iDreamPost

అనంతపురంలో రైతుపై ఎలుగుబంటి దాడి.. పరిస్థితి విషమం!

అనంతపురంలో రైతుపై ఎలుగుబంటి దాడి.. పరిస్థితి విషమం!

దేశ వ్యాప్తంగా మనుషులపై అడవి మృగాల దాడులు పెరిగిపోతున్నాయి. అడవిలో​ ఉండాల్సిన మృగాలు జనారణ్యంలోకి వచ్చి మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయి. ఎలుగుబంట్లు పెచ్చుమీరి విలయతాండవం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా తరచుగా ఎలుగుబంటి దాడి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గత జులై నెలలో కరీంనగరలో ఓ రైతుపై ఎలుగుబంటి దాడి చేసింది. తాజాగా, అనంతపురంలో కూడా ఓ ఎలుగుబంటి రైతుపై దాడి చేసింది. ఈ దాడిలో రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడ్ని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం మండంలోని కుర్లపల్లి గ్రామానికి చెందిన ఎల్లప్ప అనే రైతు ఈ ఉదయం పొలానికి వెళ్లాడు. పొలంలో ఉండగా ఓ ఎలుగుబంటి అతడి దగ్గరకు వచ్చింది. ఎల్లప్ప ఏమీ అనకపోయినా.. అది అతడిపై దాడికి దిగింది. విచక్షణా రహితంగా ఎల్లప్పను గాయపర్చింది. అతడి అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకున్నారు. జనం అక్కడికి రావటంతో ఎలుగుబంటి అక్కడినుంచి పారిపోయింది. ఎలుగుబంటి కారణంగా తీవ్రంగా గాయపడ్డ అతడ్ని వారు కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

వైద్యులు అతడికి ప్రథమ చికిత్స అందించారు. ఎల్లప్ప పరిస్థితి విషమంగా ఉండటంతో అతడ్ని అనంతపురానికి తీసుకెళ్లారు. కాగా, కళ్యాణదుర్గంలో గత కొద్దిరోజుల నుంచి ఎలుగుబంట్ల సంచారం బాగా పెరిగింది. జనం ఎలుగుబంట్ల గురించి అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి లాభం లేకుండా పోయింది. ఎల్లప్పపై ఎలుగుబంటి దాడితో జనం భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు. అసలు పొలాల్లోకి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఎలాగైనా ఆ ఎలుగుబంట్లను పట్టి తమకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నారు. మరి, అనంతపురం జిల్లాలో రైతుపై ఎలుగుబంటి దాడి చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి