iDreamPost

ఐదేళ్ళు ఆగలేరా బాబుగారూ!

ఐదేళ్ళు ఆగలేరా బాబుగారూ!

ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అత్యధిక మెజారిటీతో అధికారం కట్టబెట్టి యేడాది పూర్తయింది. శాసనసభలో ఆధిక్యంలో ఉన్న పార్టీ ఐదేళ్ళ పాటు అధికారంలో ఉంటుంది. ఈ ఐదేళ్ళు ఎలా పరిపాలన చేస్తారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎలాంటి పాలన అందిస్తారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఈ పాలన, ఈ నిర్ణయాలు వారికి నచ్చితే అధికారం మరోసారి కట్టబెడతారు. నచ్చకపోతే ఓడించి మరో పార్టీకి పట్టం కడతారు.

రాజధాని విభజన ప్రజలకు నచ్చకపోతే 2024 ఎన్నికల్లో వాళ్ళే తీర్పు చెపుతారు. మంచి జరిగినా, చెడు జరిగినా అది పూర్తిగా 2024 వరకూ అధికారంలో ఉండే పార్టీకే చెందుతుంది. ప్రతిపక్ష పార్టీ పాత్ర అధికార పార్టీ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వరకే కానీ అడ్డుకోవడానికి కాదు. ప్రభుత్వం ఏం చేయాలో నిర్ణయించేది ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్న శాసనసభ కానీ పరోక్ష ఎన్నికలో వచ్చిన శాసన మండలి కాదు. ఈ విషయం చంద్రబాబు అర్ధం చేసుకోవడం మంచిది.

వ్యవస్థలను తనకు, తన రాజకీయాలకు అనుకూలంగా వాడుకుంటే ప్రజలు అంగీకరించరు. చరిత్రలో వ్యవస్థలను వాడుకున్న రాజకీయ నాయకుడిగా శాశ్వత ముద్ర వేసుకోవడం తప్ప చంద్రబాబుకు మిగిలేది ఏమీ ఉండదు.

అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి చేసేవి అన్నీ అప్రజాస్వామ్యకం, ప్రజా వ్యతిరేక విధానాలే అని ప్రతిపక్ష పార్టీగా టిడిపి, ప్రతిపక్ష నేతగా చంద్రబాబు భావిస్తే వారు చేయగలిగింది ప్రజల్లోకి వెళ్ళడం 2024 ఎన్నికల్లో ప్రజాభిప్రాయాన్ని తనకు, తన పార్టీకి అనుకూలంగా మలుచుకోవడం. ఈ విషయం మర్చిపోయి కోర్టుల ద్వారానో, శాసన మండలి ద్వారానో, ఒకరిద్దరు తనకు అనుకూలంగా ఉండే అధికారుల ద్వారానో ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని చంద్రబాబు చేస్తున్న ప్రతి ప్రయత్నం 2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలుపు అవకాశాలను తగ్గించేందుకే ఉపయోగపడతాయి.

వాస్తవానికి 2019 ఎన్నికల్లోనే జగన్ గెలిస్తే అమరావతి ఉండదు అనే ప్రచారం చంద్రబాబు విస్తృతంగా చేశారు. అయినా అమరావతి పరిధిలోని తాడికొండ, మంగళగిరి శాసనసభా స్థానాల్లో జగన్ అభ్యర్థులే గెలిచారు. మంగళగిరిలో సాక్షాత్తూ చంద్రబాబు కొడుకు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలనే ఆశతో ఉన్న లోకేష్ ఓడిపోయారు. ఈ వాస్తవాలను కూడా విస్మరించి అమరావతిపై రాజకీయం చేయడం సరైన వ్యూహం కాదు.

ఒక్కో వ్యవస్థను ఒక్కో విధంగా తన రాజకీయ అవసరాలకు అనుగుణంగా చంద్రబాబు వాడుకోవడం చూస్తుంటే ఎప్పుడో నరేంద్ర మోడీ చెప్పినట్టు చంద్రబాబులో పరిపక్వత లోపించింది అనుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలను మించిన వ్యవస్థ ఏముంటుంది? కోర్టు తీర్పులు, శాసనమండలి నిర్ణయాలు ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయలేవనే వాస్తవాన్ని నాలుగుదశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు మర్చిపోవడం పరిణతి లేని రాజకీయమే అవుతుంది.

శాసన మండలి ద్వారా ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని, ప్రభుత్వ నిర్ణయాలను తిప్పికొట్టడం అనే ప్రతి ప్రయత్నం చంద్రబాబుకు వ్యతిరేకంగానే పనిచేస్తుంది. ఈ వాస్తవాన్ని చంద్రబాబు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. ప్రభుత్వం వైఫల్యం చెందిందని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటుందని చంద్రబాబు భావిస్తే 2024లో ప్రజాక్షేత్రంలో తేల్చుకునే ప్రయత్నం చేయాలి తప్ప శాసన మండలిలో కాదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి