iDreamPost

పోలవరంలో సీఎం జగన్, కేంద్ర మంత్రి షెకావత్‌..

పోలవరంలో సీఎం జగన్, కేంద్ర మంత్రి షెకావత్‌..

పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిలు పర్యటిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించడం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముంపువాసులకు నిర్మించిన పునరావాస కాలనీల సందర్శనలో భాగంగా పర్యటిస్తున్న వారు.. ముందుగా తూర్పుగోదావరి జిల్లా ఇందుకూరులో నిర్మించిన పునరావాస కాలనీలను సందర్శించారు. అనంతరం అక్కడే కాలనీ వాసులతో సమావేశమయ్యారు. కాలనీ వాసులు చెప్పిన సమస్యలను సీఎం జగన్, కేంద్రం మంత్రి షెకావత్‌లు సావధానంగా ఆలకించారు. అనంతరం మాట్లాడారు.

కేంద్ర మంత్రి షెకావత్‌ మాట్లాడుతూ.. ‘‘కాలనీలో మంచి వసతులు ఉన్నాయి. సీఎం జగన్‌ మంచి వసతులతో, నాణ్యతతో కాలనీలు నిర్మించారు. మీ వినతులు,సమస్యలు అన్నీ విన్నాం. సీఎం వైఎస్‌ జగన్‌తో చర్చించి సమస్యలు పరిష్కరిస్తాం. వ్యవసాయ పనులతోపాటు ఇతర ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నం చేస్తాం. విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం ప్రాజెక్టుకు ప్రతి రూపాయి ఇస్తాం. ఇంకోసారి ప్రాజెక్టుకు వస్తాను. కాలనీలు సందర్శిస్తాను. ఏపీ సర్కార్‌కు ఏ విధమైన సహాయమైనా చేస్తాం’’ అని హామీ ఇచ్చారు.

సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఇందుకూరులో 350 ఇళ్లు ఉన్నాయి. వసతులు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం. సమస్యలు మా దృష్టికి వచ్చాయి. అధికారులు అన్ని విషయాలు పట్టించుకుని పని చేస్తున్నారు. అయినా కూడా ఇంకా కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరింత దృష్టి పెట్టి పరిష్కరిస్తాం.

పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి సహాయ సహకారాలు తీసుకుని పూర్తి చేస్తాం. ఈ ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి. ఇది పూర్తి అయితే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. గోదావరి డెల్టాకు మరింత ఊతం ఇస్తుంది. కృష్ణా డెల్టాకు మేలు జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్న సహాయానికి అదనంగా మూడు లక్షల రూపాయలు ఇస్తామన్న మాట నాకు గుర్తుంది. నిర్వాసితులకు పదిలక్షల రూపాయలు తప్పకుండా ఇస్తాం.

గతంలో లక్షన్నరకే ఎకరం భూములు ఇచ్చిన రైతులు ఉన్నారు. వారికి ఐదు లక్షలు ఇస్తామని చెప్పాం. లక్షన్నర పోను.. మిగతా మూడున్నర లక్షల రూపాయలు భూములు ఇచ్చిన రైతులకు తప్పకుండా ఇస్తాం. ప్రభుత్వం మీ అందరికీ తోడుగా ఉంటుందని మరోసారి భరోసా ఇస్తున్నా..’’ అని సీఎం జగన్‌ భరోసా ఇచ్చారు. కాలనీల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు అనుగుణంగా చర్యలు చేపడతామని సీఎం హామీ ఇచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి