iDreamPost

థియేటర్లకు అంతేసి జనం రాగలరా

థియేటర్లకు అంతేసి జనం రాగలరా

నిన్న సినీ పరిశ్రమ నుంచి కొందరు ప్రతినిధులు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలిసి పలు సమస్యల మీద చర్చించారు. లాక్ డౌన్ టైంలో కరెంట్ బిల్లుల మాఫీతో మొదలుపెట్టి సింగల్ స్క్రీన్లలో రోజుకు అయిదు షోలు ప్రదర్శించుకునే వెసులుబాటుతో సహా పలు విన్నపాలు చేశారు. సానుకూల స్పందన వచ్చింది కానీ అధికారిక ఉత్తర్వులు రావడానికి ఇంకా సమయం పట్టొచ్చు. అయితే ఇక్కడే కొన్ని సందేహాలు కలుగుతున్నాయి. అసలు అయిదు షోలు వేస్తే జనం వచ్చే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా అని. ఇది ఎవరికి లాభసాటినో ఆలోచిస్తే కొన్ని ప్రశ్నలకు సులువుగా సమాధానం దొరుకుతుంది.

ఒకప్పుడు అంటే రెండు దశాబ్దాల క్రితం వరకు పబ్లిక్ కి సినిమాకు సంబంధించి థియేటర్ ఒక్కటే మేజర్ ఎంటర్ టైన్మెంట్. ఈ కారణం వల్లే శతదినోత్సవాలు, రీ రిలీజుల్లోనూ భారీ కలెక్షన్లు సాధ్యమయ్యేవి. దానవీరశూరకర్ణ, దేవదాసు, అల్లూరి సీతారామరాజు లాంటి బ్లాక్ బస్టర్లు పది సంవత్సరాల తర్వాత కూడా హౌస్ ఫుల్ బోర్డులు కళ్లజూసేవి. కానీ ఇప్పుడలా లేదు. యుట్యూబ్, ఓటిటి, డిజిటల్ అంటూ పలురకాల ఆప్షన్లు వచ్చాక వినోదానికి ప్రత్యాన్మయాలు పెరిగిపోయాయి. వెండితెరకు బుల్లితెరకు మధ్య గ్యాప్ తగ్గిపోయింది. చాలా బాగుందంటే టాక్ వస్తే తప్ప ఫ్యామిలీస్ థియేటర్ కు రావడం లేదు.

ఈ నేపథ్యంలో ఈ అయిదు ఆటల ఫార్ములా కేవలం పెద్ద సినిమాలకు మాత్రమే అనుకూలంగా మారుతుందని చెప్పడంలో ఎలాంటి సంశయం అక్కర్లేదు. కరోనా రాకముందే చిన్న చిత్రాలకు రోజు నాలుగు ఆటల పద్దతిలోనే వీక్ డేస్ కలెక్షన్లు అంతంత మాత్రంగా వచ్చేవి. ఇప్పుడేమవుతుందో చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోలు అయిదు కాదు పది షోలు వేసి తెల్లవారుఝామున మొదలుపెట్టినా అభిమానులు వస్తారు. కానీ అందరికీ కాదుగా. లేదా అయిదు షోల పర్మిషన్ వచ్చాక ఒకే థియేటర్లో రెండేసి ఆటలకు వేర్వేరు సినిమాలు వేసినా కలిగే ప్రయోజనం తక్కువే. చూద్దాం అసలు ఇంతకీ ఇది అమలులోకి వస్తుందో లేదో

Also Read : కబడ్డీతో ప్రేమకథ పోటీ ?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి