iDreamPost

లోకేష్‌ను ఎన్టీఆర్‌తో పోల్చిన బాబు..! ప్రయత్నాలు ఎప్పుడు ఫలించేనో..?

లోకేష్‌ను ఎన్టీఆర్‌తో పోల్చిన బాబు..! ప్రయత్నాలు ఎప్పుడు ఫలించేనో..?

కొడుకు ప్రయోజకుడైతే చూడాలని ప్రతి తండ్రీ ఉబలాటపడుతుంటాడు. తన కన్నా తన కుమారుడు ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకోవడమే కాదు.. అందుకు అవసరమైన శ్రమ చేస్తారు. చేయి పట్టి నడిపిస్తారు. కుమారుడు జీవితంలో సెటిల్‌ అయ్యేందుకు శతవిధాలా సహాయం చేస్తారు. కుమారుడు ప్రయోజకుడు కాకపోతే.. ఆ తండ్రి జీవితం సంపూర్ణం కాదు. అందుకే చివరి శ్వాస వరకూ కుమారుడు జీవితం కోసం కష్టపడుతుంటారు. సామాన్యుడు, గొప్పవాడు అనే బేధం ఇక్కడ లేదు. ఎవరి స్థాయిలో వారు.. తమ కొడుకులను ఉన్నత స్థితిలో చూడాలనుకుంటారు. ఇలా కుమారుడు కోసం కష్టపడుతున్న రాజకీయ నేతల్లో నారా చంద్రబాబు నాయుడు మొదటి వరసలో.. మొదటి స్థానంలో ఉంటారు.

చంద్రబాబుకు సమకాలీనులైన నేతల కుమారులు అందరూ రాజకీయ పయణంలో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. తమ ప్రతిభాపాటవాలను ప్రపంచానికి తెలియజేసి.. తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందుకున్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్‌ జగన్‌ ఏపీ ముఖ్యమంత్రి కాగా.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌ ఆ రాష్ట్ర మంత్రిగా, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాబోయే సీఎం కేటీఆర్‌ అనే ప్రచారం కూడా ఉంది. దివంగత ఎర్రన్నాయుడు కుమారుడు రామోహ్మన్‌ నాయుడు తనేంటో రెండు సార్లు వరుసగా ఎంపీగా గెలిచి రుజువు చేసుకున్నారు. ఒకానొక దశలో ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి కూడా దక్కుతుందన్న ప్రచారం ఇటీవల సాగింది.

అయితే చంద్రబాబు కుమారుడు లోకేష్‌ మాత్రం గత పదేళ్లుగా రాజకీయాల్లో ఓనమాలు దిద్దే వద్దే ఉన్నారు. పార్టీ బాధ్యలు అప్పజెప్పినా.. పెద్దల సభకు పంపించి మంత్రిని చేసినా.. లోకేష్‌ మాత్రం పాస్‌ మార్కులు కూడా తెచ్చుకోలేకపోయారు. రాజకీయపరమైన శిక్షణ, భాషపై పట్టుకోసం ట్యూషన్లు, తెలివితేటలు పెంచేందుకు సీనియర్ల చేత లెక్చర్లు.. ఇలా అనేక ప్రయత్నాలను చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేశారు. అయినా లోకేష్‌ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగానే ఉందని గత ఎన్నికల్లో మంగళగిరిలో నిర్వహించిన ప్రచారం, అక్కడ వచ్చి ఫలితంతో తేలిపోయింది.

లోకేష్‌పై అసంతృప్తి ఉన్నా.. దాన్ని బయటకు కనిపించకుండా.. పైకి మాత్రం చినబాబుపై ఎంతో విశ్వాసం ఉన్నట్లు చంద్రబాబు ప్రవర్తిస్తుంటారు. లోకేష్‌ను స్థిరపడేలా చేసేందుకు చంద్రబాబు తన శాయశక్తులా కష్టపడుతున్నారు. చినబాబుకు తనపై తనకు నమ్మకం కలిగించేలాగ చంద్రబాబు మాట్లాడుతూ ఓ తండ్రిగా కుమారుడు జీవితంపై తన తపన ఏమిటో చూపుతున్నారు. తాజాగా చంద్రబాబు లోకేష్‌ను ఉద్దేశించి అన్న మాటలు.. ఓ తండ్రిగా లోకేష్‌ జీవితంపై బాబు చూపుతున్న శ్రద్ధ, ఆరాటాన్ని తెలుపుతున్నాయి. పర్యటనలకు వెళ్లినప్పుడు నారా లోకేష్‌కు ప్రజలు ఎన్టీఆర్‌కు మాదిరిగా బ్రహ్మరథం పడుతున్నారని చంద్రబాబు అన్నారు. తాతతో పోల్చి అయినా లోకేష్‌లో ఉత్సాహం నింపాలని బాబు ప్రయత్నం చేసినట్లుగా ఉంది. ఏది ఏమైనా.. కుమారుడును రాజకీయ జీవితంలో స్థిరపడేలా చేసేందుకు చంద్రబాబు పడిన కష్టాలు బహుసా ఏ రాజకీయ నాయకుడు పడలేదనే చెప్పవచ్చు. మరి చంద్రబాబు ప్రయత్నాలు ఫలించి… ఆయన తర్వాత చినబాబు టీడీపీని నడిపిస్తారా..? లేదా..? కాలమే తేల్చాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి