iDreamPost

చంద్రబాబును మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వండి: సీఐడీ

  • Author Dharani Updated - 12:39 PM, Tue - 26 September 23
  • Author Dharani Updated - 12:39 PM, Tue - 26 September 23
చంద్రబాబును మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వండి: సీఐడీ

ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో.. రిమాండ్‌ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏసీ హైకోర్టు.. రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి కూడా అప్పగించింది. అయితే.. కోర్టు ఇచ్చిన 2 రోజుల కస్టడీలో.. చంద్రబాబు తమ విచారణకు ఏ మాత్రం సహకరించలేదని సీఐడీ వెల్లడించింది. కోర్టు ఇచ్చిన కస్టడీ ఉత్తర్వులను చదివే పేరుతో చంద్రబాబు.. గంటల కొద్దీ సమయాన్ని వృథా చేశారని సీఐడీ తెలిపింది. అంతేకాక కేవలం 2 రోజుల కస్టడీకి మాత్రమే ఇవ్వడంతో ఆ గడువును అడ్డంపెట్టుకుని చంద్రబాబు కావాలనే ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేశారంది. ఆయన నుంచి పలు అంశాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టాల్సి ఉందని, అందువల్ల ఆయనను మరి కొద్ది రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించడం చాలా అవసరమని సీఐడీ తమ పిటిషన్‌లో కోర్టుకు నివేదించింది. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరుపుతామని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులను ఆదేశించింది.

సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌లో ఇలా చెప్పుకొచ్చింది..‘‘ఈ కేసు విచారణ నిమిత్తం.. ఐదు రోజుల పాటు చంద్రబాబును మా కస్టడీకి అప్పగించాలంటూ మొదట ఈ నెల 11న పిటిషన్‌ దాఖలు చేశాం. దీనిపై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు పలు షరతులతో కేవలం 2 రోజుల కస్టడీకే మాత్రమే అంగీకరిస్తూ.. ఈ నెల 22న ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు విధించిన షరతులకు లోబడి చంద్రబాబును విచారించాము. ఇక కస్టడీ ఉత్తర్వులను తీసుకున్న చంద్రబాబు వాటిని మధ్యాహ్నం 1 గంట వరకు చదువుతూనే ఉన్నారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాల ప్రకారం దర్యాప్తు అధికారి చంద్రబాబుకు గంట పాటు భోజన విరామ సమయం ఇచ్చారు’’ అని పేర్కొన్నారు.

‘‘భోజన విరామం తరువాత వచ్చిన చంద్రబాబు.. ఆపై కూడా 2 గంటల వరకు కోర్టు ఉత్తర్వులను చదువుతూనే ఉన్నారు. 2.20 గంటల సమయంలో మాకు కోర్టు కేవలం రెండు రోజుల కస్టడీ మాత్రమే ఇచ్చిందని చంద్రబాబుకు దర్యాప్తు అధికారి స్పష్టం చేశారు. ఉత్తర్వులను చదవడం ఆపి, తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయనను దర్యాప్తు అధికారి కోరారు. అయితే దీనిని చంద్రబాబు పట్టించుకోలేదు. అలా మరికొద్దిసేపు కోర్టు ఉత్తర్వులను చదువుతూనే ఉన్నారు’’ అని సీఐడీ తన పిటిషన్‌లో పేర్కొంది.

చంద్రబాబు సహకరించకపోవడం వల్ల సాధ్యం కాలేదు

‘ఈ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో లోతైన కుట్ర దాగి ఉంది. దీని వెనుక వాస్తవాలను వెలికితీసేందుకు చంద్రబాబును విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికార దుర్వినియోగం, ప్రైవేటు వ్యక్తులకు చేకూర్చిన లబ్ధి గురించి ప్రశ్నించాల్సి ఉంది. సాక్షులు చెప్పిన వివరాలను ఆయన ముందుంచి వాటి ఆధారంగా వాస్తవాలను రాబట్టాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థగా మాపై ఉంది. ఇక ఈ కుంభకోణం డబ్బు మొత్తం చివరకు నగదు రూపంలో చేరింది వికాస్‌ ఖన్వీల్కర్, షెల్‌ కంపెనీలకు. ఇందుకు ప్రధాన సూత్రధారి చంద్రబాబు అని దర్యాప్తులో తేలింది. షెల్‌ కంపెనీల ద్వారా డబ్బు మొత్తం తిరిగి ఆయనకే చేరింది. అంతేకాక ఈ కేసులో సుమన్‌ బోస్, వికాస్‌ ఖన్వీల్కర్, లక్ష్మీనారాయణ, గంటా సుబ్బారావు, సంజయ్‌ దాగాలు వెల్లడించిన వివరాల ఆధారంగా చంద్రబాబును ఇంకా ప్రశ్నించాల్సి ఉంది’’ అని సీఐడీ తన పిటిషన్‌లో వెల్లడించింది.

‘‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో.. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీనే అంతిమ లబ్ధిదారులు అని మా దర్యాప్తులో తేలింది. నిధుల మళ్లింపులో ఎవరెవరి పాత్ర ఏంటి వంటి తదితర వివరాలు చంద్రబాబుకు పూర్తిగా తెలుసు. కుట్ర పన్నిన తీరు, ఇతర నిందితుల పాత్ర, ఇతర కీలక వివరాలన్నీ చంద్రబాబుకు తెలుసు. కనుక ఈ వివరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చంద్రబాబును 5 రోజుల పాటు మా కస్టడీకి ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాం’’ అని సీఐడీ తన పిటిషన్‌లో తెలిపింది. నేడు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి