Idream media
Idream media
ఇప్పుడైతే సినిమా పోస్టర్లు కనపడ్డం లేదు గానీ ఒకప్పుడు ఈ పోస్టర్లదే రాజ్యం. పోస్టర్ డిజైనింగ్‌లోనే కథా స్వరూపాన్ని వివరించేవాళ్లు. పోస్టర్లు వేయడానికి కొన్ని గోడలు ప్రత్యేకంగా ఉండేవి. సినిమా రిలీజ్‌కు ముందు “త్వరలో” అని పోస్టర్ పడేది. రిలీజ్ తర్వాత నేడే చూడండి, ఆ తర్వాత అదృష్టం బాగుండి ఆడితే 2వ వారం , 3వ వారం…ఇలా పోస్టర్లు పడేవి.
మాది చిన్న ఊరు కాబట్టి రిలీజ్ సినిమాలు వచ్చేవి కావు. రాష్ట్రమంతా ఆడి రీళ్లు తెగి ముక్కలైన తర్వాత అవి డబ్బాలో మా ఊరు వచ్చేవి. ఆల్‌రెడీ పేపర్లో ఆ సినిమా సారాంశాన్ని చదివేసి ఉంటాం కాబట్టి ముందే కథ తెలిసిపోయేది. ఇది కాకుండా థియేటర్లో పాటల పుస్తకాలు అమ్మేవాళ్లు. దాంట్లో సగం కథ రాసి మిగిలేది వెండితెరపై చూడండి అనేవాళ్లు. ఈ వెండితెర ఎక్కడుందో చాలా కాలం తెలిసేది కాదు.
కొత్త సినిమా వస్తే ఊరంతా పోస్టర్లు పడేవి. ఎన్టీఆర్ సినిమా వస్తే నాగేశ్వరరావు అభిమానులు పేడ కొట్టేవాళ్లు. నాగేశ్వరరావు సినిమాలకు కూడా ఇదే గౌరవం జరిగేది. బర్రెలు బాగా ఎక్కువ ఉన్న కాలం కాబట్టి పేడ పుష్కలంగా లభించేది.
హిట్ సినిమాలకి ఊరంతా ఊరేగింపు జరిగేది. దసరాబుల్లోడు సినిమాకి బ్యాండు బాజాతో పాటు పులివేషాలు కూడా వేశారు. ప్రతిరోజూ సాయంత్రం సినిమా బండి ఊరంతా తిరిగేది. దాని వెనుక ఒక కుర్రాడు రంగురంగుల పాంప్లేట్లు పంచేవాడు.
పెద్ద ఊర్లలో కటవుట్స్ పెట్టేవారు. అల్లూరిసీతారామరాజు సినిమాకి అనంతపురంలో ఊరంతా కటవుట్స్ పెట్టారు. కురుక్షేత్రం (1977) సినిమాకి అతిపెద్ద కటవుట్ పెడితే దాన్ని చూడ్డానికి జనం వందల మంది మూగేవారు.
సినిమాకి రప్పించడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు. ఇప్పుడు పబ్లిసిటీ మారింది. సోషల్ మీడియా విజృంభించింది. బస్సులకి, బస్టాపుల్లో ఫ్లెక్సీలు వచ్చాయి. ఏం చేసినా సినిమాలు అడ్డం లేదు. వినోదం రూపు రేఖలు మారిపోతున్నాయి. సినిమా ఇళ్లలోకి వచ్చేసరికి థియేటర్లు మూతపడ్డాయి.
ఒకప్పుడు నేలమీద, ఎంగిలి మరకల మధ్య, మసకమసగ్గా బొమ్మ కనిపించినా విజిల్స్ వేసి చూశాను. ఇప్పుడు మాల్‌లో ఏసీ, కుషన్ సీట్స్, DTS సౌండ్ ఎన్నో సౌకర్యాలున్నాయి. కానీ బొమ్మ కనిపిస్తే విజిల్ వేసే థ్రిల్ ఎక్కడ? బాల్యం మనలో నుంచి వెళ్లిపోయిన తర్వాత, అన్నింటికి ఆశ్చర్యపోయే లక్షణం మాయమైన తర్వాత మనం వట్టి డొల్ల మాత్రమే.