iDreamPost

బ‌య‌ట బాబు.. లోప‌ల చిన‌బాబు.. లక్ష్యం ఒకటే..!

బ‌య‌ట బాబు.. లోప‌ల చిన‌బాబు.. లక్ష్యం ఒకటే..!

ఏపీ తెలుగుదేశం పార్టీ ఎజెండాలో ఒక అంశం మాత్రం కామ‌న్ గా క‌నిపిస్తోంది. అదే ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌డం. ఘ‌ట‌న ఏదైనా అది హాట్ టాపిక్ అవుతుందనుకుంటే.. స‌త్యాస‌త్యాలు ప‌రిశీలించ‌కుండా నేత‌లంద‌రూ ఒకే బాట ఎంచుకుంటున్నారు. ప్ర‌ధానంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు, కార్య‌ద‌ర్శులుగా ఉన్న తండ్రీకొడుకులు చంద్ర‌బాబు, లోకేష్ బాబు మాత్రం ఆ విష‌యంలో రెండాకులు ఎక్కువే చ‌దివిన‌ట్లు క‌నిపిస్తున్నారు.

ప్ర‌స్తుతం ఏపీలో అసెంబ్లీ స‌మావేశాలు కొన‌సాగుతున్నాయి. చంద్ర‌బాబు స‌మావేశాల‌కు వెళ్లేదిలేద‌ని భీష్మించుకున్నారు. కానీ.. లోప‌లా, బ‌య‌టా ఒకే అంశంపై మాత్రం విమ‌ర్శ‌లు చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకున్న మ‌ర‌ణాల ఘటనే ఇందుకు తాజా ఉదాహ‌ర‌ణ‌. ఈ ఘ‌ట‌న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. నాటు సారా వల్లనే జంగారెడ్డిగూడెం వరుస మరణాలు చోటు చేసుకున్నాయన్నారు. అంతేకాకుండా సహజ మరణాలు అంటూ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని, అసెంబ్లీలో అసత్య ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ ను ప్రజలు డిస్మిస్ చేయాలన్నారు. మృతుల విష‌యంలో కూడా బాబు ఎన్నిక‌ల హామీల‌ను గుప్పించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల రూపాయల వంతున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన ఆయ‌న‌.. టీడీపీ అధికారంలోకి వచ్చిన త‌ర్వాత 25 లక్షల నష్టపరిహారం ఇస్తామని ప్ర‌క‌టించారు.

అసెంబ్లీ బ‌య‌ట ప‌రిస్థితి ఇలా ఉండ‌గా.. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొన‌సాగుతోంది. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ మాట్లాడుతూ.. కల్తీసారా మరణాలపై శాసనమండలిలో ప్రభుత్వం చర్చకు రాకుండా పారిపోయిందంటూ ఆయన విమర్శించారు. శవరాజకీయాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని ఆయన ఆరోపించారు. ఇంత‌టితో ఆగ‌కుండా వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌ర‌ణం అంశాన్ని కూడా లేవ‌నెత్తారు. జగ్గారెడ్డిగూడెంలో చోటు చేసుకున్న మరణాలపై ఉన్నతస్థాయిలో దర్యాప్తు చేపట్టాలన్నారు.

జ‌గ‌న్ కౌంట‌ర్

కాగా, టీడీపీ నేత‌ల ప్ర‌క‌ట‌న‌ల‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు. సాధారణ మరణాలపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ చేస్తోన్న అసత్య ప్రచారంపై ఆయన అసెంబ్లీలో స్పందిస్తూ.. నేచురల్‌ డెత్స్‌పై టీడీపీ రాజకీయం చేస్తోందన్నారు. సహజ మరణాలను కూడా వక్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు. కల్తీ మద్యం మరణాలు గతంలోనే అనేకసార్లు జరిగాయి. కల్తీ మద్యాన్ని తమ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తోందని.. రాష్ట్రంలో బెల్ట్‌ షాపులను సమూలంగా నిర్మూలించామన్నారు. ‘‘లాభాపేక్షతో గత ప్రభుత్వం మద్యం అమ్మకాలు జరిపింది. బడి, గుడి సమీపంలో కూడా యథేచ్ఛగా మద్యం అమ్మారు.’’ అని సీఎం ధ్వజమెత్తారు. సహజ మరణాలు దేశవ్యాప్తంగా జరుగుతుంటాయి. దేశంలో ఎక్కడైనా 90 శాతం సహజ మరణాలే ఉంటాయి. అన్ని మరణాలు ఒకే చోట జరిగినవి కాదు. సాధారణ మరణాలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని’’ సీఎం మండిపడ్డారు. తమ హయాంలో 43 వేల బెల్టు షాపులను ఎత్తివేశాం. మద్యపానం నియంత్రించాలన్నదే తమ లక్ష్యమని సీఎం అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి