iDreamPost

వైఎస్‌ మంచోడు.. నాకు గౌరవం ఇచ్చేవాడు..

వైఎస్‌ మంచోడు.. నాకు గౌరవం ఇచ్చేవాడు..

కాలం ఎంతో గొప్పదన్న విషయం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాటల ద్వారా తెలుస్తోంది. చెడ్డ వాడిగా విమర్శల చేసిన వ్యక్తినే.. మళ్లీ మంచివాడిగా కీర్తిస్తుండడంతో కాలం ఎంత విలువైనదో అర్థమవుతోంది. ఒకప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేసిన చంద్రబాబు నేడు ఆయన్ను పొగుడుతుండడం విశేషం.

రాజకీయ జీవితం ఆరంభంలో కాంగ్రెస్‌లో మిత్రులైన నారా చంద్రబాబునాయుడు, వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆ తర్వాత జరిగి రాజకీయ పరిణామాల్లో రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. ఎన్టీ రామారావు టీడీపీ స్థాపించిన తర్వాత కాంగ్రెస్‌లో ఓడిపోయిన నారా చంద్రబాబు ఆ తర్వాత తన మామ పార్టీలోకి చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు చేతిలోకి రావడం (పూర్వాపరాలు ఇక్కడ అప్రస్తుతం) తెలిసిందే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నేత, ఆ తర్వాత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా, చంద్రబాబు ప్రతిపక్ష నేతగా.. ఢీ అంటే ఢీగా తలపడ్డారు. ఒకరిపై ఒకరు రాజకీయంగా, వ్యక్తిగతంగా తీవ్రమైన విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా 2004లో వైఎస్సార్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు ఆయన్ను టార్గెట్‌ చేస్తూ వ్యక్తిగత, అవినీతి ఆరోపణలు చేశారు.

Read Also: జగన్‌ రద్దు చేస్తే.. చంద్రబాబు పెడతారట..

అయితే కాలం వేగంగా మారింది. చంద్రబాబుకు రాజకీయ ప్రత్యర్ధిగా వైఎస్సార్‌ తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వచ్చారు. రాజకీయంగా వైఎస్‌ జగన్‌ ఉనికి లేకుండా చేసేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదని రాజకీయ విళ్లేషకులు చెబుతుంటారు. అయితే అన్ని రకాల దాడులను తట్టుకున్న వైఎస్‌ జగన్‌ విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు రెండో ముఖ్యమంత్రి అయ్యారు. వైఎస్‌తో తలపడిన చంద్రబాబు.. తన జీవితంలో వైఎస్సార్‌ తనయుడు తనకు రాజకీయ ప్రత్యర్థిగా వస్తాడని ఊహించలేదు. వచ్చినా కొరగానికొయ్యలా తయారవుతాడని భావించలేదు. కానీ కాల మహిమ.. తండ్రి, కొడుకులతో తలపడే పరిస్థితి చంద్రబాబుకు తెచ్చింది.

అసెంబ్లీలోనూ, బయట వైఎస్‌ జగన్‌ లక్ష్యంగా చంద్రబాబు ఆరోపణలు, విమర్శలు చేసినా.. జగన్‌ ఎంత వరకు మాట్లాడాలో అంతే మాట్లాడుతున్నారు. చంద్రబాబు ప్రతి ఆరోపణ, విమర్శకు స్పందించడంలేదు. ఇదే చంద్రబాబుకు చిర్రెత్తుకొచ్చేలా చేస్తోంది. వ్యక్తిగతంగా విమర్శలు, ఏకవచనంతో సంబోధనలు చేసినా కూడా జగన్‌ స్పందించకుండా.. తాను అనుకున్నది చేసుకుని పోతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వైఎస్‌ రాజశేఖరరెడ్డిని గుర్తు చేసుకుంటున్నారు. తాను 11 మంది ముఖ్యమంత్రులను చూశానని, కానీ జగన్‌ లాంటి సీఎంను తన జీవితంలో చూడలేదంటున్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి టైంలో కూడా ఇలాంటి పరిస్థితులు లేవని వైఎస్‌ పాలనను కొనియాడుతున్నారు. సభలో తాను మాట్లాడడానికి లేస్తే.. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నా సరే కూర్చునేవాడంటూ.. వైఎస్సార్‌ వ్యక్తిత్వాన్ని కీర్తిస్తున్నారు. రాజశేఖరరెడ్డి ఎంత మాట్లాడితే.. తాను కూడా అంతే సమయం మాట్లాడేలా సభా సాంప్రదాయాలు వైఎస్‌ హాయంలో ఉన్నాయంటూ వైఎస్‌ పాలనను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

ఒకప్పడు వైఎస్సార్‌ను విమర్శించిన చంద్రబాబు చేతనే వైఎస్‌ జగన్‌ తన తండ్రి వైఎస్సార్‌ను మంచోడనిపించాడని రాజకీయ నేతలు, విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతా కాలం మహిమ అంటూ చమత్కరిస్తున్నారు.

Read Also : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి