iDreamPost

పంచుకు తినే ప్రభుత్వం కావాలా? సంక్షేమ ప్రభుత్వం కావాలా?

పంచుకు తినే ప్రభుత్వం కావాలా? సంక్షేమ ప్రభుత్వం కావాలా?

మాది సంక్షేమ ప్ర‌భుత్వం, అన్నివర్గాల ప్రభుత్వం, కాపు నేస్తం అందులో భాగమేన‌ని సీఎం జ‌గ‌న్ చెప్పారు. సంక్షేమ ప్ర‌భుత్వమ‌న్న నినాదాన్ని జ‌నంలోకి తీసుకెళ్ల‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. పాత ప్ర‌భుత్వంతో కొత్త ప్ర‌భుత్వాన్ని పోల్చిచూడ‌మంటున్నారు.

డీబీటీ అంటే, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్‌. డీబీటీ ద్వారా అవినీతికి ఎలాంటి తావులేకుండా నేరుగా, సంక్షేమ పథకాల నిధుల్ని, లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నామన్నారు సీఎం జ‌గ‌న్. వైఎస్సార్‌ కాపు నేస్తం మూడో విడత నిధుల విడుదలలో భాగంగా, కాకినాడ గొల్లప్రోలు సభ నుంచి లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. టిడీపీని గురిచూసి కొట్టారు.

చంద్రబాబు పాలనలో ‘డీపీటీ’ అంటే దోచుకో, పంచుకో , తినుకో అని సీఎం జగన్‌ నిర్వచించారు. ఈ డీపీటీతో దుష్టచతుష్టయం బాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5కి తోడు దత్తపుత్రుడు అంతా కలిసి సామాజిక న్యాయం పాటించారని విమ‌ర్శించారు. కాపుల ఓట్లను మూటగట్టి చంద్రబాబుకు అమ్మడానికి దత్త పుత్రుడు ప్రయత్నిస్తుడ‌ని ఆరోపించారు.

డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయడం కావాలా? చంద్రబాబు హయాంలో ఉన్న దోచుకో, పంచుకో, తినుకో కావాలా? అని ప్రజలను అడిగారు. బాబు, పవన్‌, ఎల్లోమీడియాకు తెలిసింది అవినీతి మాత్రమేన‌ని విమ‌ర్శించిన సీఎం జ‌గ‌న్, చంద్ర‌బాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. హుద్‌హుద్ తుపాన్ వచ్చినప్పుడు 11 రోజుల పాటు స్వయంగా ఉత్తరాంధ్రలో తిరిగా. పాచిపోయిన పులిహోర ప్యాకెట్లను బాధితులకు పంచాడు. ఇప్పుడు విపత్తు వస్తే బాధితులను ఆదుకుంటున్నామ‌ని సీఎం జ‌గ‌న్ చెప్పారు.

వరద బాధితులకు రేషన్‌తో పాటు ప్రతీ ఇంటికి రూ.2 వేలు ఇస్తున్నాం. చంద్రబాబు ఒక్క రూపాయి ఇవ్వలేకపోయారు. అస‌లు జగనన్న పాలనలో లబ్ధి జరగలేదని బాబు ఎవ‌రినీ చూపలేకపోయారు. మ‌రి, అబద్దాల చంద్రబాబు కావాలా? అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఈ ప్రభుత్వం కావాలా?.. ఎవరి పాలన కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్న‌ది సీఎం జ‌గ‌న్ పిలుపు.

వరుసగా మూడో ఏడాది కాపు అక్కచెల్లెమ్మలకు అండగా నిలుస్తున్నాం. రూ.15వేలు వాళ్ల అకౌంట్లలో నేరుగా జమ చేస్తున్నాం. ఇప్పటివరకు 1,492 కోట్ల రూపాయల సాయం చేశాం. ఈ ఏడాది 3లక్షల 38 వేల 792 మంది కాపు మహిళలకు లబ్ధి చేకూర్చేలా చేశాం. నవరత్నాల ద్వారా, మూడేళ్లలోనే కాపు సామాజిక వర్గానికి రూ.16,256 కోట్ల లబ్ధి చేకూరింది. మొత్తంగా కాపు సామాజిక వర్గానికి ఈ మూడేళ్లలో సంక్షేమపథకాల ద్వారా రూ.32,296 కోట్లు లబ్ధి చేకూరిందని సీఎం జగన్ ప్ర‌క‌టించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి