iDreamPost

వై.యస్.ఆర్ కంటి వెలుగు – అంధత్వ రహిత రాష్ట్రమే జగన్ లక్ష్యం

వై.యస్.ఆర్ కంటి వెలుగు – అంధత్వ రహిత రాష్ట్రమే జగన్ లక్ష్యం

వై.యస్ జగన్ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న రోజునుంచి ప్రజా సంక్షేమమే ద్యేయంగా తను చేయాలనుకున్న పనులను వేగంగా చేసుకుంటు వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే మ్యానిఫెస్టోలో చెప్పిన హమీలు 90శాతానికి పైగా పూర్తి చేయటమే కాకుండా హమీ ఇవ్వని అనేక సంక్షేమ కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టి తనది ప్రజా ప్రభుత్వం అనే సంకేతాలు ఇప్పటికే బలంగా పంపారు. ఈ పధకాల అమలు పరంపరలోనే నేడు సి.యం వై.యస్ జగన్ కర్నూలు వేదికగా కంటి వెలుగు 3వ దశను ప్రారంభించారు.

జగన్ ప్రభుత్వం ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంధత్వ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని దృడ సంకల్పంతో చిత్తశుద్దితో ఉన్నట్టు కనిపిస్తుంది. 560 కోట్ల వ్యయంతో రెండున్నర సంవత్సరాల కాలంలో మొత్తం 6దశల్లో రాష్ట్ర ప్రజల్లో నివారింపదగ్గ అందత్వాన్ని 1శాతం నుండి 0.3శాతానికి తగ్గించాలనే లక్ష్యంతో మొదలుపెట్టిన వై.యస్.ఆర్ కంటివెలుగు పధకం విజయవంతంగా రెండు దశలు పూర్తిచేసుకుని నేడు 3వ దశకు చేరుకుంది.

2019 అక్టోబర్ 10నుండి ప్రారంభం అయిన మొదటి దశ, 7 రోజుల పాటు సాగి అక్టోబర్ 16న ముగిసింది. ఈ వారం రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 66 లక్షల ప్రభుత్వ మరియు ప్రైయివేటు పాఠశాలల విద్యార్దులకు 60వేల మంది సిబ్బందితో ఉచిత కంటి పరీక్షలు విజయవంతంగా నిర్వహించి రికార్డు సృష్టించారు . ఆలాగే 2019 నవంబర్ 1వ తారీకు నుండి డిసెంబర్ 31వరకు సాగిన రెండవ దశ కంటి వెలుగు పధకంలో 500మంది నిపుణులతో 4.36 లక్షల మంది విద్యార్ధులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి వారిలో 1.5 లక్షల మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు.

ఈ రెండు దశల్లో క్లిష్టమైన కంటి సమస్యలు ఉన్న 46 వేల మంది విద్యార్ధులలో అవసరమైన వారందరికి శస్త్ర చికిత్సలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పుడు తాజాగా జగన్ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని నేటి నుండి 3వ దశ ప్రారంభిస్తునట్టు ప్రకటించారు .
2020 జులై 31 వరకు సాగే ఈ 3వ దశలో 60 సంవత్సరాల వయస్సు పై బడ్డ వృద్దులకు సమగ్ర ఆధునిక కంటి వైద్య సేవలు ఉచితంగా అందించి వారికి అండగా నిలబడటానికి ప్రభుత్వం సిద్దపడింది.

ఈ 3వ దశలో రాష్ట్రవ్యాప్తంగా 56,88,420 మంది వృద్దులకు గ్రామ సచివాలయల్లో ఉచితంగా కంటి వైద్య సేవలు, అవసరం అయిన వారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేసి మందులు , కంటి అద్దాలు అందజేయనున్నారు. ఇలా రాష్ట్రంలో మొత్తం 6దశలు పూర్తి చేసుకునే సమయానికి కంటి సమస్యలతో బాదపడుతూ ఉండే వృద్దులు, పిల్లలు వై.యస్ ఆర్ కంటి వెలుగు పధకం ద్వారా ఆ సమస్య నుండి బయటపడేట్లు చేసి తద్వారా రాష్ట్రంలో కంటి సమస్యతో బాదపడే వారి సంఖ్యను 1శాతం నుండి 0.3 శాతానికి తగ్గించి అందత్వ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే చిత్తశుద్దితో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.

ముఖ్యమంత్రిగా జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో దృష్టి మందగించిన అనేక మంది కళ్ళకు చూపు ఇవ్వటంతోపాటు పరోక్షంగా వారి ఇళ్ళలో వెలుగులు నింపుతున్నారు, జగన్ చేస్తున్న ఈ కార్యక్రమం పార్టీలకు , ప్రాంతాలకు అతీతంగా హర్షించదగ్గది అని చెప్పటంలో సందేహం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి