iDreamPost

కమలదళానికి లక్ష్యంగా మారిన ఉండవల్లి

కమలదళానికి లక్ష్యంగా మారిన ఉండవల్లి

ఒకప్పటి కాంగ్రెస్‌ నేత, రాజకీయ మేథావి, రాజమహేంద్రవరం లోక్‌సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్‌ బీజేపీ నేతలకు లక్ష్యంగా మారారు. ప్రత్యక్ష రాజకీయాలను నుంచి తప్పుకున్న ఉండవల్లి అరుణ్‌కుమార్‌.. వివిధ అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతుంటారు. మంచి పనులు చేస్తే అభినందిస్తుంటారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుపై అయన ఎక్కువసార్లు మీడియా సమావేశాలు నిర్వహిస్తుంటారు. ఆ సమయంలోనే రాష్ట్ర, జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతుంటారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సవివరంగా సమాధానాలు చెబుతుంటారు.

ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఉండవల్లి బీజేపీలో చేరికలపై తన అభిప్రాయాన్ని జర్నలిస్టులతో పంచుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో సభ్యుడిగా ఉన్న ఉండవల్లి ఆ తర్వాత ఆ సిద్ధాంతాలను విభేదించి కాంగ్రెస్‌లో చేరారు. ఇందుకు గల కారణాలను ఆయన వివరించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంత కర్త గురు గోల్వాల్కర్‌ రాసిన పాంచజన్యం పుస్తకం చదివిన తర్వాతే.. తాను ఆర్‌ఎస్‌ఎస్‌ ను వీడానని ఆయన చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలు దేశానికి మంచివి కావని కూడా చెప్పారు. బీజేపీలో చేరాలనుకుంటున్న వారు.. ముందు ఆ పుస్తకం చదివిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని సలహా ఇచ్చారు.

ఏపీలో బలపడాలనుకుంటున్న బీజేపీకి తాజాగా ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు ఇబ్బందికర పరిస్థితులను కల్పించాయి. కమలం స్పీడుకు బ్రేకులు పడతాయేమోనని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో కమలదళం ఉండవల్లిపై ఫైర్‌ అవుతోంది. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉండవల్లిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. ‘‘ బీజేపీలో ఎందుకు చేరాలి..? ఎందుకు చేరకూడదు..? చేరే వాళ్లకు తెలుసు. రాజకీయ అస్త్రసన్యాసం చేసిన మీలాంటి వారికి సలహాలు ఎందుకు తీసుకుంటారు. మీ బ్రమ తప్పా. మీరు ఎవరి కోసం మాట్లాడుతున్నారు..? ఏ పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో బతికించాలని తాపత్రాయ పడుతున్నారో, దాని వెనుక ఉన్న రహస్యం రాష్ట్ర ప్రజలకు తెలుసు..’’ అంటూ ఉండవల్లిపై విష్ణువర్థన్‌రెడ్డి విరుసుకుపడ్డారు.

ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి సత్తా చూపించాలని బీజేపీ భావిస్తోంది. కుదిరితే అధికారం లేకపోతే ప్రతిపక్ష స్థానం అయినా దక్కించుకోవాలని పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా పార్టీలోకి వచ్చే వారికి సాదర స్వాగతం పలుకుతోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కాలికి బలపం కట్టుకుని రాష్ట్రమంతా తిరుగుతూ.. పార్టీలోకి చేరాలంటూ తాజా, మాజీ నాయకులను ఆహ్వానిస్తున్నారు. టీడీపీ తాజా, మాజీ నేతలను చేర్చుకోవాలని బీజేపీ లక్ష్యంగా చేసుకుంది. ఆ దిశగా కొన్ని చేరికలు కూడా జరిగాయి. బిహార్‌ శాసన సభ, తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీలో బీజేపీ సాధించిన విజయాలను చూపిస్తూ ఏపీ బీజేపీ నేతలు టీడీపీ నేతలను ఆకర్షిస్తున్నారు. టీడీపీ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్‌పై అంచనాలు ఉన్న వారు.. బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఉండవల్లి లాంటి మేధావి, రాజకీయానుభవం ఉన్న నేత.. బీజేపీలో చేరడంపై చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ ప్రయత్నాలకు గండికొట్టేలా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. అయితే ఉండవల్లి వ్యాఖ్యల ప్రభావం బీజేపీ చేరికలపై ఉంటుందా..? లేదా..? వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి