iDreamPost

రంగంలోకి చంద్రబాబు… తమ్ముళ్లు హ్యాపీ

రంగంలోకి చంద్రబాబు… తమ్ముళ్లు హ్యాపీ

దాదాపు 75 రోజులు తెలుగుదేశం పార్టీ అదినేత నారా చంద్రబాబు నాయుడు రాజకీయమంతా రాజధాని అమరావతి చుట్టూనే సాగింది. ఎక్కడకు వెళ్లినా, ఏమి చేసినా అమరావతి ప్రస్తావన తప్పని సరి. ఇప్పుడు ఆయన తన మనస్సును మరో అంశంపై లగ్నం చేశారు. అదే స్థానిక సంస్థల ఎన్నికలు. నిన్న రాష్ట్ర హైకోర్టు రిజర్వేషన్లపై తీర్పును వెలువరించిన వెంటనే చంద్రబాబు రంగంలోకి దిగారు. అందుబాటులో ఉన్న నేతలతో సమావేమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు.

అమరావతి రాజధానిపై ఫోకస్‌ పెట్టి స్థానిక సంస్థలను పూర్తిగా పక్కనపెట్టేస్తారని నిన్న మొన్నటి వరకు తెలుగు తమ్ముళ్లు హైరానా పడ్డారు. ఓ వైపు జగన్‌ సర్కార్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ నామమాత్రంగానే ఉంటుందని తమ్ముళ్లు కూడా ఓ అంచనాకు వచ్చారు. వార్‌ వన్‌సైడేనని భావన వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లోనూ ఉంది.

కనీసం పోటీ లేనిదే వచ్చే విజయంలో కిక్కు ఉండదన్నట్లుగా.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు కూడా అంతో ఇంతో తమకు పోటీ ఉండాలని కోరుకుంటున్నారు. తమ్ముళ్లు కూడా నిన్నటి వరకు పార్టీ అధినేత దృష్టి సారించకపోవడంతో ఓకింత ఢీలా పడ్డారు. కానీ చంద్రబాబు రంగంలోకి దిగడంతో తమ్ముళ్లు కూడా స్థానిక పోరుకు సిద్ధమవుతున్నారు.

నవ మోసాలు అంటూ.. జగన్‌ సర్కార్‌ పాలన, సంక్షేమ పథకాలపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందంటూ చెప్పుకొస్తున్నారు. మళ్లీ తామే అధికారంలోకి వస్తామని ఇటీవల ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని చెప్పిన చంద్రబాబు.. కనీసం కొంత మేరకైనా స్థానిక సంస్థల్లో సీట్లు గెలుచుకోకపోతే తాను చెప్పిందంతా అబద్ధమని రుజువవుతుందని చంద్రబాబు భావిస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకే శక్తి మేరకు పోటీనిచ్చి వీలైనంత మేరకు సీట్లు గెలుచుకుని సత్తా చాటాలని ప్రణాళికలు రచిస్తున్నారు. సాధారణ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభావానికి కొంత మేరకైనా ఉపసమనం పొందేందుకు తెలుగుదేశం అధినేత కృషి చేస్తారనడంలో సందేహం లేదని విశ్లేషకులు వ్యాఖ్యనిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి