iDreamPost

నేరడి బ్యారేజ్ వైపు జగన్ ముందడుగు

నేరడి బ్యారేజ్ వైపు జగన్ ముందడుగు

వివాదాల సుడిలో చిక్కుకొని చాలా ఏళ్లుగా కదలిక లేకుండా నిలిచిపోయిన నేరడి బ్యారేజి ప్రాజెక్టు పై సీఎం జగన్ చొరవతో ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఒడిశా సహకారం కావాలని, దీనిపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు సీఎం జగన్ లేఖ రాయడం ద్వారా చొరవ చూపించారు.

చర్చలకు సిద్ధం..

ఒడిశా అభ్యంతరాల కారణంగా నిలిచిపోయిన నేరడి బ్యారేజి నిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరగా చేపట్టాలన్న లక్ష్యంతో ఒడిశాతో చర్చలకు సీఎం జగన్ సంసిద్ధత ప్రకటించారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కు ఈ మేరకు శనివారం లేఖ రాశారు. 80 టీఎంసీల వంశధార నీరు ఏటా వృథాగా సముద్రం పాలవుతోందని పేర్కొన్నారు. నేరడీ బ్యారేజీ నిర్మిస్తే కొంత నీరైనా సద్వినియోగం అవుతుందని, ఆంధ్రాలో శ్రీకాకుళం జిల్లాతో పాటు ఒడిశాలోని గజపతి జిల్లాలో లక్ష ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని గుర్తుచేశారు. ఇరు రాష్ట్రాలు కలిసి చర్చించుకుంటే సమస్య పరిష్కారమై రైతులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. అపాయింట్మెంట్ ఇస్తే చర్చలకు రావడానికి సిద్ధంగా ఉన్నానని సీఎం జగన్ తన లేఖలో పేర్కొన్నారు.

బ్యారేజీ లక్ష్యం ఏమిటి?

ఒడిశా, ఆంధ్రప్రదేశ్ లలో ప్రవహిస్తున్న వంశధార నది నీటిని ఒడిసిపట్టి లక్షలాది ఎకరాల ఆయకట్టుకు మళ్లించేందుకు వంశధార ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలని 1962లోనే రెండు రాష్ట్రాలు అంగీకారానికి వచ్చాయి. రెండు దశల్లో దీన్ని నిర్మించాలని నిర్ణయించారు. మొదటి దశలో హిరమండలం వద్ద గొట్టా బ్యారేజీ, ఎడమ ప్రధాన కాలువ నిర్మాణాలను 1978లొనే పూర్తి చేసి లక్షకు పైగా ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. రెండో దశలో 16 టీఎంసీల నిల్వ చేసి.. 1.07 లక్షల ఎకరాలకు నీరందించేలా నేరడీ బ్యారేజితో పాటు కుడి ప్రధాన కాలువ, వరద కాలువ నిర్మించాలని ప్రతిపాదించారు. బ్యారేజీ నిర్మాణానికి రూ. 100 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. దీనికి చాలా ఏళ్ల క్రితమే వంశధార ట్రిబ్యునల్ ఆమోదం తెలిపింది. ఈ దశలో ఒడిశా కొత్త అభ్యంతరాలు లేవనెత్తడంతో నిర్మాణం నిలిచిపోయింది. అయితే దాంతోపాటు ప్రతిపాదించిన కుడి ప్రధాన కాలువ, వరద కాలువ నిర్మాణాలను ఆంధ్ర ప్రభుత్వం దాదాపు పూర్తి చేసింది.

ఒడిశా అభ్యంతరాలివీ

నేరడీ బ్యారేజీని ఒడిశా భూభాగంలోని నేరడీ వద్ద నిర్మించాల్సి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే రెండు రాష్ట్రాల అధికారులు సంయుక్త సర్వే చేపట్టి బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన 106 ఎకరాల భూమిని గుర్తించాలని.. ఒడిశా ప్రభుత్వం ఆ భూమిని అప్పగించాలని ఆదేశించింది. దీనికి మొదట సూత్రప్రాయంగా అంగీకరించిన ఒడిశా తర్వాత కొత్త అభ్యంతరాలు లేవనెత్తింది. నిర్దేశించిన 106 ఏకరాల కంటే ఎక్కువ భూమి పోతుందని.. బ్యాక్ వాటర్ వల్ల అదనంగా మరికొంత భూమిని తాము కోల్పోవాల్సి వస్తుందన్నది ఆ ప్రభుత్వ వాదన. దీనిపై ఆంధ్రప్రదేశ్ మళ్లీ ట్రిభ్యునల్ ను ఆశ్రయించగా.. రెండు రాష్ట్రాలు చర్చించుకుని సమస్య పరిష్కరించుకోవాలని సూచించింది. గత టీడీపీ ప్రభుత్వం ఆ దిశగా చొరవ చూపకపోవడంతో ఆ వివాదం అలాగే ఉండిపోయింది. తాజా సీఎం జగన్ చర్చలకు సిద్ధమని ప్రకటిస్తూ ఒడిశా సీఎం కు లేఖ రాయడం ప్రాజెక్ట్ ముందుకు కదులుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.

Also Read : మాజీ సీఎంకు క‌రోనా : ఆస్ప‌త్రిలో బెడ్ క‌రువు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి