iDreamPost

పంచాయతీలకు కేంద్రం నిధులొచ్చేశాయ్‌..!

పంచాయతీలకు కేంద్రం నిధులొచ్చేశాయ్‌..!

స్థానిక సంస్థలకు ఆర్థిక సంఘం నిధులు.. ఈ అంశం ఏపీలో మూడు నెలలుగా నానుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత వాయిదా అనంతరం రాజకీయం అన్నీ కూడా ఆర్థిక సంఘం నిధులుపైనే నడిచాయి. దాదాపు 5800 కోట్ల రూపాయల ఆర్థిక సంఘం నిధులు కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు రావాల్సి ఉంది. ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో వస్తాయో..? రావో..? అన్న ఆందోళన అటు ప్రభుత్వం ఇటు ప్రజల్లోనూ నెలకొంది. మీడియాలో ఈ అంశం కేంద్రంగా వార్తలు, కథనాలు, చర్చలు సాగాయి. అయితే అందరి అందోళనలు, అనుమానాలను పటాపంచలు చేసేలా ఆర్థిక సంఘం నిధులు స్థానిక సంస్థలకు వచ్చాయి.

కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి తొలి విడతగా 870.23 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. 2018 ఆగస్టులో పంచాయతీల పాలక మండళ్ల గడువు ముగిసినా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడంతో 2018–19, 2019–20 ఆర్థిక ఏడాదులకు సంబంధించిన ఒక్క పంచాయతీలకే 3,710 కోట్ల రూపాయల నిధులు పెండింగ్‌లో పడ్డాయి. ఈ నెలాఖరులోపు ఎన్నికలు నిర్వహించకపోతే ఆ నిధులు మురిగిపోతాయనే ఆందోళనతో రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాలపై ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించింది. అయితే కరోనా వైరస్‌ కారణంగా ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వాయిదా వేసింది.

ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఆ విషయాన్ని రాష్ట్ర అధికారులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. పరిస్థితి వివరించడంతో మొదటి విడతగా 87.023 కోట్లు విడుదల చేశారు. మిగతా నిధులు కూడా విడతల వారీగా విడుదల కానున్నాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల రాకపై ఏర్పడ్డ ఆందోళన తప్పిందని చెప్పవచ్చు. నిధులు రాకుండా ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను ఉపయోగించుకుని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్నికలను వాయిదా వేయించారన్న విమర్శలు కూడా వారిద్దరికీ తప్పుతాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి