iDreamPost

చంద్రబాబును వదలని అమరావతి-సుప్రీంకోర్టులో కేసు

చంద్రబాబును వదలని అమరావతి-సుప్రీంకోర్టులో కేసు

“కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందట” అని చెప్తుంటారు పెద్దలు.. ఈ విషయం తాజా ఘటనతో మరోసారి రుజువైంది. ఇప్పుడున్న రాజధాని అమరావతినుండి మార్చొద్దని టీడీపీ వితండవాదోద్యమం చేస్తున్న తరుణంలో సుప్రీంకోర్ట్ ఇచ్చిన ఝలక్ తో అసలు ఉద్యమ నినాదమే తప్పు అనే సంకేతాలు వెలువడుతున్నాయి. మూడు రాజధానులతో అభివృద్ధిని వికేంద్రీకరించాలని జగన్ సర్కార్ ముందుకెళ్తుంటే టీడీపీ శ్రేణులు జగన్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ అమరావతిలో ఆందోళనలు చేస్తున్నారు. కొందరైతే ఏకంగా న్యాయస్థానాల్ని సైతం ఆశ్రయించారు. అమరావతి నుండి రాజధాని తరలింపును అడ్డుకుంటామని దీనికోసం ఎంతవరకైనా పోరాడుతామని చెప్తున్నారు.

అయితే ఇదే విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కానీ ప్రస్తుత రాజధానికి సంబంధించిన అంశాలపై కాదు.. ఎప్పుడో నాలుగేళ్లక్రితం చంద్రబాబు అమరావతిని రాజధానిగా చేసినపుడు జరిగిన అవకతవకలపై ఇప్పుడు డొంక కదిలింది. ఈ వ్యవహారం కూడా దాదాపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ఐటీని అభివృద్ధి చేసానని చెప్పుకుంటూ తన సామాజికవర్గానికి చెందినవారి భూములను అభివృద్ధి చేసిన ఘటనను పోలి ఉంటుంది. అయితే అసలు విషయానికి వస్తే గతంలో రాజధాని విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దాన్ని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారణకు కూడా స్వీకరించింది.. 2014లో రాష్ట్ర విభజన జరిగినన తర్వాతి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఎక్కడ పెట్టాలనే విషయంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నిబంధనలను తుంగలో తొక్కి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారన్నది ఈ పిటిషన్ సారాంశం.

ఏపీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అనిల్ కుమార్ బోరుగడ్డ ఈ పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. అలాగే పలు కీలక అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. చంద్రబాబు గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను, రాజధాని ఏర్పాటుపై నియమించిన శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టి తన సొంతలాభం కోసం రాజధానిని విజయవాడ, గుంటూరుకు రాజధానిని తరలించారని ఆరోపించారు. అనిల్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ రోహింగ్టన్ నారిమాన్, జస్టిస్ రవీంద్ర భట్ విచారణకు స్వీకరించారు. పిటిషనర్ తరపు న్యాయవాది ప్రజెంటేషన్ విన్న సుప్రీం న్యాయమూర్తులు ఈఅంశంపై రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాలని సూచిస్తూ హైకోర్టుకు కేసును డైరెక్టు చేశారు.

అయితే ఇప్పుడు ఉన్నచోట రాజధానిని మార్చొద్దని ధర్నాలు చేయిస్తున్న చంద్రబాబుకు అసలు మీరు గతంలో రాజధాని విషయంలో తీసుకున్న నిర్ణయమే సరైంది కాదనే వాదన తెరపైకి రావడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే ఈ దెబ్బతో అమరావతి ప్రాంతంలో నిర్వహిస్తున్న ఉద్యమాల విషయంలో టీడీపీ వెనక్కి తగ్గుతుందో లేక ఇదే అస్త్రంగా చేసుకుని ఏపీ ప్రభుత్వం రాజధాని విషయంలో మరింత వేగవంతమైన నిర్ణయాలతో ముందకెళ్తుందో చూద్దాం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి