iDreamPost
android-app
ios-app

వచ్చే ఎన్నికలకు అయ్యన్న ఔటేనా!

  • Published Sep 04, 2021 | 1:12 AM Updated Updated Sep 04, 2021 | 1:12 AM
వచ్చే ఎన్నికలకు అయ్యన్న ఔటేనా!

విశాఖ జిల్లా టీడీపీ సీనియర్ నేతల్లో ఒకరైన చింతకాయల అయ్యన్న పాత్రుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా.. చేయరా.. అన్న చర్చ మొదలైంది. యువ నాయకులకు అవకాశం ఇచ్చే క్రమంలో అయ్యన్న లాంటి వృద్ధనేతలకు విశ్రాంతి ఇవ్వాలని స్వయంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రతిపాదిస్తుండటంతో ఈ చర్చ జరుగుతోంది. వాస్తవానికి గత ఎన్నిక ఎన్నికల్లోనే తన స్థానంలో కుమారుడికి టికెట్ ఇప్పించుకునేందుకు అయ్యన్న ప్రత్నించారు. అయితే పోటీ తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు అయ్యన్నకే టికెట్ ఇచ్చారు. అచ్చెన్నాయుడు ప్రతిపాదన మేరకు వృద్ధ నేతలకు విశ్రాంతి కల్పించాల్సి వస్తే అయ్యన్నను పక్కన పెడతారా.. పెడితే ఆయన వారసుడికి టికెట్ ఇస్తారా లేక వేరే వారిని తెరపైకి తెస్తారా.. అన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది.

కుటుంబంలో విభేదాలు

నర్సీపట్నం నియోజకవర్గం అయ్యన్నపాత్రుడికి కంచుకోటలా ఉండేది. ఆయన ఇక్కడి నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. 1982 నుంచి టీడీపీలో ఉన్న ఆయన 1983, 1985, 1994, 1999, 2004, 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. మంత్రిగా సుదీర్ఘకాలం పాటు పలు శాఖలు నిర్వహించారు. పార్టీలోనూ ఆయనకు ప్రాధాన్యత ఇచ్చేవారు. 2004లో వైఎస్ హవాను తట్టుకోగలిగినా.. 2019లో జగన్ గాలిని మాత్రం ఎదుర్కోలేక చతి కిలపడ్డారు. సొంత కుటుంబంలో విభేదాలు కూడా దానికి కారణమయ్యాయి. కుటుంబమంతా కలిసి ఉన్నప్పుడు తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన అయ్యన్నపై సోదరుడే తిరుగుబాటు చేయడంతో ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నాళ్లు వెన్నుదన్నుగా ఉన్న తమను కాదని కుమారుడు విజయ్ ని వారసుడిగా తెరపైకి తేవడానికి అయ్యన్న ప్రయత్నించడంతో ఆయన సోదరుడు సన్యాసిపాత్రుడు (జమీల్) అసంతృప్తికి గురయ్యారు. అయ్యన్నతో విభేదించి గత ఎన్నికలకు ముందే సతీసమేతంగా వైఎస్సార్సీపీలో చేరిపోయారు. మరోవైపు కుమారుడికి టికెట్ ఇప్పించుకోలేక స్వయంగా పోటీ చేసిన అయ్యన్న ఓటమిపాలయ్యారు.

విజయ్ పై వ్యతిరేకత

కుమారుడు విజయ్ ని తన వారసుడిగా తీర్చిదిద్దాలని అయ్యన్న 2019 ఎన్నికలకు చాలా ముందు నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే మంత్రిగా ఉన్న తండ్రి పేరుతో పార్టీ కార్యకర్తలు, ప్రజలపై విజయ్ పెత్తనం చేయడం ప్రారంభించారు. లేటరైట్ ముసుగులో బాక్సైట్ అక్రమ తవ్వకాలు, రవాణాకు పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా వినిపించాయి. దాంతో నియోజకవర్గ ప్రజల్లో ఆయన సానుకూలత ఏర్పరచుకోలేకపోయారు. గత ఎన్నికల్లో తనకు బదులు తన కుమారుడికి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని అయ్యన్న కోరినా.. ఈ కారణాలతోనే చంద్రబాబు అవకాశం ఇవ్వలేదన్న అభిప్రాయం కూడా ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో 65 ఏళ్లు దాటిన వారికి విశ్రాంతి ఇచ్చి యువ నేతలకు అవకాశం ఇవ్వాలని అచ్చెన్నాయుడు ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. ఆ ప్రతిపాదనకు చంద్రబాబు ఆమోదం తెలిపితే అయ్యన్న, శత్రుచర్ల విజయరామరాజు, కిషోర్ చంద్రదేవ్ వంటి చాలామంది నేతలు తప్పుకోవలసి వస్తుంది. అప్పుడు అయ్యన్న స్థానంలో నర్సీపట్నంలో ఆయన కుమారుడు విజయ్ కి అవకాశం ఇస్తారా.. ఆయనకు అవకాశం ఇవ్వకపోతే ప్రత్యామ్నాయం ఎవరు అన్న చర్చ జరుగుతోంది.