iDreamPost

డిజిటల్ వైపు దిగ్గజాల చూపు

డిజిటల్ వైపు దిగ్గజాల చూపు

సౌత్ ప్రేక్షకులకు ఒకప్పుడు వినోద సాధనాలు రెండే. ఒకటి టీవీ రెండు ధియేటర్. ఇప్పుడీ లెక్క మారిపోయింది. చాలా ఆప్షన్స్ వచ్చి చేరాయి. అందులో ప్రధానమైనది స్మార్ట్ టెక్నాలజీ. మొబైల్ ఫోన్ లోనో లేదా ఇంట్లో పెద్ద ఇంచుల టీవీనో ఉంటె చాలు మతి పోయే కంటెంట్ తో స్ట్రీమింగ్ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇప్పటీకే అమెజాన్ ప్రైమ్ దూకుడు మాములుగా లేదు. కొత్త సినిమాలకు నాలుగు నెలల లాక్ పీరియడ్ అని నిర్మాతలు అప్పట్లో ఏదో నిబంధన విధించుకున్నారు కాని అబ్బే తూచ్ అనేసి వ్యవహారం ఇప్పుడు మళ్ళి మొదటికే వచ్చింది.

మహా అయితే 50 రోజులలోపే ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా ఆన్ లైన్ లో వచ్చేస్తోంది. నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, జీ 5 లాంటివి పోటీ ఇస్తున్నప్పటికీ ప్రైమ్ స్ట్రాటజీని తట్టుకోవడం వాటికి కష్టంగా మారింది. ఇప్పుడు పరిశ్రమ దిగ్గజాలు కూడా ఈ వైపుగా కన్ను వేస్తున్నాయి. ఈనాడు సంస్థ ఇప్పటికే ఈటీవీ విన్ పేరుతో ఫ్రీ స్ట్రీమింగ్ యాప్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తమ దగ్గరున్న రేర్ మూవీ కలెక్షన్ ని ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తోంది. అల్లు అరవింద్ గుట్టుచప్పుడు కాకుండా 10 టీవీ భాగస్వామ్యంతో ఆహా యాప్ ని హడావిడి లేకుండా లాంచ్ చేశారు.

చాలా సినిమాలతో పాటు అర్జున్ సురవరం. ఖైది లాంటి కొత్త మూవీస్ కూడా అందులో వస్తున్నాయి. వెబ్ సిరీస్ లు కూడా పెట్టేశారు. ఇకపై హక్కుల విషయంలో రాజీ లేకుండా కొనాలని డిసైడ్ అయ్యారట. మరోవైపు సురేష్ బాబు సైతం ఇలాంటి ఆలోచన చేసినప్పటికీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం యుట్యూబ్ వేదికగా తమ స్వంత సినిమాలను 4K క్లారిటీతో అందుబాటులో ఉంచింది. ఈ లెక్కన మరిందరు నిర్మాతలు, కార్పోరేట్ సంస్థలు ఓటిటి వైపు చూడటం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే నిర్మాతలకు పండగే పండగ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి