iDreamPost

బీజేపీ నోట ఆ మాట !

బీజేపీ నోట ఆ మాట !

మత విశ్వాసం వ్యక్తిగతమైనది. కానీ ఇప్పడది రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలక ఆయుధంగా మారింది. ప్రజల విశ్వాసాలను గౌరవించడం ప్రభుత్వాల బాధ్యత. కానీ అధికారంలోకి రావడానికే మతాన్ని మార్గంగా ఎంచుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. మత రాజకీయాల పునాదిపై దేశంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ అదే అస్త్రాన్ని అన్ని రాష్ట్రాల్లోనూ ప్రయోగిస్తోంది. తాజాగా తెలంగాణలో జరిగిన గ్రేటర్ ఎన్నికల్ని మతం చుట్టూ తిప్పి బలం పెంచుకోవడంలో సక్సెస్ అయిన బీజేపీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనూ అలాంటి వైఖరినే అవలంభిస్తోంది. త్వరలో జరగనున్న తిరుపతి ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీ మతం కార్డును ముందేసుకు వస్తోంది.

దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో సత్తాచాటిన బీజేపీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రభావం చూపాలనుకుంటోంది. అందుకోసం తెలంగాణలో వాడిన భాషనే ఆంధ్రప్రదేశ్ లోనూ ప్రయోగిస్తోంది. మెజార్టీ మతానికి తామే ఏకైక ప్రతినిధిగా భావించే బీజేపీ ఇరత రాజకీయ పార్టీలను ఆ మతానికి వ్యతిరేకులుగా చిత్రీకరించడం మొదటి నుంచీ అలవాటు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పై అలాంటి ప్రచారమే చేసింది. ఎంఐఎంతో ఉన్న బంధాన్ని గుర్తుచేస్తూ టీఆర్ ఎస్ జాతి వ్యతిరేకులకు మద్దతిస్తోందంటూ విమర్శలు గుప్పించింది. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో ఏపీలోనూ అలాంటి దూకుడుకు సిద్ధమవుతోంది.

తిరుపతి ఉప ఎన్నికకు ముందు ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు రెండూ మతతత్వ పార్టీలేనని, ఆ రెండిటిపైనా సర్జికల్ స్ట్రైక్స్ చేయాల్సిన అవసరం ఉందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. అందుకోసం… మెజార్టీ మతస్తుల పండుగల పట్ల నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలూ చేశారు. అధికార పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగానే ఈ వైఖరిని అవలంభిస్తోందన్నారు. తిరుపతి ఉపఎన్నికలో వీటికి సమాధానం చెప్పాల్సి ఉంటుందని తేల్చారు. అంటే… ఎన్నికల వేదికను మత రాజకీయాలకు కేంద్రంగా మలుచుకునే ప్రయత్నానికి బీజేపీ ఇప్పుడే తెరతీసింది.

నిజానికి దేశంలో అధికారంలో ప్రతి పార్టీ అధినేత ఏదో ఒక మత విశ్వాసం కలిగి ఉన్నవారే. మత విశ్వాసం కలిగి ఉండడం తప్పుకాదు. కానీ ఆ మత విశ్వాసాన్ని రాజకీయ లబ్ధికోసం వినియోగించుకోవాలనుకోవడం తప్పు. ఈ విషయంలో అందరికంటే ముందుఉండేది భారతీయ జనతా పార్టీయే. ఇందులో ఎవరికీ ఏ సందేహమూ లేదు. ఎందుకంటే మెజార్టీ మతస్తుల ప్రతినిధిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటూ రాజకీయ లబ్ధిని పొందేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఇప్పటికీ బీజేపీ అనుసరిస్తున్న వ్యూహం ఇదే. అందుకోసం ప్రత్యర్థి పార్టీలపై ఎలాంటి నిందలు వేయడానికైనా వెనకాడదు. రాజకీయ పార్టీలు ప్రజల విశ్వాసాన్ని పొందడానికి ప్రజా సంక్షేమం పట్ల తమకున్న నిబద్ధతను చాటుకోవాలే తప్ప, భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయకూడదు. దక్షణాదిపై పట్టుకోసం ప్రయత్నిస్తున్న బీజేపీ ఫక్తు మత రాజకీయాల ప్రాతిపధికన ఓట్లు రాబట్టుకోవాలనుకుంటోంది. అలాంటి బీజేపీ ప్రత్యర్థి పార్టీలనే మతతత్వ పార్టీలుగా అభివర్ణించడం అందరినీ అశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ప్రయత్నం తిరుపతి ఉప ఎన్నికలో ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి మరి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి