iDreamPost

మోదీ కటాక్షానికేనా చంద్రన్న వ్రతం…?

మోదీ కటాక్షానికేనా చంద్రన్న వ్రతం…?

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు కఠోర వ్రతం చేస్తున్నారు. కాకపోతే ఈ వ్రతంలో పూజా పునస్కారాలు, ఉపవాసాలు, దీక్షలు వంటి క్రతువులేవీ ఉండవు. కేవలం పొగడ్తలు, భజనలే ఉంటాయి. ఇంతకీ చంద్రబాబు ఈ వినూత్న వ్రతం ఎవరి కటాక్షం కోసం చేస్తున్నారా అని అనుకుంటున్నారా… ఇంకెవరండీ ప్రధాని నరేంద్రమోదీ, ఆయన పార్టీ బీజేపీతో చెలిమి కోసమే…!

ట్రాక్ రికార్డ్ అమోఘం

చంద్రబాబునాయుడుకి రాజకీయ వ్యూహ రచనలో చక్కటి ట్రాక్ రికార్డ్ ఉంది. మనుషులను, వ్యవస్థలను మ్యానేజ్ చేయడంలో బాబు గారిది అందెవేసిన చేయి..! సామ దాన దండోపాయాలతో ప్రత్యర్థులనేకాక సొంత పార్టీ వారిని సైతం తన దారిలోకి తెచ్చుకోగలగటం చంద్రబాబు ప్రత్యేకత. కానీ, తాడిని తన్నే వాడుంటే వాని తలదన్నే వాడుంటాడు అనే సామెతను బాబు గారి రాజకీయ జీవితంలో నిజం చేసిన వ్యక్తి  కచ్చితంగా నరేంద్రమోదీయే అని చెప్పక తప్పదు.

మోదీ ‘ఢీ’యే…

గుజరాత్ లో జరిగిన గోద్రా ఊచకోత ఘటన చంద్రబాబు, నరేంద్రమోదీ సంబంధాల్లో కీలకంగా నిలుస్తుంది. గోద్రా సంఘటనను బూచిగా చూపి మైనారిటీ ఓట్లు దండుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రయిన  మోదీని నామా మాటలు అనేశారు. కానీ, అనూహ్యంగా 2014 నాటికి ఎన్డీయే ప్రధాన మంత్రి అభ్యర్థిగా మోదీ ముందుకొచ్చారు. దాంతో అయిష్టంగానే ఆయనతో కలిసి నడవాల్సిన పరిస్థితి చంద్రబాబుకు తలెత్తింది. నరేంద్రమోదీ సైతం లౌఖ్యంగా ఎన్నికల ప్రచారంలో చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. దీంతో మోదీ గతాన్ని మరచి తనకు గుర్తింపు ఇస్తున్నారని  సంబరపడిపోవడం చంద్రబాబు వంతైంది. 

మోదీ మార్క్ స్ట్రోక్….

ఎన్నికల్లో గెలిచి ప్రధాని పీఠంపై స్థిరపడిన తర్వాత మోదీ తనదయిన శైలిలో చంద్రబాబుకి సహాయ నిరాకరణ చేయసాగారు. అయినప్పటికీ నాలుగేళ్లు మోదీని కీర్తించిన బాబు…బీజేపీతో ఎన్నికలకు వెళ్తే రాజకీయంగా దెబ్బతింటామని భావించి మోదీపై యుద్ధం ప్రకటించారు. గురువుకు పంగనామాలు పెట్టిన వ్యక్తి…భార్యను పట్టించుకోని వ్యక్తి అంటూ నరేంద్రమోదీపై విరుచుకుపడ్డారు. మోదీని ఎలాగైనా ఓడించాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ, మమతాబెనర్జీ, కేజ్రీవాల్ తదితరులను కలుపుకొని కాళ్లరిగేలా తిరిగి ప్రచారం చేశారు. కానీ, అనూహ్యంగా ఎన్నికల్లో బాబు గారి సైకిల్ పంక్చర్ అవ్వడం అందరికీ తెలిసిందే.

మోదీ మళ్ళీ చెలిమి చేద్దామా….

రాష్ట్రంలో వైఎస్ జగన్ సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్నారు. దీంతో పార్టీకి పూర్వ వైభవం ఎలా తీసుకురావాలో చంద్రబాబుకి ఓ పట్టాన అర్థంకావట్లేదు. దీంతో ఆయన చూపు మళ్ళీ బీజేపీపై పడింది. ఈ నేపథ్యంలో ఎప్పుడెప్పుడు ఆ పార్టీకి స్నేహహస్తం ఇద్దామా అని ఎదురుచూస్తున్న చంద్రబాబుకు కరోనా ఓ అవకాశం కల్పించింది. ప్రధానితో ఫోన్లో మాట్లాడే అవకాశం దక్కడంతో చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో మోదీని..ఆయన నాయకత్వ పటిమను వేనోళ్ళ కీర్తిస్తున్నారు. మోదీ వల్లే దేశంలో కరోనా కంట్రోల్ అయ్యిందంటూ డప్పు కొడుతున్నారు. అదే ఊపులో మోదీని చూసి నేర్చుకోవాలంటూ జగన్ కు ఉచిత సలహా కూడా ఇచ్చేశారు. కాగా, ఇక్కడ కోసమెరుపేమంటే భజనలో మునిగిన చంద్రబాబుకు… ఏపీకి కూడా నరేంద్రమోదీయే ప్రధాని అనే విషయం గుర్తులేకపోవటమే…!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి