iDreamPost

చంద్ర‌బాబు మూడు రాజ‌ధానుల‌కు జైకొట్ట‌క త‌ప్ప‌దా..!

చంద్ర‌బాబు మూడు రాజ‌ధానుల‌కు జైకొట్ట‌క త‌ప్ప‌దా..!

మ‌రో ద‌శాబ్దం త‌ర్వాత‌నైనా స‌రే… ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలుగుదేశం పార్టీ నిల‌దొక్కుకోవాలంటే ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణకు ఒప్పుకోవాల్సిందేనా..? జ‌గ‌న్ తెచ్చిన మూడు రాజ‌ధానుల నినాదానికి జై కొట్టాల్సిందేనా..? అంటే అవున‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఇటీవ‌ల టీడీపీ నేత‌ల‌కు ఎదుర‌వుతున్న చేదు అనుభ‌వాలు, చంద్ర‌బాబుకు త‌గులుతున్న నిర‌స‌న సెగ‌లు దీనికి నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయి. గవర్నర్ ఆమోదం అనంత‌రం మూడు రాజధానులకు ఏపీ సిద్ధ‌మైంది. ఆ దిశగా సర్కార్ కూడా ఆచితూచి అడుగులు ముందుకు వేస్తోంది. నిధులు – విధుల విష‌యంలో అన్ని ప్రాంతాల‌కూ స‌మ న్యాయం జ‌రిగేలా ప్ర‌ణాళికాబ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. పరిపాలనా రాజధాని విశాఖ ప‌టిష్ట‌త‌కు, భ‌విష్య‌త్ లో పెర‌గ‌బోయే పారిశ్రామిక‌, ఉపాధి రంగాల‌కు అనుగుణంగా ఏర్పాట్ల‌కు ఇప్ప‌టికే స‌న్నాహాలు మొద‌ల‌య్యాయి. సీఎంవో అధికారులు, డీజీపీ కూడా అక్కడ పర్యటించారు.. అక్కడి పరిస్థితులపై ఓ అంచనాకు వచ్చారు. ప్ర‌తిబంధ‌కాలు తొల‌గిన వెంట‌నే అత్య‌వ‌స‌ర రంగాల త‌ర‌లింపున‌కు సిద్ధంగా ఉన్నారు.

ప్ర‌జ‌లు కూడా ఆ దిశ‌గానే…

రాష్ట్రంలో ఇకపై పరిపాలనా (ఎగ్జిక్యూటివ్) రాజధానిగా విశాఖపట్నం.. న్యాయ (జ్యుడీషియల్) రాజధానిగా కర్నూలు.. శాసన (లెజిస్లేచర్) రాజధానిగా అమరావతి కొన‌సాగుతాయ‌ని ఏపీ ప్ర‌జ‌లు ఇప్ప‌టికే నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఆ దిశ‌గానే త‌మ నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా ఇటీవ‌ల కొంత కాలంగా పాల‌నా రాజ‌ధాని విశాఖ న‌గ‌రానికి వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి. అక్క‌డ పెరుగుతున్న ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాల‌కు అనుగుణంగా జ‌నాభా పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం కూడా త‌గిన ఏర్పాట్లు చేస్తోంది. రానున్న కాలంలో విశాఖ‌కు 20 నుంచి 30 శాతం జ‌నాభా అధికంగా పెరుగుతుంద‌ని అంచ‌నా వేస్తోంది. ఈ స‌మీక‌ర‌ణాల‌న్నీ ప్ర‌జ‌లంద‌రూ మూడు రాజ‌ధానుల‌కు సిద్ధంగా ఉన్న‌ట్లుగా తెలియ‌జేస్తున్నాయి. ఈ క్ర‌మంలో మూడు రాజ‌ధానుల‌ను వ్య‌తిరేకిస్తూ ఏ పార్టీ చ‌ర్య‌లు చేప‌ట్టినా ప్ర‌జ‌లు హ‌ర్షించే స్థితిలో లేరు. ఇది గుర్తించిన కొంద‌రు ఎమ్మెల్యేలు వైసీపీకి జై కొట్టారు. అయిన‌ప్ప‌టికీ ఈ విష‌యాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత ఇప్ప‌టికీ గుర్తించిన‌ట్లు క‌నిపించ‌డం లేదు.

అమ‌రావ‌తిలో బాబుకు నిర‌స‌న సెగ‌

టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు చేదు అనుభవం ఎదురైంది. అమరావతి సమీపంలోని మందడంలో నిరసన సెగ ఎదురైంది. అభివృద్ధి వికేంద్రీకరణ దీక్షా శిబిరం వద్దకు రాగానే స్థానికులు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్లజెండాలు చూపుతూ మహిళలు నిరసన తెలిపారు. చంద్రబాబు దళిత ద్రోహి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు అంటూ ప్లకార్డులు చూపించారు. ఇళ్లస్థలాలపై కోర్టులో వేసిన పిటిషన్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూడు రాజధానులను చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ తీరుకు వ్యతిరేకంగా, మూడు రాజధానులకు మద్దతుగా మందడంలో స్థానికులు దీక్షాశిబిరం ఏర్పాటు చేశారు. రైతుల ముసుగులో టీడీపీ నేతలు చేస్తున్న దీక్షలను తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయానికి అమరావతి ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు పేదలకు ఇళ్లపట్టాల పంపిణీకి వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా.. టీడీపీ నేతలు అడ్డుకోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి