iDreamPost

అమరావతిలో భూములు కొన్న ‘అనంత’ పేదలు

అమరావతిలో భూములు కొన్న ‘అనంత’ పేదలు

అమరావతి భూ దందాలో ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తోంది. సీఐడీ దర్యాప్తుతో అక్రమార్కుల వెన్నులో వణుకుపుడుతోంది. రాజధానిగా అమరావతిని ప్రకటించకముందే అక్కడ భూములు కొన్న వారి జాబితాలో అనంతపురం పేదలు చేరారు. సీఐడీ చేస్తున్న దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు అనంతపురం జిల్లా కనగానపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం రికార్డులు పరిశీలించారు.

అమరావతిలో మాజీ మంత్రి పరిటాల సునీత భూములు కొనుగోలు చేశారని మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదకలో వెల్లడైంది. ఈమెతోపాటు అనంతపురం జిల్లాకే చెందిన ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ కూడా భూములు కొనుగోలు చేశారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇద్దరు తెల్లరేషన్‌కార్డుదారులు కూడా భూములు కొనుగోలు చేసినట్లు వెల్లడికావడంతో సీఐడీ ఆ దిశగా దృష్టి పెట్టింది. కోట్ల రూపాయల విలువైన భూములను పేదలు ఎలా కొనుగోలు చేయగలరన్న అంశంపై లోతుగా విచారణ జరుపుతోంది. వీరు ఎవరికైనా బినామీలుగా ఉన్నారా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తోంది.

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అధ్యక్షతన అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై విచారణ జరిగిన విషయం తెలిసిందే. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం లోకాయుక్తతో దర్యాప్తు చేయాలని మంత్రి మండలిలోనూ, అసెంబ్లీలోనూ తీర్మాణాలు చేసింది. అయితే ఈ లోపు రాజధాని ప్రాంతానికి చెందిన లక్ష్మీ అనే దళిత మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో మాజీ మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులపై సీఐడీ కేసులు నమోదు చేసింది.

ఆర్థిక మంత్రి బుగ్గన ఇచ్చిన నివేదికలో అమరావతిలో 4070 ఎకరాలు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో కొన్నారని తేలింది. ఈ భూములు కొనుగోలు చేసిన వారిలో 797 మంది తెల్లరేషన్‌కార్డుదారులు కూడా ఉన్నట్లు వెల్లడైంది. ఈ కోవలో కూడా దర్యాప్తు చేసిన సీఐడీ ఇప్పటికే ఏడుగురిపై కేసులు నమోదు చేసింది. ఇందులో భాగంగానే తాజాగా అనంతపురంలో విచారణ జరుపుతోంది. తెల్లరేషన్‌కార్డుదారుల జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు కూడా ఉండడం గమనార్హం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి