికాదళ సభ్యులు ఎవరెవరిని కలిసారో వారిని అధికారులు గుర్తించే పనిలో పడ్డారు. కరోనా పాజిటివ్ కేసులు భారత నావికాదళంలో బయటపడటం ఇదే తొలిసారి.

అయితే కరోనా వైరస్ ప్రమాదకరంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో భారత త్రివిధ దళాలు ముందే అప్రమత్తమయ్యాయి. త్రివిధ దళాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలకు ఉపక్రమించాయి. 50 మందికంటే ఎక్కువగా గుమికూడదని ఆదేశాలు జారీ చేశాయి. శిక్షణా కార్యక్రమాలను నిలిపివేశాయి. ఏప్రిల్ 9 నే భారత నావికాదళ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ వీడియో సందేశం ద్వారా గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడానికి సన్నద్ధం కావాలని అప్రమత్తం చేశారు.

ఇప్పటికే భారత సైనికదళంలో 8 మందికి కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎం.ఎం.నరవణే ప్రకటించారు. కరోనా వైరస్ సోకిన వారిలో 5 గురు సైనికులు కాగా ఇద్దరు డాక్టర్లు ఒక నర్స్ కి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి