Idream media
Idream media
పాక్‌పై 1971లో జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ రోజు తిరుపతిలో స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నాటి యుద్ధంలో విశిష్ట సేవలు అందించిన తిరుపతి వాసి విశ్రాంత మేజర్ జనరల్ సీవీ వేణుగోపాల్ నివాసానికి సీఎం జగన్ వెళ్లారు. ఆయన్ను ఘనంగా సన్మానించారు. విక్టరీ ఫ్లేమ్‌ను అందించారు. యుద్ధంలో వేణుగోపాల్ అందించిన సేవలను ఆర్మీ అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. నాటి యుద్ధ స్మృతులను సీఎం వైఎస్ జగన్.. సీవీ వేణుగోపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన ఇంటి వద్ద మొక్క నాటారు.
1971లో జరిగిన భారత్, పాకిస్తాన్ మధ్య బంగ్లాదేశ్ విషయంలో యుద్ధం జరిగింది. ఈ యుద్ధం తర్వాతనే బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. ఆంగ్లేయుల నుంచి స్వాతంత్రం పొందిన తర్వాత మత ప్రాతిపదికన భారత్, పాకిస్తాన్‌లు ఏర్పడ్డాయి. భారత్‌కు పశ్చిమాన, తూర్పున ముస్లింలు అధికంగా ఉన్నారు. పశ్చిమ పాకిస్తాన్ (ప్రస్తుత పాకిస్తాన్), తూర్పు పాకిస్తాన్( ప్రస్తుత బంగ్లాదేశ్)లు కలసి ఒకే దేశంగా ఉంటున్నాయి. అయితే భారత్ నుంచి పాకిస్తాన్ విడిపోయినప్పటి నుంచే ప్రత్యేక దేశం కోసం తూర్పు పాకిస్తాన్‌లో ఆందోళనలు జరుగుతున్నాయి. రాజకీయం, ఆర్థికంగా తమకు తగిన ప్రాధాన్యత దక్కడంలేదన్నది తూర్పు పాకిస్తానీయుల వాదన. ఈ క్రమంలోనే ఆది నుంచి పలుమార్లు ప్రజా ఆందోళనలు జరిగాయి. ఇవి 1971లో తీవ్రమయ్యాయి.
తూర్పు పాకిస్తాన్‌లో ఉన్న హిందువులను అణచివేసే ప్రయత్నాలను పాకిస్తాన్ ప్రభుత్వం చేసింది. లక్షలాది హిందువులు ఆశ్రయం కోసం భారత్‌వైపు వచ్చారు. వారికి నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఆశ్రయం కల్పించారు. తూర్పు పాకిస్తాన్‌తో సరిహద్దు ఉన్న రాష్ట్రాలలో శరణార్థుల కోసం సిబిరాలను ఏర్పాటు చేశారు. అయితే రోజు రోజుకూ శరణార్థుల సంఖ్య పెరుగుతుండడంతో భారత్‌పై ఆర్థికంగా ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో ప్రధాని ఇందిరా గాంధీ తూర్పు పాకిస్తానీయుల ప్రత్యేక దేశం డిమాండ్‌కు మద్ధతు ప్రకటించారు. దీంతో పాకిస్తాన్, భారత్‌ల మధ్య యుద్ధం ప్రారంభమైంది. 13 రోజుల్లోనే పాకిస్తాన్‌ను భారత బలగాలు మట్టికరిపించాయి. బంగ్లాదేశ్ ఏర్పాటైంది.
చిత్తూరుకు చెందిన సీవీ వేణుగోపాల్ ఇండో–పాక్ యుద్ధంలో విశేష సేవలందించారు. ఆయన్ను చిత్తూరు వేణుగోపాల్ అని కూడా పిలుస్తుంటారు. నాటి యుద్ధంలో వేణుగోపాల్ సమర్థవంతమైన నాయకత్వం, యుద్ధ వ్యూహాలు భారత్‌కు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాయి. అందుకే భారత ప్రభుత్వం వేణుగోపాల్‌ను మహా వీర చక్ర అవార్డుతో గౌరవించింది. వేణుగోపాల్ 1927 నవంబర్ 14న తిరుపతిలో జన్మించారు. 1950లో భారత ఆర్మీలో చేరారు.