iDreamPost

అర్ధంలేకుండా పోయిన పవన్ కళ్యాణ్ ,బీజేపీల పొత్తు

అర్ధంలేకుండా పోయిన పవన్ కళ్యాణ్ ,బీజేపీల పొత్తు

రాజ‌కీయాల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌రిస్థితి ఎప్పుడూ అంతే. స్వ‌యంగా ప‌వ‌న్ ప్ర‌చారం త‌ర్వాత మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల్లో గ‌ట్టెక్కిన చంద్ర‌బాబు 2014 త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చి కూర‌లో క‌రివేపాకులా వ్య‌వ‌హ‌రించార‌ని జ‌న‌సేన శ్రేణులే వాపోయిన చ‌రిత్ర ఉంది. ఇక కేంద్రంలో బీజేపీ పెద్ద‌ల‌యితే ప‌వ‌న్ కి ఏవిధ‌మైన ప్రాధాన్య‌త ఇవ్వ‌లేదు. చివ‌ర‌కు ప్ర‌ధాని మోడీ అపాయింట్ మెంట్ కూడా ద‌క్క‌లేదు. మోహ‌న్ బాబు కుటుంబ కూడా ప్ర‌ధాని తో ప‌లు స‌మావేశాలు జ‌ర‌ప‌గా, ప‌వ‌న్ కి మాత్రం అలాంటి భాగ్యం నేటికీ ద‌క్క‌లేదు. ఇక తాజాగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న‌ప్ప‌టికీ మోడీ కాదు క‌దా అమిత్ షా ద‌ర్శ‌నం కూడా ఆయ‌న‌కు ద‌క్క‌లేదు. అయిన‌ప్ప‌టికీ జేపీ న‌డ్డా వంటి వారితో స‌రిపెట్టుకుందామ‌నుకుంటున్న‌ప్ప‌టికీ రాజ‌కీయ ప‌రిణామాలు జ‌న‌సేనానికి ఏమాత్రం రుచించేలా క‌నిపించ‌డం లేదు.

బీజేపీ మా మిత్ర‌ప‌క్షం అంటూ జ‌న‌సేన చెప్పుకుంటోంది. కానీ బీజేపీ పెద్ద‌లు మాత్రం వైసీపీతో రాజ‌కీయ వ్య‌వ‌హారాలు న‌డుపుతున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. దాంతో ప‌వ‌న్ అభాసుపాల‌య్యేలా ప‌రిణామాలున్నాయి. తాజాగా రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల ఎంపిక‌లో జ‌గ‌న్ ప్ర‌క‌టించిన అభ్య‌ర్థుల్లో ప‌రిమ‌ల్ ధీర‌జ్ లాల్ నెత్వానీ విష‌య‌మే దానికో ఉదాహ‌ర‌ణ‌గా ఉంది. ఏపీలో స్థానిక ఎన్నిక‌ల్లో బీజేపీ, జ‌న‌సేన క‌లిసి పోటీ చేస్తామ‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న ద‌శ‌లోనే నేరుగా కేంద్రంలో బీజేపీ పెద్ద‌లు న‌డిపిన మంత్రాంగం ప‌నిచేసింది. కేంద్రంలో నెంబ‌ర్ టూ గా ఉన్న అమిత్ షా రాయ‌బారంతో ఏకంగా ముకేష్ అంబానీ స్వ‌యంగా సీఎంతో భేటీ అయ్యారు. రెండు గంట‌ల పాటు తాడేప‌ల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ లో జ‌రిగిన స‌మావేశం త‌ర్వాత రిల‌యెన్స్ ఇండ‌స్ట్రీలో కీల‌క భాగ‌స్వామి నెత్వానీకి ఏపీ నుంచి రాజ్య‌సభ బెర్త్ ఖ‌రార‌య్యింది. గ‌తంలో బీజేపీ ప్ర‌త్య‌క్ష మ‌ద్ధ‌తుతో జార్ఖండ్ నుంచి రాజ్య‌స‌భ‌లో అడుగుపెట్టిన ఈ రిల‌య‌న్స్ ప్ర‌తినిధికి ఈసారి బీజేపీ ప‌రోక్ష మ‌ద్ధ‌తు కార‌ణంగా మూడోసారి పార్ల‌మెంట్ లో ప్ర‌వేవించే అవ‌కాశం జ‌గ‌న్ రూపంలో ల‌భించింది.

ఈ ప‌రిస్థితి జ‌న‌సేనానికి మింగుడుప‌డే అవ‌కాశం లేదు. బీజేపీ పెద్ద‌లు నోటితో న‌వ్వుతూ నొస‌టితో వెక్కిరిస్తున్న చందంగా వ్య‌వ‌హ‌రించ‌డం కొర‌కుడుప‌డ‌ని విష‌యంగా మారుతోంది. కేవ‌లం కేంద్రంలోని బీజేపీ నేత‌లే అనుకుంటే ఏపీకి చెందిన కీల‌క నేత‌లు కూడా జ‌గ‌న్ స‌ర్కారుకి అన్ని విధాలా అండ‌దండ‌లు అందిస్తున్నారు. ఈ విష‌యంలో జీవీఎల్ వంటి వారి తీరుతో సుస్ఫ‌ష్టం. సోము వీర్రాజు వంటి వారు నేటికీ చంద్ర‌బాబు మీద గురిపెట్టినంత ఘాటుగా జ‌గ‌న్ మీద విమ‌ర్శ‌లు చేయ‌డానికి సాహ‌సించక‌పోవ‌డం గ‌మ‌నిస్తే మ‌రింత క్లారిటీ వ‌స్తుంది. పైగా సుజ‌నా, క‌న్నా వంటి వారి కామెంట్స్ ని కూడా జీవీఎల్ స్వ‌యంగా ఖండించే ప‌రిస్థితి ఏర్ప‌డ‌డం గ‌మ‌నిస్తే బీజేపీ అధిష్టానం నుంచి జ‌గ‌న్ కి సంపూర్ణ ఆశీస్సులున్న‌ట్టు సంకేతాలు ఇస్తోంది.

ఏపీలో జ‌గ‌న్ ని నిలువ‌రించ‌డానికే బీజేపీతో చేతులు క‌లుపుతున్న‌ట్టు ప‌వ‌న్ త‌న స‌న్నిహితుల‌కు చెప్పుకున్నారు. కానీ తీరా చూస్తే అనుభ‌వం క‌నిపిస్తుండడంతో మ‌రోసారి ప‌వ‌న్ పొలిటిక‌ల్ జోక‌ర్ గా మిగిలిపోయే ప్ర‌మాదం దాపురిస్తోంది. ప్ర‌భావం చూప‌కపోగా ఇలా ప్ర‌జ‌ల్లో కూడా ప‌లుచ‌న‌య్యే ప‌రిస్థితి ప‌వ‌న్ ఎదుర్కొంటున్న‌రు. రాజ‌కీయంగా జ‌న‌సేన‌కు ఇది గ‌డ్డుస్థితిగానే చెప్ప‌వ‌చ్చు. ఆపార్టీ సార‌ధి రాజ‌కీయ భ‌విత‌వ్య‌మే మ‌రింత అభాసుపాల‌య్యే ప‌రిణామం క‌నిపిస్తోంది. వైఎస్సార్సీపీ, బీజేపీ మ‌ధ్య స‌న్నిహిత సంబంధాలు కొన‌సాగుతున్న ద‌శ‌లో ప‌వ‌న్ ఏవిధ‌మైన ప్ర‌భావం చూప‌లేని స్థితికి చేరుతున్నారు. ఇది రాజ‌కీయంగా తాను తీసుకున్న గోతిలో తానే ప‌డ్డ‌ట్టుగా క‌నిపిస్తోంది. అదే స‌మ‌యంలో టీడీపీ కి ఆశాభంగం త‌ప్పేలా లేదు. కొంద‌రు టీడీపీ ఎంపీలు బీజేపీ లో చేర‌డం ద్వారా అక్క‌డ కూడా చ‌క్రం తిప్పాల‌ని ఆశిస్తే సీన్ సంపూర్ణంగా మారిపోయింది. అంతేగాకుండా జ‌గ‌న్ కేసులంటూ త‌న పార్టీ శ్రేణుల‌ను నిల‌బెట్ట‌కోవాల‌ని చేస్తున్న ప్ర‌య‌త్నాలు కూడా ఫ‌లించే అవ‌కాశాలు ద‌రిదాపుల్లో లేవు. ఈ ప‌రిస్థితి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని రాజ‌కీయంగా అభాసుపాలుజేస్తుంటే, చంద్ర‌బాబుని అయోమ‌యంలోకి నెట్టేస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి