iDreamPost

గ్లాసుల గ‌ల‌గ‌ల మ‌ళ్లీ వినిపిస్తుందా!

గ్లాసుల గ‌ల‌గ‌ల మ‌ళ్లీ వినిపిస్తుందా!

స‌న్యాసిగా మారిన‌పుడే సంసారం గుర్తొస్తుంది. క‌ష్ట కాలాల్లో మంచి రోజులు గుర్తొస్తాయి. హైద‌రాబాద్ ప్రెస్‌క్ల‌బ్ ఒక సంతోష జ్ఞాప‌కం. మ‌ద్యం ప‌ద్యం రెండూ వెల్లివిరిసే చోటు. రాజ‌కీయం, సాహిత్యం, సినిమా , జ‌ర్న‌లిజం అన్నీ సోడా విస్కీలా క‌లిసిపోయి ప‌రిమ‌ళిస్తాయి. న‌దుల‌న్నీ స‌ముద్రంలో క‌లిసిన‌ట్టు, అన్ని ర‌కాల భావ‌జాలాలు ద్ర‌వీభూతం చెందుతాయి.

నిషా ఎక్కితే ప్ర‌తివాడూ తానీషానే. వేదాంతం , సిద్ధాంతం , రాద్ధాంతం అన్నీ ఒకేలా క‌నిపిస్తాయి. స‌ర్వ‌ర్లు కూడా ఫిలాస‌ఫ‌ర్స్‌గా క‌నిపిస్తారు. మందు వ‌ల్ల ఉప్పొంగే జ్ఞానాన్ని చూసి చూసి “జీవితంలో మ‌న‌కి కావాల్సింది దొర‌క‌దు” అనే త‌త్వాన్ని కొంద‌రు వృద్ధ స‌ర్వ‌ర్లు జీర్ణించుకున్నారు. క‌స్ట‌మ‌ర్లు అడిగింది ఇవ్వ‌రు. వాళ్ల‌కు ఇష్ట‌మైందే ఇస్తారు.

కింగ్‌ఫిష‌ర్ అడిగితే బ‌డ్‌వైజ‌ర్ ఇస్తారు. మార్పియ‌స్‌ కావాలంటే మాన్ష‌న్‌ హౌస్ ఇస్తారు. నిజానికి బ్రాండ్ అనేది అబ‌ద్ధం, రెండు రౌండ్లు తాగాకా ప్ర‌పంచంలోని అన్ని బ్రాండ్లు ఒక‌టే. మైండ్ ప‌నిచేయ‌డం ఆగిపోయాకా బ్రాండ్ ఒక భ్రాంతి మాత్ర‌మే.

ప్ర‌పంచంలోని అన్ని ర‌కాల సిద్ధాంతాల్ని , విశ్వాసాల్ని మ‌నం ప్రెస్‌క్ల‌బ్‌లో చూడొచ్చు. త‌న‌కి మందు అనేది ఒక వ్య‌స‌న‌మే కాద‌ని, కేవ‌లం మిత్రుల్ని ప‌ల‌క‌రించ‌డానికే ఇక్క‌డికి వ‌స్తాన‌ని , ఎప్పుడ‌నుకుంటే అప్పుడు మందు మానేయ‌గ‌ల‌న‌ని ఒక మిత్రుడి విశ్వాసం. 20 ఏళ్లుగా ఆయ‌న ఇదే న‌మ్ముతున్నాడు. సెల‌వు రోజుల్లో కూడా దారి త‌ప్పి క్ల‌బ్‌కు వ‌చ్చేస్తుంటాడు. క‌రోనాతో ఆయ‌న విశ్వాసం నిజ‌మ‌య్యే అవ‌కాశం వ‌చ్చింది కానీ, ఆయ‌న మాత్రం పోలీసుల్ని కూడా లెక్క చేయ‌కుండా మందు కోసం గాలిస్తున్నాడు.

ఇంకో మిత్రుడున్నాడు. ఆయ‌న వాట‌ర్ లాంటి వాడు. ఏ మందులోనైనా నీళ్లు కంటికి క‌న‌ప‌డ‌కుండా క‌లిసిపోయిన‌ట్టు అన్ని బ్యాచ్‌ల్లో క‌లిసిపోతాడు. ఆయ‌న్ని టేబుల్ స‌ర్వేయ‌ర్ అంటారు. అన్ని టేబుళ్ల‌ని ప‌ల‌క‌రిస్తూ ఉంటాడు.

ట్రంప్ గురించి మాట్లాడుతాడు. టేకుల‌గూడెం స‌ర్పంచ్ గురించి మాట్లాడ‌గ‌ల‌డు. సునామీ నుంచి ఎకాన‌మీ వ‌ర‌కు దంచేస్తాడు. మందు ఫుల్‌గా తాగ‌డం త‌ప్ప , ఏ విష‌యం గురించి ఫుల్‌గా తెలుసుకోడు. జ‌ర్న‌లిస్టుకి హాఫ్ నాలెడ్జ్‌కి మించి అన‌వ‌స‌ర‌మ‌ని వీళ్ల‌ని చూసి తెలుసుకోవ‌చ్చు.

కొంద‌రు గ‌ణిత మేధావులుంటారు. ప్ర‌తిదీ లెక్క ప్ర‌కారం జ‌ర‌గాల‌ని వాదిస్తూ ఉంటారు. వీళ్ల ముందు కూచుంటే సైన్స్ ల్యాబొరేట‌రీలో కూచున్న‌ట్టే. మ‌న మందు , సోడా , వాట‌ర్ అన్నీ హ్యాండోవ‌ర్ చేసుకుని తూకంగా క‌లుపుతారు. ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ చేయ‌రు. ఆఖ‌రున నేల మీద డ్రాప్ అయ్యేది కూడా వీళ్లే. వీళ్ల‌కి కంపెనీ ఇస్తే క్యాబ్ వ‌ర‌కు మోసుకెళ్లే డ్యూటీ మ‌న‌దే.

కొంద‌రికి సీసా చూస్తేనే సీస ప‌ద్యం గుర్తొస్తుంది. గానంతో గాయ‌ప‌రుస్తారు. గ్లాస్‌తో ద‌రువేస్తారు. ఉత్సాహం ఎక్కువైతే టేబుల్‌తో బుల్‌ఫైట్‌ చేస్తారు.

ఇక్క‌డ మ‌నుషుల‌తో పాటు మార్జాలాలు కూడా ఉంటాయి. మ్యావ్‌మ్యావ్‌మ‌ని టేబుళ్ల కింద తిరుగుతూ ఉంటాయి. జ‌ర్న‌లిస్టుల‌తో రాసుకుపూసుకు తిర‌గ‌డం వ‌ల్ల వాటికి కూడా కొన్ని రాజ‌కీయ నిశ్చిత అభిప్రాయాలున్నాయి. మాట్లాడ్డానికి ఎవ‌రూ లేన‌ప్పుడు కొంత మంది త‌మ అభిప్రాయాల్ని , చికెన్ ముక్క‌ల్ని ఈ పిల్లుల‌తో పంచుకుంటూ ఉంటారు.

ఒక సినిమా జ‌ర్న‌లిస్టు ఈ పిల్లి భాష‌కి ట్రాన్స్‌లేష‌న్ క‌నిపెట్టాడు. ట్రాన్స్‌లోకి వెళుతున్న‌ప్పుడు ఈ ఐడియా వ‌చ్చింది. ఒక‌సారి మ్యావ్ అంటే ఔన‌ని అర్థం. కొంచెం పాజ్ ఇచ్చి రెండుసార్లు మ్యావ్ అంటే కాద‌ని అర్థం. వ‌రుస‌గా మూడుసార్లు మ్యావ్ అని , చివ‌ర్లో గుర్‌మ‌ని సౌండ్ ఇస్తే దానికి మూడ్ బాగాలేదు, ర‌క్కుతుంద‌ని అర్థం.

అపోలో ఫిష్ తినిపించి ఒక పిల్లిని బాగా మ‌చ్చిక చేసుకుని ఒక పెగ్గుని తాగించాల‌ని చూశాడు కానీ, అది ధిక్క‌రించి పారిపోయింది. మందుని జంతువులు కూడా తాగ‌వ‌ని , అది మ‌నుషులు మాత్ర‌మే తాగే చేదు విష‌మ‌ని సూత్రీక‌రించాడు.

స‌క‌ల క‌ళ‌ల గురించి సంద‌డి, సోడా బుస‌బుస‌లు, సుబ్బ‌రాజు ఇంకో Sixty, స‌మ‌స్త ప్ర‌పంచం బాగోగుల‌పై చ‌ర్చ‌లు, వాద‌న‌లు , హ్యాంగోవ‌ర్ పోవ‌డానికి ఆరోగ్య చిట్కాలు. ర‌క‌ర‌కాల న‌వ్వులు , స‌ర‌దాలు , టీవీలో క్రికెట్ వ‌స్తుంటే అరుపులు, మిర్చీ బ‌జ్జీ కారం

ఏవీ, నిరుడు కురిసిన మందు బిందువులు! ఇవ‌న్నీ జ్ఞాప‌కాలుగా గుర్తు చేసుకోవాల్సిన రోజులొస్తాయ‌ని అనుకోలేదు. మందుబాబుల ఉసురు త‌గిలి క‌రోనా వెళ్లిపోతుంది.

మ‌ళ్లీ మ‌న ప్రెస్‌క్ల‌బ్‌లో న‌వ్వుల కిల‌కిల, గ్లాసుల గ‌ల‌గ‌ల వినిపిస్తాయి.
క‌రోనా భ‌యం లేకుండా షేక్‌హ్యాండ్ ఇచ్చుకుందాం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి