iDreamPost

ఇదేమిటి సోము… అడిగి మరీ జిందాబాద్‌లా?

ఇదేమిటి సోము… అడిగి మరీ జిందాబాద్‌లా?

రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు… అయితే ఆ చేతులు మనస్ఫూర్తిగా కలుస్తున్నాయా? లేదా బలవంతంగా కలుస్తున్నాయా? అనేదానిపైనే ఆ చప్పట్లకు సార్థకత ఉంటుంది. జైజై నినాదాలు… హర్షధ్వానాలు కూడా అంతే. ప్రజల మనస్సులలో నుంచి స్వచ్ఛందంగా రావాలే తప్ప బలవంతంగా చేయించుకున్నా పెద్దగా స్పందన ఉండదు. రాజకీయ సభలు.. సమావేశాలు అనగానే చప్పట్లు… జైజై నినాదాలు.. హర్షధ్వానాలు సర్వసాధారణం. చాలా సభల్లో పాల్గొనేవారు తప్పదన్నట్టుగా, మొక్కుబడిగా చేస్తారు. నిర్వాహకులు అడిగి మరీ కొట్టించుకుంటారు. కాని కొన్ని సందర్భాలలో మాత్రం ప్రజలు మనస్ఫూర్తిగా చప్పట్లు చరచడం… జైజై నినాదాలు చేయడం చేస్తుంటారు. అప్పుడు సభా ప్రాంగణమే మార్మోగిపోతుంది. ఇలా నాణానికి రెండువైపులా కనిపించే ఘటన తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరులో చోటు చేసుకుంది.

ఇందుకూరులో పోలవరం పునరావాస కాలనీలో నిర్వాసితులతో మాట్లాడేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌లు శుక్రవారం తూర్పున పర్యటించారు. నిర్వాసితులకు పోలవరం ప్యాకేజీ అమలు చేయడాన్ని వారు పరిశీలించారు. అనంతరం వారు అక్కడ నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలో కొంతమంది నిర్వాసితులు తమకు కలుగజేసిన సదుపాయాల గురించి కేంద్రమంత్రి, ముఖ్యమంత్రులకు వివరించారు. ఈ సందర్భంగా మడకం పోసమ్మ అనే మహిళ మాట్లాడుతూ ‘‘కేంద్రం డబ్బులు ఇస్తే… జగనన్న మాకు అన్నీ చేస్తారు. మేము ఏదో ఒక ఉపాధి కల్పించుకుని సంతోషంగా ఉంటాము’’ అని అన్నప్పుడు సభలో హర్షధ్వానాలు చోటు చేసుకున్నాయి. సభికులు జై జగన్‌ అనే నినాదాలతో హోరెత్తించారు. ఈ సమయంలో అక్కడే ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మైకు అందుకుని ఒకసారి నరేంద్ర మోడీ గారికి కూడా జిందాబాద్‌ అనండి అంటూ కోరారు. ఈ సమయంలో సభలో పెద్దగా స్పందన కనిపించలేదు.

సోము వీర్రాజు వ్యవహరించిన తీరుచూసి సభికులు కొందరు విస్తుపోయారు. అడిగి మరీ జైజైలు కొట్టించుకోవడం ఏమిటి? సోము… మీకు ఎందుకంత ఆరాటం? అని ప్రశ్నిస్తున్నారు. మంచి చేస్తే ప్రజలు స్వచ్ఛందంగానే నినాదాలు చేస్తారు. చప్పట్లు కొడతారు. కాని ఇలా బలవంతం చేయడం ఏమిటని విస్తుపోయారు. పొద్దస్తమానూ.. కేంద్రం అది చేసింది… ఇది చేసింది అని చెప్పడం తప్ప… కేంద్రం నుంచి సోము… అతని పార్టీ నాయకులు రాష్ట్రానికి సాధించుకువచ్చింది ఏమైనా ఉందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. నిజంగా కేంద్రం రాష్ట్రానికి చేసింది ఏమైనా ఉంటే ప్రజలే స్వచ్ఛందంగా జైజై నినాదాలు చేసేవారు. ఇటీవల విజయవాడలో జరిగిన పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమాలలో కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్‌ రామ్‌ గడ్కారి పాల్గొన్నారు. ఇక్కడ జరిగిన సభలో గడ్కారీ మాట్లాడుతూ రాష్ట్రంలో చేపట్టబోయే జాతీయ రహదారుల గురించి చెబుతున్న పలు సందర్భాలలో ప్రజలు హర్షద్వానాలు చేశారు. అంతే తప్ప సోము వీర్రాజులా అడిగితే ప్రజలు జైజైలు పలకలేదు.

ఇటీవల కాలంలో సోము వీర్రాజు వ్యవహారశైలి బీజేపీకి లాభం కన్నా నష్టం ఎక్కువ చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్‌ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన నాటి నుంచి పలు సందర్భాలలో ఆయన ప్రకటలు, చేష్టలు పార్టీకి చేటు కలిగిస్తున్నాయని క్యాడరే వాపోతోంది. అయినా సోము మాత్రం తగ్గేదేలే అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి