iDreamPost

కాంగ్రెస్, కమ్యూనిస్టులకు బెంగాల్ రామ్ రామ్

కాంగ్రెస్, కమ్యూనిస్టులకు బెంగాల్ రామ్ రామ్

ఒకప్పుడు ఆ రాష్ట్రం కాంగ్రెస్.. ఆ తర్వాత కమ్యూనిస్టులకు కంచుకోట. కానీ ఇప్పుడు జల్లెడ పట్టి వెతికినా వాటి ఉనికి కనిపించని దుస్థితి. పశ్చిమ బెంగాల్లో ఇంతకాలం అధికారం లేకపోయినా కొన్ని సీట్లయినా గెలిచి చట్టసభల్లో తమ వాణి వినిపిస్తూ ఉనికి చాటుకుంటున్న ఆ పార్టీలకు తొలిసారి అసెంబ్లీలో ప్రాతినిధ్యం దక్కని పరిస్థితి ఏర్పడింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. ఈసారి కాంగ్రెస్, వామపక్షాలు కలిసి సంయుక్త మోర్చా పేరుతో పోటీ చేసినా ఫలితం దక్కలేదు. ఆ కూటమికి రెండంటే రెండే స్థానాలు లభించాయి. అవి కూడా మోర్చాలోని వేరే పార్టీలకు దక్కాయి.

కమ్యూనిస్టుల గతమెంతో ఘనం..

బెంగాల్లో రాజకీయ చరిత్రలో వామపక్షాలది ఒక మహాశకం. 1977 నుంచి 2011 వరకు వారిదే పాలనాధికారం. మొదట సీపీఎం నేత జ్యోతిబసు నేతృత్వంలో ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధించిన వామపక్ష కూటమికి.. ఆయన తదనంతరం బుద్ధదేవ్ భట్టాచార్య పగ్గాలు చేపట్టారు. 34 ఏళ్ల సుదీర్ఘ పాలన బెంగాల్ ప్రజల్లో క్రమంగా వారి పట్ల వ్యతిరేకత ప్రోది చేసింది. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన మమత బెనర్జీ రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తిగా ఎదిగారు. 2004లో జరిగిన నందిగ్రామ్ భూపోరాటాన్ని అందిపుచ్చుకుని ప్రభల శక్తిగా అవతరించారు. వామపక్ష ప్రభుత్వాన్ని సవాల్ చేయడం ప్రారంభించారు.

2011లో మమత ధాటికి బెంగాల్ వామపక్ష కోట కూలిపోయింది. ఆ ఎన్నికల్లో భారీ విజయంతో తృణమూల్ అధికారంలోకి రాగా.. మొదటిసారి లెఫ్ట్ ఫ్రంట్ ప్రతిపక్ష బెంచీలో కూర్చోవలసి వచ్చింది. ఆ ఎన్నికల్లో 62 సీట్లకు పరిమితమైన వామపక్షాలు 2016 ఎన్నికల్లో మరింత దిగజారి 32 స్థానాలకు పడిపోయాయి. మమత సర్కారు రాజకీయ నిర్ణయాల కారణంగా రాష్ట్రంలో చాలామంది కమ్యూనిస్టు కార్యకర్తలు ఆ పార్టీలోకి వెళ్లిపోవడంతో వామపక్షాలు సంస్థాగతంగాను బలహీన పడ్డాయి. దాంతో 2021 ఎన్నికల్లో తృణమూల్ ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, వామపక్షాలు జతకట్టి సంయుక్త మోర్చా పేరుతో పోటీ చేశాయి. అయినా ఈ మోర్చా తృణమూల్ పార్టీపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోగా.. బీజేపీకి చోటిచ్చినట్లయ్యింది.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ 1962 నుంచే 1972 వరకు యునైటెడ్ ఫ్రంట్ పేరుతో సీపీఎం తో కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. తర్వాత 1972 నుంచి 1977 వరకు సిద్ధార్థ్ శంకర్ రే నేతృత్వంలో సొంతంగా పరిపాలన సాగించింది. ఆ తర్వాత కమ్యూనిస్టుల హవాలో ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. 2016లో 44 సీట్లు గెలిచిన ఈ పార్టీ ఈసారి బోణీ కొట్టలేకపోయింది.

కొత్త ప్రతిపక్షంగా బీజేపీ

కాంగ్రెస్, కమ్యూనిస్టుల వైఫల్యం బీజేపీకి కలిసి వచ్చింది. వాస్తవానికి తృణమూల్ ను దెబ్బకొట్టి అధికారంలోకి రావాలన్నది కాషాయ దళం లక్ష్యం. అదే టార్గెట్ తో ఆ పార్టీ పావులు కదుపుతూ వచ్చింది. అయితే ప్రజలు మాత్రం ఆపార్టీకి ఖాళీగా ఉన్న ప్రతిపక్ష పాత్ర పోషించమని తీర్పు ఇచ్చారు. మమతకే మూడోసారి అధికారం కట్టబెట్టారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులను ఇంటికి పంపించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి