iDreamPost

భాగీ 3 – ఘాటైన మసాలా కిచిడి

భాగీ 3  – ఘాటైన మసాలా కిచిడి

అనగనగా ఓ పిరికి అన్నయ్య. అతనికి పోలీస్ ఉద్యోగం వస్తుంది. ఎవరైనా గూండాలతో తలపడాల్సి వస్తే వెంటనే తమ్ముడు ప్రత్యక్షమై వాళ్ళ అంతు చూసి క్రెడిట్ సోదరుడికి వచ్చేలా చేస్తాడు. దీంతో జీరోగా ఉండాల్సిన ఖాకీ బ్రదర్ జనంలో హీరో అయిపోతాడు. ఇదంతా చదువుతుంటే ఏదో తెలుగు సినిమా గుర్తొస్తోంది కదా. అవును నాగ చైతన్య, సునీల్ తడాఖా కథ ఇదే మరి. కాసేపు దీన్ని పక్కనపెడదాం.

హీరో ఓ పెద్ద గుహ లాంటి విలన్ డెన్ లోకి ప్రవేశిస్తాడు . అక్కడ వందల్లో రౌడీలు. తల మీద ముసుగులాంటిది కప్పుకుని అన్నయ్యకు విజిల్ వేసిన ప్రతిసారి కరెంట్ ఆన్ అఫ్ చేయమని చెప్పి ఆ గ్యాప్ లో తమ్ముడు వాళ్ళందరిని చితకబాదుతూ ఉంటాడు. ఫైనల్ ఫైట్ అయ్యేలోపు గుట్టలుగా స్పృహ తప్పిన వాళ్ళ బాడీల మధ్య స్టైల్ గా అలా నడుచుకుంటూ వస్తాడు. ఏంటి ఖైది నెంబర్ 150 గురించి ఇప్పుడెందుకు అంటారా. ఇదీ కాసేపు అలా హోల్డ్ లో పెడదాం.

భీకరమైన క్లైమాక్స్ జరుగుతోంది. మూడు ఆర్మీ హెలికాప్టర్లను జాతర బొమ్మల్లాగా హీరో ఒక్కడే స్మాష్ చేసి ఒకదాని మీద ఒకటి పేర్చి వాటిపైన దర్జాగా నిలబడతాడు. అంతేకాదు వేలకొద్ది మెషీన్ గన్ బుల్లెట్లు వర్షంలా దూసుకువస్తున్నా ఒక్కటి కూడా తన సిక్స్ ప్యాక్ అర్ధ నగ్న దేహానికి తగిలించుకోకుండా అందరిని తుదముట్టిస్తాడు. అబ్బా ఇప్పుడు విజయేంద్ర వర్మ, రూలర్, వినయ విదేయ రామల గురించిన ప్రస్తావన ఎందుకు అనుకుంటున్నారా. అన్నిటికి కారణం ఉంది.

మొదట్లో సోషల్ మీడియాకు ట్రాలింగ్ మెటీరియల్ గా ఉండి ఈ మధ్య మాస్ మార్కెట్ లో మంచి ఓపెనర్ గా మారిన టైగర్ ష్రాఫ్ గురించి ఈ ప్రస్తావన అంతా. ఇతగాడి కొత్త సినిమా భాగీ 3 నిన్న విడుదలైంది. సాహో భామ శ్రద్ధా కపూర్ హీరొయిన్ నటించిన ఈ రెండున్నర గంటల కళాఖండంలో పైన ప్రస్తావించినవి జస్ట్ సాంపుల్స్ మాత్రమే. ఇలాంటివి ఇందులో బోలెడు ఉన్నాయి. చివరి దాకా కుర్చీలో కూర్చుంటే దర్శకుడు అహ్మద్ ఖాన్ కేమో కాని ప్రేక్షకులకు బెస్ట్ వ్యూయర్ గా నేషనల్ అవార్డు ఇవ్వొచ్చు.

ఇక్కడంతా తమాషాగా అనిపించినా భాగీ 3లో ఉన్నది నిజంగా ఇదే కథ. ఎక్కడో సిరియా దేశంలో ఓ మిషన్ మీద వెళ్ళిన పోలీస్ అన్నయ్య టెర్రరిస్టుల చేతికి చిక్కుతాడు. మన టైగర్ హీరో ఒక్కడే వెళ్లి అక్కడ లక్షలాది సైన్యాన్ని ఎదిరించి విధ్వంసం సృష్టించి జై జై సోదరా అంటూ వెనక్కు వస్తాడు. ఇదే స్టొరీ ఇంతే. మన తెలుగు సినిమాలను ఎంత ఖూనీ చేయాలో ఎంత వాడుకోవాలో టైగర్ శ్రోఫ్ కంటే గొప్పగా ఎవరికి తెలియదని చెప్పడం అబద్దం కాదు. అంత మహోన్నతంగా ఈ మసాలా కిచిడిని తీర్చిదిద్దారు. చూస్తుంటే ప్రేక్షకులను మరీ తక్కువ అంచనా వేసి ఓవర్ హీరోయిజంతో యాక్షన్ సీన్లకు సైతం నవ్వుకునేలా చేయడం టైగర్ ని డైరెక్ట్ చేస్తున్న దర్శకులకే చెల్లింది.

ఒకవేళ బాఘీ 3 చూడాలని డిసైడ్ అయితే మాత్రం ఓ నాలుగు పాప్ కార్న్ టబ్బులు, సరిపడా సాఫ్ట్ డ్రింక్ బాటిల్స్, తెలుగు సినిమాలను గుర్తుచేసుకోలేని వీక్ మెమరీని క్యారీ చేయగలిగితే తప్పకుండా టికెట్ బుక్ చేసుకోవచ్చు. లేదూ మాకు గుండె ధైర్యం, మనో నిబ్బరం తక్కువ అనుకుంటే మాత్రం ఆరోగ్య రిత్యా దూరంగా ఉండటం మంచిది. లేదూ బిర్యానీ అయితే చాలు దాంట్లో మసాలా ఎలాంటి వాసన వచ్చినా పర్వాలేదు అనుకున్నా భాగీ 3ని ట్రై చేయొచ్చు. నచ్చితే మీ అదృష్టం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి