iDreamPost

పలకరింతలు.. పరామర్శల.. రాజకీయం

పలకరింతలు.. పరామర్శల.. రాజకీయం

ఒకప్పుడు నాయకుల్ని ఆకట్టుకునేందుకు చేపల పులుసు పంపించేవారట. ఉభయగోదావరి జిల్లాల నాయకులు తమ అధిష్టానం మెప్పు పొందేందుకు ఇప్పటిక్కూడా పులస చేపలు వండి పంపిస్తూ ఉంటారు. ఏం చేసినా పై వారి నుంచి గుర్తింపు కోసమే అనడంలో ఎటువంటి సందేహం లేదిందులో. అయితే ఎప్పుడూ ఇటువంటి పనులు చేసేవారిని గురించి ఎవ్వరు పెద్దగా ఆక్షేపించరు. పైగా ఆయన కాబట్టి పులస చేపలు వండి ప్రతియేటా పంపిస్తున్నారు.. అంటూ గొప్పగానే చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఏదో ప్రతిఫలం ఆశించి చేసేవారిని చూస్తే మాత్రం విమర్శకులకు చేతినిండా పనిదొరికినట్టే.

బీజేపీకి దూరమయ్యాక తీవ్రమైన విరహబాధలో ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ పార్టీ నేతలతో పలకరింతలు, పరామర్శల రాజకీయానికి తెరలేపారట. బీజేపీలో కీలకమైన నాయకులకు ఏదో విధంగా టచ్‌లో ఉండేందుకు శతవిధాలా ప్రయత్నాలు ముమ్మరంగా చేపడుతున్నారంటున్నారు. పుట్టిరోజులకు శుభాకాంక్షలు చెప్పడం, ఏదైనా అనారోగ్యమప్పుడు ఫోన్‌చేసి పరామర్శించడం ఇత్యాధి కార్యక్రమాలను ప్రత్యేక అజెండాగా పెట్టుకుని అమలు చేస్తున్నారని రాజకీయవర్గాల నుంచి విన్పిస్తున్న టాక్‌.

ఏం చేసినా ముక్తికోసమే.. అంటూ సన్యాసులు చెప్పినట్టే తానేం చేసినా బీజేపీతో స్నేహం కోసమే అన్నరీతిలో చంద్రన్న వ్యవహారశైలి ఉంటోందట. పని కల్పించికుని మరీ బీజేపీ నాయకుల కోసం ప్రాకులాడడం చూస్తుంటే అబ్బో ఎంత కష్టపడుతున్నారో? అంటూ సొంత పార్టీ నాయకులే బుగ్గలు నొక్కుకుంటున్నారని వినికిడి.

2019 ఎన్నికల్లో తనకుతానుగా వేసుకున్న అంచనాలు ఘోరంగా చంద్రబాబును దెబ్బతీసాయి. తన అనుభవంపైనున్న నమ్మకంతో ఏకంగా మోడీతోనే ఢీకొట్టేసారు. ఏపీలో బీజేపీ నోటాతోనే పోటీపడినప్పటికీ వాళ్ళ మద్దతు ఉంటే గెలిచి ఉండేవాడినన్న అపోహ చంద్రబాబను ఇంకా వీడిపోవడం లేదంటున్నారు పరిశీలకులు.

తనను తాను నమ్ముకోకుండా ‘ఇవాళ మంగళవారం.. లేకపోతేనా..’’ అన్న రీతిలో వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. అప్పుడేమో తూలనాడుకుని, ఇప్పుడేమో వెంపర్లాడడం ఎందుకు అని ప్రత్యర్ధులు విమర్శిస్తున్నప్పటికీ చంద్రబాబు వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదంటున్నారు. పట్టువదలని విక్రమార్కుడికి లేటెస్టు రోల్‌మోడల్‌ తానే అయినట్టు ఎవరు అవునన్నా, కాదన్నా బీజేపీ నాయకులకు తానే టచ్‌లో ఉంటానంటూ.. పలకరింతలు, పరామర్శలు కొనసాగిస్తుండడం ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్‌ టాపిక్‌ అయికూర్చుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి