iDreamPost

ప్రతిదీ వ్యతిరేకించేదాన్నే ప్రతిపక్షమంటారా ?

ప్రతిదీ వ్యతిరేకించేదాన్నే ప్రతిపక్షమంటారా ?

ఆంధప్రదేశ్ లో ప్రతిపక్షాల వ్యవహారం చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. నిజానికి ఎక్కడైనా ప్రజల గొంతుకే ప్రతిపక్షాలుగా భావిస్తుంటారు. ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించటమే ప్రతిపక్షాలు పనిగా పెట్టుకుంటాయి. కానీ ఏపిలో మాత్రం ప్రజలకు మంచి చేయాలనే అధికారపార్టీ ప్రయత్నాలను కూడా ప్రతిపక్షాలు అడ్డుకోవటమే విచిత్రంగా ఉంది. చివరకు రాష్ట్రంలో పరిస్ధితి ఎలాగైపోయిందంటే అధికారపార్టీ, మెజారిటి ప్రజలు ఒకవైపుంటే ప్రతిపక్షాలు మాత్రం మరోవైపుండిపోయాయి.

ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలను వ్యతిరేకించటమే పనిగా పెట్టుకున్నాయి ప్రతిపక్షాలు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందాలన్న ధ్యేయంతో వాలంటీర్ల వ్యవస్ధను ఏర్పాటు చేశాడు. ప్రతి 50 ఇళ్ళకు ఓ వాలంటీర్ ను కేటాయించి వాళ్ళ అవసరాలు ప్రభుత్వం దృష్టికి తేవటమే కాకుండా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమఫలాలు వాళ్ళకు అందుతున్నది లేనిది చూడటమే వాళ్ళ బాధ్యత. కానీ ఈ వ్యవస్ధను కూడా ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఇపుడు కరోనా వైరస్ నేపధ్యంలో వాలంటీర్ల వ్యవస్ధ పనితీరును చాలా రాష్ట్రాలు అభినందిస్తున్నాయి.

మధ్య, దిగువమధ్య తరగతితో పాటు పేదల ప్రజల పిల్లలు ఇంగ్లీషులో మీడియంలో చదువుకుంటే భవిష్యత్ బాగుంటుందని ప్రభుత్వం భావించింది. అందుకే రానున్న విద్యాసంవత్సరం నుండి 1-6 తరగతుల మధ్య ఇంగ్లీషుమీడియంను ప్రవేశపెట్టాలని అనుకున్నది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు కోర్టుకెళ్ళిన విషయం అందరూ చూసిందే. ప్రతిపక్షాలు మరచిపోతున్నదేమంటే తాము జగన్ ను దెబ్బ కొట్టామని అనుకుంటున్నాయే కానీ లక్షలాది మంది పేదల భవిష్యత్తును అడ్డుకుంటున్న విషయాన్ని మరచిపోయాయి.

కరోనా వైరస్ సంక్షోభంలో కూడా ప్రతిపక్షాలు నానా యాగీ చేస్తున్నాయి. పరీక్షల నిర్ధారణ కోసం ధక్షిణకొరియా నుండి ర్యాపిడ్ టెస్ట్ కిట్లు కొనుగోలు చేస్తే ఎంత గోల చేశాయో అందరూ చూసిందే. ప్రతిపక్షాల మనస్తత్వం ఎలాగుందంటే జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని అడ్డుకోవటం కుదరకపోతే నానా రచ్చ చేయటమే టార్గెట్ గా పెట్టుకున్నాయి. ఆమధ్య తలెత్తిన ఇసుక సరఫరా విషయమే తీసుకుందాం. మహారాష్ట్ర, కర్నాటకలో వరదలు, భారీ వర్షాల కారణంగా ఇసుక సరఫరా సాధ్యం కాలేదు. వరదలు, భారీ వర్షాలు ఉన్నంత వరకూ ఇసుక తవ్వకం, సరఫరా సాధ్యం కాదన్న విషయం అందరికీ తెలుసు. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఎంత గోల చేశాయో.

అధికారంలోకి వచ్చిన పదిమాసాల్లోనే చంద్రబాబు పెండింగ్ లో పెట్టిన బిల్లులు చెల్లిస్తున్నాడు. చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నాడు. దీనికే ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో చాలా భాగం ఖర్చయిపోతోంది. ఇటువంటి పరిస్ధితుల్లో కూడా తాను హామీలిచ్చిన పథకాలను అమలుకు శ్రీకారం మొదలుపెట్టాడు. కరోనా వైరస్ సమస్య లేకపోతే పథకాల అమలు ఊపందుకునేదే.

ప్రస్తుతం వైరస్ నియంత్రణకు ప్రభుత్వం నానా అవస్తలు పడుతోంది. బాధితులు, జనాలేమో వైరస్ నియంత్రణకు ప్రభుత్వం బాగా పనిచేస్తోందని అంటుంటే ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా మాత్రం వ్యతిరేకంగా రెచ్చిపోతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ప్రతిపక్షాలంటే ప్రతిదీ వ్యతిరేకించటమేనా ? అని జనాలు అనుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి