iDreamPost

అనితారాణి వ్యవహారంపై సీఐడీ దర్యాప్తునకు సీఎం ఆదేశం

అనితారాణి వ్యవహారంపై సీఐడీ దర్యాప్తునకు సీఎం ఆదేశం

చిత్తూరు జిల్లా పెనుమూరు ప్రాథమిక వైద్యశాలలో వైద్యురాలిగా పని చేస్తున్న వైద్యురాలు అనితారాణి వ్యవహారంలో నిజానిజాలు ఏమిటో తేల్చాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సీఐడీకి ఆదేశాలు జారీ చేశారు. తనను కూడా డాక్టర్‌ సుధాకర్‌లా వైసీపీ నేతలు వేధించారంటూ ఇటీవల అనితారాణి ఆరోపించారు. తాను ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని డాక్టర్‌ అనితారాణి.. తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో నిజానిజాలు తేల్చాలని సీఎం జగన్‌ సీఐడీ విచారణకు ఆదేశించారు.

మార్చి 22వ తేదీన జనతాకర్ఫ్యూ రోజు గాయంతో ఓ బాలుడుని స్థానికులు పెనుమూరు ప్రాథమిక ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే ఆ బాలుడికి వైద్యం చేయకుండా డాక్టర్‌ అనితారాణి నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ స్థానికులు మండిపడ్డారు. అయితే ఓపీ తీసుకుని రావాలంటూ మాత్రమే తాను చెప్పానని అనితారాణి తన వాదనను వినిపించారు. వైసీపీ నేతలమంటూ తనపై అనుచితంగా ప్రవర్తించారంటూ అనితారాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికులు కూడా అనితారాణి విషయం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై దర్యాప్తు చేయించిన వైద్య ఆరోగ్యశాఖ అధికారి.. అనితారాణిని చిత్తూరు జిల్లా టీబీ ఆస్పత్రికి డిప్యూటేషన్‌పై పంపారు.

తాజాగా డాక్టర్‌ అనితారాణి తన ఫిర్యాదుపై పోలీసులు స్పందిచలేదంటూ.. టీడీపీ నేతలను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం రాజకీయ రంగుపులుముకుంది. ఈ నేపథ్యంలో అసలు మార్చి 22వ తేదీన పెనుమూరు ప్రాథమిక ఆస్పత్రిలో ఏమి జరిగింది..? అనితారాణిని డిప్యూటేషన్‌పై చిత్తూరు టీబీ ఆస్పత్రికి పంపడానికి కారణాలు.. తదితర అంశాలపై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక అందించాలని సీఎం వైఎస్‌ జగన్‌ కొద్దిసేపటి క్రితం ఆదేశాలు జారీ చేశారు.

కాగా, అనితారాణి విషయంపై టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో దళితులు ఉండాలా…? వలసపోవాలా..? అంటూ ప్రశ్నించారు. వైసీపీ నేతలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారంటూ ఆరోపిచారు. అనితారాణి ఫిర్యాదుపై పోలీసులు ఇప్పటి వరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి