iDreamPost

“మహా”లో రాష్ట్రపతి పాలన విధించండి : గవర్నర్‌తో బిజెపి

“మహా”లో రాష్ట్రపతి పాలన విధించండి : గవర్నర్‌తో బిజెపి

రాజకీయ నేతలు ప్రతి అంశాన్ని తమ రాజకీయాలకు వాడుకునడమనేది సర్వసాధారణం అయ్యింది..ఆపదను కూడా ఇప్పుడు దేశంలో రాజకీయ నేతలు వదలటం లేదు. మరి ముఖ్యగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నేతలు వారు అధికారంలో లేని రాష్ట్రాల్లో కరోనా వైరస్ సందర్భంలో కూడా రాజకీయ చర్చకు లేవదీస్తున్నారు. కాంగ్రెస్, సిపిఎం, డిఎంకె, ఎస్పీ, ఎన్సీపి, బిఎస్పీ, టిఎంసి, ఆప్ తదితర పార్టీలు కేంద్ర ప్రభుత్వానికీ, ఆయా పార్టీలు ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రాల్లో స్థానిక ప్రభుత్వాలకు సహకరిస్తున్నాయి. అక్కడక్కడ విధానపరమైన సూచనలు, విమర్శలే చేస్తున్నాయి తప్ప రాజకీయ విమర్శలు చేయటం లేదు. వలస కార్మికులు, కరోనా టెస్టింగ్లు వంటి సమస్యలను మాత్రమే ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నాయి. అయితే బిజెపి మాత్రం అలా చేయటం లేదు. మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, ఏపి, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో స్థానిక అధికార పార్టీలపై రాజకీయ విమర్శలు‌ చేస్తూ…కరోనా సమయంలో రాజకీయాలకు పాల్పడుతుంది.

ఇదే కోవలో మహారాష్ట్రలో బిజెపి సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ రాణే ఏకంగా గవర్నర్‌ ను కలిసి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేయడంలో బిజెపి ఎలా రాజకీయాలకు పాల్పడుతుందో స్పష్టం అవుతుంది.

మహారాష్ట్రలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకి వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడంలో సంకీర్ణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బిజెపి మండిపడుతోంది.

ఈ క్రమంలోనే  ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నేత నారాయణ్ రాణె రాజ్‌భవన్‌కు వెళ్లి  గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీని కలిశారు. రాష్ట్రంలో ఆస్పత్రుల పరిస్థితి దారుణంగా ఉందని.. సైన్యం ఆధ్వర్యంలో వాటిని నిర్వహించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. ప్రజల ప్రాణాలను కాపాడలేనప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు అధికారంలో ఉండాలని నారాయణ్ రాణె అభిప్రాయడ్డారు. బిజెపి ప్రతిపక్ష ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి ప్రచారం చేసే బిజెపి నేతలు…వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మౌనం దాల్చుతున్నారు. కరోనాను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి