iDreamPost

చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ పీక్‌కు వెళుతోందిగా..

చంద్రబాబు ఫ్రస్ట్రేషన్  పీక్‌కు వెళుతోందిగా..

రాజకీయ నేతలు విమర్శలు, ప్రశంగాలు ఎంత హుందాగా సాగితే ప్రజా స్వామ్యం అంతలా ఫరిడవిల్లుతుంది. చోటా మోటా రాజకీయ నేతలు మాదిరిగా రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా చేసిన వ్యక్తులు, పార్టీలకు నాయకత్వం వహిస్తున్న నేతలు మాట్లాడితే ప్రజలు హర్షించరు. ముఖ్యమంత్రులుగా చేసిన వ్యక్తులు, పార్టీల అధినేతల మాటల ప్రభావం ప్రజలపై అధికంగా ఉంటుంది. వారి మాటలను ప్రసంగాలను ప్రజలు శ్రద్ధగా ఆలకిస్తుంటారు. ఈ విషయం నేతలు నిత్యం మననం చేసుకుంటూ మాట్లాడాలి. లేకపోతే అబాసుపాలవ్వక తప్పదు. తమకు ఎంత ఫ్రస్ట్రేషన్  ఉన్నా అది మనసులోనే అదిమిపెట్టి ప్రత్యర్ధులపై విమర్శనాస్త్రాలు సంధిస్తే పై చేయి సాధిస్తారు. కానీ రౌడీల్లా మాట్లాడితే.. చెప్పాలనుకుంది పక్కకుపోయి.. తిరిగి నష్టం చేకూరుతుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో రాజధాని అంశం నలుగుతోంది. దాదాపు 50 రోజులుగా మాజీ సీఎం చంద్రబాబు మూడు రాజధానుల ప్రక్రియను అడ్డుకోవడానికి చేయని ప్రత్నమంటూ లేదు. అయినా ఫలితం ఉండడంలేదు. సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్ర సమతుల అభివృద్ధికే మూడు రాజధానులంటూ ముందుకు వెళుతుండడంతో.. చంద్రబాబుకు ఫ్రస్ట్రేషన్  పీక్‌ స్టేజికి వెళుతోంది. తన వయస్సును, హోదాను కూడా మరిచి వీధి రౌడీలు మాట్లాడే భాషతో సీఎం వైఎస్‌ జగన్‌పై విరుచుకుపడుతున్నారు. దమ్ముంటే పోలీసులు లేకుండా రా.. అంటూ సవాళ్లు విసురుతూ వీధి పోరాటాలను గుర్తు చేస్తున్నారు.

అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని.. దాదాపు 4070 ఎకరాలు ఇప్పటికే తేలిందని మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో కూడా వెల్లడించింది. దీనిపై సీఐడీ విచారణ చేస్తోంది. అయితే చంద్రబాబు.. ప్రభుత్వం ఆరోపిస్తున్న ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై విరుచుకుపడ్డారు. తొమ్మిది నెలలుగా ఇన్‌సైడర్‌ ట్రేండింగ్‌ అంటున్నారు.. వెంట్రుకైనా పీకారా..? అనడంతో 70 ఏళ్ల చంద్రబాబేనా ఇలా మాట్లాడేది అన్న సందేహం రాష్ట్ర ప్రజల్లో కలుగుతోంది. అంతేకాదు.. అమరావతిని గ్రాఫిక్స్‌ అనే వైఎస్సార్‌సీపీ.. ఆ పార్టీ ఎమ్మెల్మేలందరూ అమరావతిలోని భవనాలను ఎక్కి దూకి చస్తే పీడాపోతుందనడం.. వారందరూ మరణించాలనే చంద్రబాబు కోరుకుంటున్నారా..? అనే ప్రశ్న ప్రజల నుంచి వ్యక్తమవుతోంది.

50 రోజులుగా విజ్ఞప్తులు.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా.. రాష్ట్ర ప్రజలు, యువత, విద్యార్థుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో చంద్రబాబు మరింతగా రగిలిపోతున్నారు. జగన్‌ లాంటి దుర్మార్గుడు పరిపాలనలోకి వచ్చినప్పుడు ఇంటికొకరు బయటకు రావాలి. మీలో రోషం, కసి, పౌరుషం రావాలంటూ నిన్న అమరావతి గ్రామాలకు వెళ్లిన సమయంలో రెచ్చ గొట్టారు. ఒక్క రోజు జైలుకు పోతే ఏమీ కాదంటున్నారు. ఇలా జైలుకు వెళ్లేవారిని గుర్తించి సన్మానిస్తామంటున్నారు. అంతేకాదు.. భవిష్యత్‌లో వారిని ఆదరిస్తామని.. పరోక్షంగా అసాంఘిక కార్యక్రమాలు చేయాలని చెబుతున్నారు. చంద్రబాబు మాటలు వింటున్న ప్రజలు ఈయనేనా.. రాష్ట్రానికి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసింది..? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం తమ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే ప్రజలే రోడ్లపైకి వస్తారు. శాంతియుతంగా వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తారు. అమరావతిలోని కొన్ని గ్రామాల ప్రజలు ప్రస్తుతం ఇలానే చేస్తున్నారు. అయితే చంద్రబాబు వారిని జైలుకు వెళ్లే పనులు చేయాలంటూ.. ఇలా చేస్తే సన్మానిస్తాం.. ఆదరిస్తాం.. అంటూ పురిగొల్పడంపై పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక చంద్రబాబు కన్నా తానేమి తక్కువ కాదంటూ… కామ్రేడ్‌ రామకృష్ణ మాట్లాడుతున్నారు. జగన్‌ కనిపిస్తే.. నరికేస్తారంటూ.. వ్యాఖ్యానిస్తున్నారు. మంత్రులను గాడిద.. వాడొక మంత్రి అంటూ ఏకవచనంతో సంభోదిస్తున్నారు. మా రాయలసీమలోనైతే ఈ పాటికి పగలకొట్టేవాళ్లం అంటూ.. ఈ సీపీఐ ఏపీ సారధి తన నోటికి పని చెబుతున్నారు. గతంలో ఇదే సీపీఐ రామకృష్ణ.. అమరావతిలో జరిగిన ల్యాండ్‌ పూలింగ్‌ను వ్యతిరేకించారు. మూడు పంటలు పండే భూములను నాశనం చేస్తున్నారంటూ రైతులకు అండగా నిలిచారు. ఇప్పుడు తన స్టాండ్‌ను ఎందుకనో మార్చుకున్నారు. మంచి చెడులతో సంబంధం లేకుండా.. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడడమే కమ్యూనిస్టుల పని అన్నట్లుగా రామకృష్ణ వ్యవహరిస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు. మరి ఈ నేతలు ఫ్రస్ట్రేషన్ ఇంకా ఏ స్థాయికి చేరుతాయో.. వారి భాష భవిష్యత్ లో ఏ రూపం తీసుకుంటుందో.. వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి