iDreamPost

వైఎస్సార్‌… చంద్రబాబు… ఓ సామెత

వైఎస్సార్‌… చంద్రబాబు… ఓ సామెత

ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా, అధికారంలోకి వచ్చినప్పుడైనా.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి.. తన రాజకీయ ప్రత్యర్థి నారా చంద్రబాబునాయుడుని తనదైన సామెతలతో ఉక్కిరిబిక్కిరి చేసేవారు. చంద్రబాబుపై అసెంబ్లీలో వైఎస్సార్‌ పేల్చిన ఓ సామెత నేటికి ఆయన అభిమానులు, రాజకీయ విశ్లేషకులు గుర్తు చేసుకుంటుంటారు. ‘‘ అమ్మకు అన్నం పెట్టని వాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడంట’’ అంటూ చంద్రబాబు తీరును ఎండగట్టేవారు.

ఇప్పుడు చంద్రబాబు కూడా తన చిరకాల మిత్రుడైన వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనపై ఉపయోగించిన సామెతను ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. అయితే వైఎస్సార్‌ పలికినట్లే తాను పలికితే.. అప్పట్లో వైఎస్సార్‌ తనపై వేసిన సెటైర్లు ప్రజలకు గుర్తుకు వస్తానుకున్నారేమో గానీ ఆ సామెతలో పదాలను మార్చి నిన్న కుప్పంలో పర్యటనలో చంద్రబాబు ప్రయోగించారు. మూడు రాజధానులపై సీఎం జగన్‌ తీరును విమర్శించేందుకు.. ‘‘ కట్టుకున్నదానికి చీర కొనివ్వలేడు గానీ చిన్నమ్మకు ఉంగరం కొనిస్తాడట’’ అంటూ వైఎస్సార్‌ను అనుకరించాలని చూశారు. అయితే ఆ సామెతను మార్చి ప్రయోగించడంతో.. అసలు అర్థం రాలేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

మూడు రాజధానులు వద్దు.. ఒకే రాజధాని కావాలంటూ.. టీడీపీ డిమాండ్‌ చేస్తోంది. దాదాపు రెండు నెలలుగా అమరావతి చుట్టు పక్కల ఉద్యమాలు చేసిన చంద్రబాబు.. ఇక ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలనే లక్ష్యంతో ప్రజా చైతన్య యాత్ర చేపట్టారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ.. వారిని చైతన్యవంతులను చేసేందుకంటూ.. చంద్రబాబు ఈ ప్రజా చైతన్య యాత్ర చేస్తున్నారు. అయితే యాత్ర ముఖ్య ఉద్దేశం మాత్రం రాజధాని అమరావతి ప్రచారమేనని చంద్రబాబు యాత్రను పరిశీలిస్తే అర్థమవుతోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రోడ్‌ షోలలో ప్రసంగిస్తున్న చంద్రబాబు.. చివరలో.. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని అనే నినాదాలు చేయిస్తుండడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి