iDreamPost

చంద్రబాబు రాజకీయాల నుండి తప్పుకో – మాజీ అడ్వైజర్ హనుమంత చౌదరి.

చంద్రబాబు రాజకీయాల నుండి తప్పుకో – మాజీ అడ్వైజర్ హనుమంత చౌదరి.

తెలుగుదేశం పార్టీలో రోజు రోజుకు విభేదాలు ముదిరిపాకాన పడుతునట్టు జరుగుతున్న పరిణామాలు చూస్తే అర్ధం అవుతుంది. 1995లో ఎన్.టి.ఆర్ ను ముఖ్యమంత్రి పీఠం మీదనుండి దింపి ఆ స్థానాన్ని కైవసం చేసుకున్న చంద్రబాబు నాయుడు ఆనాటి నుండి ఎదురులేకుండా ఆ పార్టీ అధ్యక్షుడిగా ఏకచత్రాధిపత్యం వహించారు. అయితే రాష్ట్ర విభజన తరువాత విభజిత ఆంద్రప్రదేశ్ కి తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజు నుండీ ఆయన రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలు ఆ పార్టీ నేతలకే మింగుడుపడటం లేదు.

ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తరువాత రాజకీయ వారసుడిగా ఆయన కుమారుడు లోకేష్ ని పరిచయం చేసే క్రమంలో ఆయన పాటించిన విధానం తో నాడు సొంత పార్టీలోనే అనేక మంది నొచ్చుకున్నా, అధినేతకు ఎదురు చెప్పలేక కొంతమంది మౌనం పాటించగా , మరి కొంతమంది రాజకీయాల్లో లోకేష్ తనని తాను నాయకుడిగా నిరూపించుకునేందుకు అధినేత అవకాశం కల్పించారని సర్ధిచెప్పుకున్నారు , అయితే లోకేష్ వారి అంచనాలకు చేరుకోకపోగా, పార్టీని పూర్తిగా నాశనం చేసే దిశగా నిర్ణయాలు తీసుకున్నారు. మాటలు తూలుతూ విపరీతంగా నవ్వులపాలయ్యారు. మంగళగిరి స్థానంలో తాను ఓడిపోవడమే కాకుండా పార్టీకి జాతీయ కార్యదర్శిగా ఉండి మునుపెన్నడు చవి చూడని ఓటమిని అందించారు.

ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత తెలుగుదేశం పార్టీలో నివురు గప్పిన నిప్పులా ఉన్న అసహనం ఒక్కసారిగా బద్దలైనట్టు కనిపిస్తుంది. లోకేష్ పోకడ నచ్చని వారు ఒకొక్కరుగా బయటికి రావడం ప్రారంభించారు. ఆ పార్టీ నుండి గెలిచిన శాసన సభ్యులు వల్లభనేని వంశీ లోకేష్ చేస్తున్న అనైతిక చర్యలను బయటపెట్టగా , అదే పార్టీ కి చెందిన మరో శాసన సభ్యుడు మద్దాలి గిరి లోకేష్ సమర్ధత మీద పార్టీలోనే నమ్మకాలు తక్కువ అనే విషయాన్ని బహిరంగంగా చెప్పారు. అయితే ఇప్పుడు తాజాగా చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు చంద్రబాబుకి 1998 నుండి ఐ.టి అడ్వైజర్ గా పని చేస్తున్న త్రిపురనేని హనుమాన్ చౌదరి కూడా అదే విషయాన్ని లేఖ ద్వారా వెళ్ళబుచ్చారు.

త్రిపురనేని హనుమాన్ చౌదరి, తెలుగుదేశం పార్టీలో మరీ ముఖ్యంగా చెప్పాలంటే చంద్రబాబు సామ్రాజ్యంలో పరిచయం అక్కరలేని పేరు, చంద్ర బాబు అధికారంలో ఉన్నన్ని రోజులు సమైక్య ఆంద్ర ప్రదేశ్ కు ఐటి అడ్వైజర్ గా చంద్ర బాబు కు సలహాదారుడు చేసిన వ్యక్తి,, చంద్ర బాబుకు ఇన్నేళ్లు సలహాదారుడిగా వున్న హనుమాన్ చౌదరి, చంద్ర బాబుకు రాసిన నాలుగు పేజీల లేఖతో అటు చంద్ర బాబుకు ఇటు టిడిపి శ్రేణులకు పెద్ద షాక్ నే ఇచ్చారు అని చెప్పాలి. ఓటమి నుండి ఇంకా తేరుకొని టిడిపి శ్రేణులకు త్రిపురనేని హనుమాన్ చౌదరి చంద్ర బాబుకు రాసిన ఉత్తరంతో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అయింది.

త్రిపురనేని హనుమాన్ చౌదరి చంద్ర బాబుకు రాసిన లేఖ సారాంశం.

2014 నుండి 2019 వరకు మీరు ముఖ్యమంత్రి గా చేసిన కాలంలో మీరు మీపని మీద కన్నా ఇతర విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టారని. గుడివాడలో అక్రమంగా ఆక్రమించిన స్థలం దగ్గర నుండి మతాల మధ్యన కానుకల పేరుతో ఇస్తున్న చంద్రన్న కానుకల వరకు మీ పాలనలో మీరు చేస్తున్న తప్పులను జరుగుతున్న అన్యాయాల గురించి ఆనాడే 30 కి పైగా ఉత్తరాలు రాశానని. దుష్టుడైన దుర్యోధనుడి మీద ధృతరాష్ట్రుడికి ప్రేమ ఉన్నట్టు, నీ కొడుకు మీద నీకున్న ప్రేమతో ఏ అర్హత లేకపోయినా కేవలం నీ కొడుకు కాబట్టి ఎమ్మెల్సీ పేరుతో పెద్దల సభకు పంపారని, సీనియర్ నాయకులను పక్కన పెట్టి ఏ అర్హత ఉందని మీ కొడుకును వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు రాష్ట్ర ప్రతినిధిగా పంపారని సూటిగా ప్రశ్నించారు.

అంతే కాకుండా 2016 లో జరిగిన పుష్కరాల సమయంలో విజయవాడను ముస్తాబు చేస్తూ విజయవాడలో దాదాపు 20 పురాతన దేవాలయాలను కూల్చారు కానీ ఎన్నో దుబారా ఖర్చులు చేసిన మీరు తిరిగి ఆ 20 పురాతన దేవాలయాలని నిర్మించే ప్రయత్నం చేయలేకపోయారని ,మోడీకి వ్యతిరేకం అని ప్రజలను నమ్మించడానికి మీరు ఆఖరికి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు అనే విషయం కూడా పక్కన పెట్టి రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారని. ఈ నిర్ణయం తీసుకునే ముందు కనీసం పార్టీలో ఎవరితోనైనా సంప్రదింపులు జరిపారా అని ప్రశ్నించారు .

రాజధాని విషయంలో శివరామ కృష్ణన్ కమిటీ రిపోర్ట్ ను పట్టించుకోకుండా సొంత పోకడలకు వెళ్లి విదేశీ కన్సల్టెంట్స్ పేరుతో విదేశీ కాంట్రాక్టర్ల పేరుతో వేల ఎకరాల వ్యవసాయ భూమిని రైతుల నుండి తీసుకొని వారు తీవ్రంగా నష్టపొయ్యేలా చేశారని. మిమ్మలని మళ్ళీ బిజెపికి మరి ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీకి దగ్గర చెయ్యాలని నేను ఢిల్లీకి వెళ్లి చేసిన ప్రయత్నాలు కూడా కేవలం గతంలో మీరు తీసుకున్న అనైతిక నిర్ణయాల వలనే బెడిసి కొట్టాయని, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మీ అవకాశవాద రాజకీయాల గురించి పూర్తి అవగాహన ఉందని. మీరు మీ స్వలాభం కోసం, అవసరాల కోసం ఎప్పుడు ఎవరితో అయినా పోత్తు పెట్టుకుంటారనే స్పష్టత వారిలో ఉందని. మీకు “నేను నా కొడుకు” అనే అజెండా తప్ప ఇంకో అజెండా లేదు అనే విషయం ఢిల్లీ నేతలకు బాగా తెలిసివచ్చిందని. ఈ రోజు వరకు మీరు టీఆర్ ఎస్, బిజెపి , కాంగ్రెస్ , కమ్యూనిస్ట్ ఇలా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోవడమే కారణం అని చెప్పుకొచ్చారు .

అంతే కాకుండా మీ రాజకీయాలను దగ్గర నుండి చూసిన వ్యక్తిగా నేను వాటిని విశ్లేషిస్తే, మీ రాజకీయాలే ఈ రోజు కమ్మ కులానికి తలవంపులు తీసుకొచ్చాయి అని అర్థం అవుతుందని తీవ్రంగా స్పందిచారు. ఇప్పుడు పార్టీ ఉన్న పరిస్థితుల్లో నేను మీకు ఇచ్చే సలహా ఒక్కటే, రాజకీయాల నుండి తప్పుకోండి . ఆంధ్రా లో తెలుగుదేశం పార్టీని ఆంధ్రా నాయకులకే వదిలేసి మీరు తప్పుకోండని చంద్రబాబుకు లేఖ ద్వారా కాస్త ఘాటుగానే నిరసన తెలిపారు హనుమంత చౌదరి.

ఏది ఏమైనా 38ఏళ్ళ పాటు రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నో ఒడిదుడుకులు ఏదుర్కున్న తెలుగుదేశం నేడు అత్యంత దయనీయ స్థితిలో ఉంది. ఆ పార్టీలో ప్రస్థుతం చంద్రబాబు వయస్సు రిత్యా , గత ప్రవర్తన రిత్యా నాయకత్వ లోపం స్పష్టం గా కనిపిస్తుంది. వారసుడు గా తెరమీదకు వచ్చిన లోకేష్ అటు పార్టీ నాయకులతో పాటు , దిగువ శ్రేణి కార్యకర్తలకు కూడా భవిష్యత్తు పై నమ్మకం కలిగించడంలో పూర్తిగా విఫలం అయ్యారు. దీంతో పార్టీలో అంతర్గతంగా రోజు రోజుకు తీవ్ర విభేదాలుతో ఆ పార్టీ సతమతమౌతోందనే వాదన ఉంది. ఈ క్రమం లో బాబుకు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన హనుమాన్ చౌదరి రాసిన లేఖతో ఆ వార్త మరింత బలపడింది.. దీనిపై తెలుగుదేశం వర్గాలనుండి ఎటువంటి స్పందన వస్తుందో వేచి చూడాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి