iDreamPost

ఈసారి కూడా దర్శన భాగ్యం దక్కని పవన్ కళ్యాణ్

ఈసారి కూడా దర్శన భాగ్యం దక్కని పవన్ కళ్యాణ్

బీజేపీ వాళ్లు మమ్మల్ని బానిసలుగా చూస్తున్నారు..మేము వాళ్లకు దాసోహమయ్యే ప్రసక్తి లేదు. ఈ మాటలన్నది జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 2019 ఎన్నికలకు ముందు జనసేనాని ఇలాంటి వ్యాఖ్యలు పలు బహిరంగ సభల్లో చేశారు. కానీ తీరా ఫలితాలు చూసిన తర్వాత మళ్లీ అదే బీజేపీ దగ్గరకి పరుగెత్తారు. బీజేపీతో కలిసి పనిచేస్తామంటూ మిత్రపక్షంగా మారిపోయారు. ఆతర్వాత తాజాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసైనికుల ఆశలు నీరుగార్చారు. తొలుత నామినేషన్లు వేయండి అని చెప్పి ఆ తర్వాత బేషరతుగా బీజేపీకి మద్ధతిస్తున్నట్టు ప్రకటించేశారు. సింగిల్ సీటు కూడా లేకుండా సున్నాకే పరిమితమయ్యారు. పోటీకి ముందే చేతులెత్తేశారు.

ఈ పరిణామాలకు ముందు పవన్ జనవరిలో బీజేపీ అధిష్టానంతో మంతనాల కోసం ఢిల్లీ వెళ్లారు. అక్కడ కూడా ఆయనకు అవమానమే తప్పలేదు. ఆయన చెప్పినట్టు నిజంగానే ఆయన్ని బానిసలా చూస్తున్నారా అనే అభిప్రాయం కలిగించే పరిణామాలు ఎదురయ్యాయి. ఏపీలో కీలకమైన నేతగా, క్రౌడ్ ఫుల్లర్ గా ఉన్న పవన్ కి కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడానికి బీజేపీ కీలక నేతలు ససేమీరా అన్నారు. గతంలో కూడా తనకు పీఎం అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని, ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేసిన తమను పక్కన పెట్టేశారని పవన్ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అయినా పనిగట్టుకుని హస్తిన వెళ్లిన తర్వాత కూడా దర్శన భాగ్యం దక్కలేదు. కేవలం అప్పుడే బీజేపీ సారధిగా బాధ్యతలు స్వీకరించిన జేపీ నడ్డాతో సమావేశమయ్యి వెనుదిరగాల్సి వచ్చింది.

ఇక ప్రస్తుతం జీహెచ్ఎంసీలో సంపూర్ణంగా బీజేపీకి జై కొట్టిన తర్వాత ఢిల్లీ వెళ్లారు. పైగా తిరుపతి ఉప ఎన్నికలకు ముందు పవన్ మద్ధతు కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఈ పర్యటన సాగుతోంది. అలాంటి సమయంలో పవన్ కి అమిత్ షా వంటి కీలక నేతలతో సమావేశానికి అవకాశం దక్కుతుందని అంతా ఆశించారు. జనసేన కూడా అదే రీతిలో బీజేపీ పెద్దలతో భేటీలుంటాయని ప్రకటించింది. కానీ తీరా చూస్తే ఇప్పటి వరకూ మళ్లీ జేపీ నడ్డా మినహా అంతకుమించి పవన్ కి ముందుకెళ్లే మార్గం దక్కడం లేదు. అమిత్ షా, మోడీ ల మొఖం చూసే యోగ్యం కలగడం లేదు. ఇది ఏపీలో జనసేనను బీజేపీ ట్రీట్ చేస్తున్న తీరుకి తార్కాణంగా ఉందని పలువురు ఢిల్లీ వర్గాలు భావిస్తున్నాయి. తాము ఏమి చేసినా వీడి వెళ్లలేడనే ధీమాతో బీజేపీ అధిష్టానం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.

ఇక జేపీ నడ్డా తో సమావేశం తర్వాత అయినా పవన్ కి అమిత్ షా తో సమావేశమయ్యే అవకాశం రాకపోతే అది ఆయనకు మరోసారి అవమానంగా భావించాల్సి ఉంటుందని అంతా భావిస్తున్నారు. జనసేన శ్రేణులకు కూడా ఇది మింగుడుపడడం లేదు. తాము దేవుడిగా కొలిచే నాయకుడిని కనీసం ఖాతరు చేయడం లేదనే అంచనాకు వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ బీజేపీ నేతలు ఏమేరకు పవన్ కి కనికరిస్తారన్నది ఆసక్తికరమే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి