iDreamPost

చైనా సరిహద్దులో ఉద్రిక్తత…. త్రివిధ దళాధిపతులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ప్రధాని మోదీ

చైనా సరిహద్దులో ఉద్రిక్తత….    త్రివిధ దళాధిపతులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ప్రధాని మోదీ

లద్దాఖ్‌ సరిహద్దులలో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంగళవారం నాడు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, డిఫెన్స్ స్టాఫ్ ప్రధానాధికారి బిపిన్‌ రావత్‌, త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. చైనా సరిహద్దు భద్రత సమస్యపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ త్రివిధ దళాల అధిపతులతో  సుదీర్ఘంగా భద్రత సమావేశం నిర్వహించిన కొద్దిసేపటికే మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

లద్దాఖ్‌ సమీపంలో చైనా మిలటరీ ఎయిర్‌బేస్‌ను విస్తరిస్తున్నట్లు శాటిలైట్‌ ఫోటోల ద్వారా తెలిసిన నేపథ్యంలో ప్రధాని మోదీ నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానంతరం చైనా సరిహద్దు వివాదం గురించి విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్‌తోనూ ప్రధాని మోదీ చర్చించినట్లు తెలుస్తోంది.

రెండు రోజుల క్రితం లేహ్ ప్రాంతంలో పర్యటించి తిరిగి వచ్చిన ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవాణే ఇరు దేశాల మధ్య ఉన్న వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితిని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు వివరించారు. ఈ సందర్భంగా సరిహద్దులో భద్రతాదళాల మోహరింపు వివరాలు రక్షణ మంత్రి తెలుసుకున్నట్లు సమాచారం.

వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలలో మే 5 న ఇరు దేశ సైనికుల మధ్య జరిగిన మొదటి సరిహద్దు వాగ్వివాదం తర్వాత భారత్, చైనా దళాల మధ్య జరిగిన ఆరు రౌండ్ల చర్చలు ఉద్రిక్తతలను తగ్గించడంలో విఫలమయ్యాయి.

భారత దేశంవైపుగల వాస్తవాధీన రేఖ వెంబడి 255 కిలోమీటర్ల దర్బుక్-ష్యోక్-డీబిఓ రోడ్డు నిర్మాణాన్ని భారత్ గత సంవత్సరం పూర్తి చేసింది. ఇది డెప్సాంగ్ ప్రాంతం మరియు గాల్వన్ లోయను అనుసంధానిస్తూ కరాకోరం పాస్ దగ్గర ముగిసే ఈ రహదారి నిర్మాణంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.అయితే లడఖ్‌లో భారత ప్రభుత్వం రోడ్లు, తదితర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చెయ్యడంతో పెట్రోలింగ్ నిర్వహణ సులభతరం అయ్యింది.

తాజా రహదారి వివాదంతో పీపుల్ లిబరేషన్ ఆర్మీ సైనికులు దూకుడు ప్రదర్శిస్తూ మే 5 న లడఖ్‌ సరిహద్దు ప్రాంతాలలో భారత భూభాగంలోకి చొరబడ్డాయి. దీంతో భారత్,చైనా దళాలు ముఖాముఖి తలపడి రాళ్లు రువ్వుకున్నారు. అలాగే ఉత్తర సిక్కింలో లా పాస్ సమీపంలో భారత్, చైనీస్ సైనికులు ఒకరిపై ఒకరు ముష్టి యుద్ధం చేయగా ఇరువైపులా పదుల సంఖ్యలో సైనికులు గాయపడ్డారు.

కానీ ఇప్పటి వరకు వివాదాస్పద భూభాగ జాబితాలో లేని గాల్వన్‌ లోయలో చైనా సైనికులు గత రెండు వారాలుగా సుమారు 150 తాత్కాలిక గుడారాలను ఏర్పాటు చేసుకొని తిష్ట వేశారు. వాస్తవాధీన రేఖ వద్ద చైనా దళాలు నిర్మాణాలు చేపట్టినట్టు ఇంటలిజెన్స్ నివేదికలు అందడంతో భారత్ కూడా ఆ ప్రాంతంలో అదనపు భద్రతా దళాలను మోహరించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి