iDreamPost

చంద్రబాబు ‘నాడు-నేడు’

చంద్రబాబు ‘నాడు-నేడు’

ఆ మధ్య సూపర్ డూపర్ హిట్ అయినా చంద్రముఖి సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో హీరోయిన్ పాత్రధారి సందర్భానుసారం ఒకసారి గంగ గాను మరోసారి చంద్రముఖిగాను మారిపోతుంటుంది. చంద్రముఖి పాత్రలో ఉన్నపుడు చేసిన పనులు, చెప్పిన మాటలు గంగగా ఉన్నపుడు గుర్తుండవు. అది సినిమా కాబట్టి ప్రేక్షకులు హీరోయిన్ పాత్రను బాగా ఎంజాయ్ చేశారు. కానీ ఇపుడు నిజజీవితంలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు చేష్టలు కూడా జనాలకు చంద్రముఖి పాత్రనే గుర్తుచేస్తోంది.

చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా వ్యవహరించే తీరు ఒకలాగుంటుంది. అదే ప్రతిపక్షంలోకి వస్తే మాత్రం వైఖరి మారిపోతుంటుంది. సిఎంగా ఉన్నంత కాలం రాచరికాన్నే తలపిస్తుంది ఆయన పాలన, మాటతీరు. అదే ప్రతిపక్షంలో కూర్చోవాల్సొచ్చినపుడు మాత్రం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే అవతరించినట్లుగా మాట్లాడేస్తుంటాడు. బిసిల స్ధితిగతులను అధ్యయనం చేయటానికి తానే నియమించిన జస్టిస్ మంజూనాధ కమీషన్ ఛైర్మన్ మంజూనాధను ఎలా అవమానించాడో మరచిపోయినట్లున్నాడు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ గా ఐవైఆర్ కృష్ణారావును ఎలా తొలగించాడో మరచిపోయి ఇపుడు ఎలక్షన్ కమిషన్ కాలపరిమితిని తగ్గిస్తూ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్సు మీద యాగీ చేస్తున్నాడు. కేంద్రం కూడా ఈ మధ్యనే ఎలక్షన్ కమిషన్ కాలపరిమితిని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించిన విషయాన్ని మర్చిపోయినట్లున్నాడు.

మొన్నకూడా తమ ఎంఎల్ఏ నిమ్మల రామానాయుడు ఫోన్ చేస్తే కలెక్టర్ ఫోన్ తీయలేదని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశాడు. తమ ఎంఎల్ఏ ఫోన్ చేస్తేనే కలెక్టర్ ఫోన్ తీయలేదని ఫిర్యాదు చేసిన చంద్రబాబు తన హయంలో ఏమి చేశాడో మరచిపోయినట్లున్నాడు. అప్పట్లో వైసిపి పాణ్యం ఎంఎల్ఏ గౌరు చరితారెడ్డి ప్రతిపక్షం ఎంఎల్ఏ కాబట్టి ఆమె అడిగిన అభివృద్ధి పనులను తాను మంజూరు చేయలేదన్నాడు. పైగా ఆ విషయాన్ని ఏదో ఘనకార్యంగా కర్నూలులోనే జరిగిన నిండు సభలో ప్రకటించాడు.

అలాగే ఎంఎల్ఏలకు ఇచ్చే నియోజకవర్గ అభివృద్ధి నిధులను వైసిపి ఎంఎల్ఏల నియోజకవర్గాలకు నిలిపేశాడు. ప్రతిపక్ష ఎంఎల్ఏలున్న నియోజకవర్గాల్లో ఓడిపోయిన టిడిపి నేతల పేర్లతోనే మంజూరు చేశాడు. ఇదేమి అన్యాయమని వైసిపి ఎంఎల్ఏలు అడిగితే తాను ఇలాగే చేస్తానని గొప్పగా చెప్పుకున్నాడు. పైగా ఒత్తిళ్ళు పెట్టి, ప్రలోభాలకు గురిచేసి 23 మంది ఎంఎల్ఏలను లాక్కున్న విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి చంద్రబాబు కూడా ఇపుడు రాజ్యంగం గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడంటే జనాలకు చంద్రముఖి సినిమాలో చంద్రముఖి క్యారెక్టర్ గుర్తుకు రావటంలో తప్పేలేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి