iDreamPost

ట్రంప్ కు ఎదురుతిరిగిన చైనా .. దర్యాప్తుకు అనుమతించరంట

ట్రంప్ కు ఎదురుతిరిగిన చైనా .. దర్యాప్తుకు అనుమతించరంట

కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయానికి చైనా ఎదురు తిరిగింది. తమ దేశంలోని వైరాలజీ ల్యాబులపై దర్యాప్తు జరుపుతామన్న డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని చైనా అడ్డుకున్నది. ఈ విషయాన్ని ప్రపంచదేశాలు మొదటి నుండి అనుమానిస్తున్నదే. అనుమానంతో అమెరికా అధ్యక్షుడు చైనాలోని ల్యాబులపై దర్యాప్తు చేస్తానంటే చైనా ఎందుకు ఒప్పుకుంటుందనే విషయంలో ఇప్పటికే అనేక దేశాలు తమ అనుమానాలను వ్యక్తం చేశాయి. దానికి తగ్గట్లే చైనా ట్రంప్ ఆదేశాలను కొట్టిపడేసింది.

ఉద్దేశ్యపూర్వకంగానే తామే వైరాలజీ ల్యాబు నుండి కరోనా వైరస్ ను ప్రపంచం మీదకు వదిలిపెట్టామన్న అనుమానాలు అవసరం లేదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గెంగ్ షువాంగ్ స్పష్టం చేశారు. ఇదే విధమైన ఆరోపణలతో తమ దేశంపై ప్రపంచదేశాల్లో అనుమానాలు రేకెత్తించి విచారణ చేస్తామంటూ దర్యాప్తు బృందాలను పంపటాన్ని చైనా అవమానంగా భావించింది. అందుకనే అమెరికా పంపాలని అనుకుంటున్న దర్యాప్తు బృందాలను అనుమతించేది లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది.

కరోనా వైరస్ విషయంలో తాము కూడా బాధితులమే కానీ నేరస్తులం కాదని విదేశాంగ ప్రతినిధి స్పష్టం చేశాడు. వూహాన్ పరిశోధనశాలలో ఏమి జరుగుతోందో తెలుసుకోవాలన్న ట్రంప్ ఆలోచనలకు డ్రాగన్ దేశం అడ్డుకట్టవేసింది. అయితే వూహాన్ లోని పరిశోధనశాల నుండి కరోనా వైరస్ ఎలా బయటకు వచ్చిందనే విషయంలో అమెరికా ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టేసింది. మరి దర్యాప్తులో భాగంగా చైనాలోకి అడుగుపెట్టకుండా అమెరికా బృందాలు దర్యాప్తును ఎలా చేస్తాయనే విషయంలో ఇపుడు అందరిలోను ఆసక్తి పెరిగిపోతోంది.

వైరస్ అన్నది సమస్త మానవాళికీ శతృవే అన్నాడు విదేశాంగ ప్రతినిధి. వైరస్ తయారు చేసిన వాళ్ళలో తాము లేమంటూ స్పష్టం చేసినా ప్రపంచ దేశాల్లో మాత్రం చైనా విషయంలో అనుమానాలు పెరిగిపోతున్నాయి. వైరస్ విషయంలో ముందుగా సమాచారం ఇవ్వలేదన్న ట్రంప్ ఆరోపణలను కూడా చైనా కొట్టి పడేసింది. తాము సకాలంలోనే ప్రపంచదేశాలను అప్రమత్తం చేసినట్లు చైనా చెప్పుకుంటోంది. అలాగే 2008లో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్దిక సంక్షోభం అమెరికాలో పుట్టిన విషయాన్ని షువాంగ్ గుర్తు చేశారు. అప్పుడేమైనా తాము అమెరికాను నిందించామా అంటూ ఎదురుదాడి మొదలుపెట్టాడు. మొత్తానికి వైరస్ వ్యాప్తి దర్యాప్తు ఎటువంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి