iDreamPost

కేంద్రంలో మొదలైన కదలిక

కేంద్రంలో మొదలైన కదలిక

నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళన కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కార్పోరేట్ సంస్థల ఆధిపత్యానికి వ్యతిరేకంగా చారిత్రాత్మక పోరాటానికి తెరతీసిన రైతాంగానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. రైతు ఉద్యమానికి రాజకీయ పార్టీల సంఘీభావం తోడడవడంతో కేంద్రం మెట్టుదిగక తప్పేలా లేదు. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇప్పటికే రైతు సంఘాలతో జరగాల్సిన ఆరో దఫా చర్చలు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో రాతపూర్వక ప్రతిపాధనలతో రైతుల ముందుకు వచ్చింది కేంద్రం.

పక్షం రోజులుగా దేశ రాజధానిలో రైతులు చేస్తున్న ఆందోళన ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతులు పట్టుబడుతుండగా, ప్రభుత్వం మాత్రం సవరణలను ప్రతిపాదిస్తోంది. రైతులు, ప్రభుత్వం మధ్య జరగాల్సిన ఆరో దఫా చర్చల ఎజెండాను నిర్ణయించేందుకు రైతు సంఘాలతో సమావేశమైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోయారు. దీంతో ప్రభుత్వం రైతు సంఘాలకు రాతపూర్వక ప్రతిపాదనలు పంపించింది.

ప్రభుత్వ మార్కెట్లను బలోపేతం చేసేలా సవరణ చేస్తామని కేంద్రం స్పష్టం ప్రతిపాదనల్లో పేర్కొంది. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీలపై రైతుల అభిప్రాయాలకు అనుగుణమైన మార్పులకు కేంద్రం సిద్ధమైంది. ప్రైవేటు సంస్థలతో పాటు ప్రభుత్వం కూడా పంట సేకరణ చేసేలా నిబంధనల్ని మార్పుస్తామని ప్రకటించింది. కాంట్రాక్ట్ వ్యవసాయంలో వివాదాలు వస్తే కోర్టులను ఆశ్రయించే వీలుకల్పిస్తామని పేర్కొంది. అలాగే రైతుల భూములకు రక్షణ హామీ కల్పిస్తామంది. కనీస మద్దతు ధర పట్లకూడా సానుకూలంగా స్పందించింది. కాగా… వ్యవసాయ చట్టాల రద్దుకు సంబంధించిన ప్రతిపాదనల్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని రైతు సంఘాల నేతలు అంటున్నారు.

సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించడం లేదని, రైతులతో మాట్లాడడం కేంద్రానికి ఇష్టం లేదని రైతులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రతిపాదనలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామంటున్న రైతు సంఘాలు ఈ రోజు ప్రభుత్వంతో చర్చలు జరిగే అవకాశం లేదని స్పష్టం చేశాయి. మొదటి నుంచీ నూతన వ్యవసాయ చట్టాలను కార్పోరేట్ అనుకూల చట్టాలుగా అభివర్ణిస్తున్న రైతు సంఘాలు… ఇప్పుడు కేంద్రం ప్రతిపాధనలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. చట్టాల్లోని పలు వివాదాస్పద అంశాల పట్ల సానుకూలంగా స్పందించినప్పటికీ కాంట్రాక్ట్ ఫార్మింగ్ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. కాంట్రాక్ట్ ఫార్మింగ్ ను వ్యవసాయ రంగానికి పొంచిఉన్న ప్రమాదంగా భావిస్తున్న రైతులు కేంద్ర ప్రతిపాధనలను అంగీకరించే అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి. మరోవైపు… రోజుల తరబడి ఆందోళన కొనసాగించడంలో ఎదురయ్యే సమస్యలను ప్రభుత్వం అనుకూలంగా మార్చుకునేందుకు యత్నిస్తోందనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి